పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/386

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గానశాస్త్ర చరిత్ర

వలన ధర్మము, అర్థము, కామము, అను మూడు పురుషార్థములను మాత్రమే కలుగజేయునట్టి దాన, యజ్ఞ, జపాదుల కంటెను సంగీతము ఉత్కృష్టమైనదిగా చెప్పబడినది. గానము యజ్ఞాంగముగ గూడ వినియోగ మగుచున్నది. పూర్వము బ్రహ్మ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వవేదము అను నాలుగు వేదముల నుండి క్రమముగా వాద్య, అభినయ గీత రసములను సంగ్రహించి గాంధర్వ వేదమును నిర్మించెను. అట్టి గాంధర్వ వేదమే కాలక్రమమున నాట్యవేదము. భరతము, తౌర్య త్రికము, సంగీతము అను పేర్లతో వ్యవహరింప బడుచు వచ్చినది. నేడు సంగీతశాస్త్ర మనునది వ్యవహారములో ఉన్నది. గీత, వాద్య, నృత్యముల చేరిక యే సంగీతమని ప్రథమమున నిర్ణయింపబడినది. తరువాత కొందరు గీతవాద్యముల చేరిక యే సంగీతమని వ్యవహరించిరి. నేడు కేవల గాను పరముగనే ఈ పదము వినియోగమగు చున్నది.

గీతము సామవేదము నుండి ఉద్దరింప బడినది. బ్రహ్మ దీనిని భరతమునికి ఉపదేశించెను. పిమ్మట భరతముని తన నూర్గురు కుమారులకు బోధించెను. తదాది కాలక్రమమున అనేకులు ఈ విద్యను ఉద్ధరించుచు గ్రంథములను రచించి యుండిరి.

(1) పదునైదవ శతాబ్దము వరకు గల గ్రామరాగకాలము. (2) అప్పటి నుండి పదునెనిమిదవ శతాబ్దము వరకు గల మేళ రాగకాలము. (3) అప్పటి నుండి నేటివరకు గల ప్రస్తార మేళరాగ కాలము - అని చారిత్రక కాలమును మూడు విభాగములుగ చేయదగును.

గ్రామరాగకాలము (క్రీ.శ. 15వ శతాబ్దము వరకు): గ్రామరాగకాలమున భాషారాగ విధానము గాంధర్వ వేదమున కలదు.

పంచభరతులు : శారదాతనయుని "భావప్రకాశము"న పంచభరతులనుగూర్చి చెప్పబడెను. వీరు (1) భరతుడు, (2) మతంగుడు, (3) నంది కేశ్వరుడు, (4) దత్తిలుడు, (5) కోహలుడు అనువారు.

(1) భరతుడు: ఇతడు క్రీ. పూ. 4 వ శతాబ్దమున “నాట్యశాస్త్రము” ను రచించెను. అందాతడు విశేషముగ నాట్యమునుగూర్చి చెప్పెను. అందు (1) సాత్త్విక, (2) ఆంగిక, (3) వాచిక, (4) ఆహార్యములు అను విభాగములు గలవి. అది 36 అధ్యాయములు గల గ్రంథము. నాట్యోత్పత్తి, ప్రేక్షక గృహలక్షణము, దైవతపూజ, తాండవలక్షణము. పూర్వరంగము, అంగాభినయము, చారీవిధానము, మండలకల్పనము, గతిప్రచారము, అష్టోత్తశతకరణములు, నటీనటుల వేషము, అలంకారము, దుస్తులు, వీరి అవస్థాభేదములు, రంగప్రవేశ నిష్క్రమములు, వాచిక విధానము, ఛందోలక్షణము, దశరూపకములు, నాల్గువృత్తులు, ఎనిమిది రసములు, నాట్య ప్రయోజనము - ఈ అంశములు అందు విపులముగా చెప్పబడినవి. గాన విషయమున శ్రుతులు, స్వరావళి, స్వరసాధారణములు, మూర్ఛనలు, జాతులు మున్నగునవి విశదీకరింపబడినవి.

(2) మతంగుని "బృహద్దేశి" అచ్చయినది. అందు భాషాదిరాగములు మార్గసంగీతముగ నెంచి, గ్రామ మూర్ఛనలు, జాతిరాగములు చెప్పెను.

(3) నందికేశ్వరుని " నందీశ్వర సంహిత" నుండి గ్రహింపబడిన ఉదాహరణములు 17 వ శతాబ్దమునాటి “సంగీతసుధ” యందు కలవు. నందికేశ్వరుని గ్రంథము అలభ్యముగ నున్నది.

(4) దత్తిలాచార్యుని "గాంధర్వ వేదసారము"న స్వరమూర్ఛనలతో గ్రామరాగములు తెలుపబడెను. ఈ గ్రంథము గూడ అలభ్యముగ నున్నది.

(5) కోహలుని “సంగీతమేరు" అను గ్రంథముగూడ అలభ్యముగ నున్నది. స్థాయియందు, అనగా, ఏడు స్వరములందు 22 శ్రుతులు ఎంచెను. ఏడు భాషారాగములు తెలిపెను.

భారతీయ సంగీత సంప్రదాయమునకు ముఖ్య గ్రంథమగు “నాట్యశాస్త్రము"నకు పెక్కురు వ్యాఖ్యాతలు వెలసిరి. వీరిలో (1) ఉద్భటుడు, (2) లొల్లటుడు, (3) శంకుకుడు, (4) భట్టనాయకుడు, (5) రాహులుడు, (6) భట్ట యంత్రుడు, (7) అభినవగుప్తుడు, (8) కీర్తిధరుడు, (9) మాతృగుప్తుడు అనువారు ముఖ్యులు. కొందరు నాన్యదేవ, భోజదేవ, సోమేశ్వర, మమ్మటాదులు భరతుని నాట్యమునకు సంబంధించిన వివిధాంశములను పురస్కరించుకొని స్వతంత్రగ్రంథములు వెల

337