పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/382

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గానము

స్వభావమునుబట్టియు, తీవ్రము, కోమలము, మృదులము, తీక్ష్ణము, మధురము, వికృతమునైన ధర్మములను కలిగి యుండు నాదము శిరఃప్రభృతిపాద పర్యంతము కలనాడులను, ధమనులను, రక్తనాళాదులను స్పందింప చేయును. దానివలన యావద్దేహపర్యంతము భావోద్రేకోద్దీపనములతో కూడిన వలనములతో రక్తావర్తములు కల్గును. అంతట నవి ఆక్షేప విక్షేపాదులకును, సంక్షోభ విక్షోభములకును ఆకరమగు చైతన్యమువలన కలుగును. ఈ చైతన్యము వ్యక్తిగత స్వభావమును బట్టియు సన్ని వేశమును బట్టియు, తత్తద్రాగరస భావ ప్రకర్ణస్థితినిబట్టియు, మంద్ర, మధ్యమ, తారస్థాయిలును కూడినదై తత్త దుచితఫల ప్రయోజనములను కల్గించుచుండును. అట్టి మహాశక్తిగల నాదము ప్రధాన ధర్మముగాగల సంగీతము సృష్టియందలి సదసత్ప్రవృత్తులతో నిండియున్న యావజ్జీవరాశిని ఆకర్షించి ఆయా విభిన్న ప్రవృత్తులపై తన ప్రభావముద్రను శ్రవణాపాతముతోడనే ముద్రించి, లోగొని, సదసత్ప్రయోజనములను కల్గించుటలో సందేహము లేదుకదా ! "శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగాన రసం ఫణిః" అను వాక్యము ఈ యంశమునే సుస్పష్ట మొనర్చుచున్నది. పూర్వప్రపూర్వములగు ఏ యనుభవములనో, ఏ స్మృతులనో రేపుచు, క్షోభమునో చైతన్యమునో కల్గించుట రమణీయదృశ్యములకు, మధుర శబ్దములకును సహజమని మహాకవి కాళిదాసు ధీరనాయకుడైన దుష్యంతునినోట "రమ్యాణివీక్ష్య మధురాంశ్చనిశమ్య శబ్దాన్, పర్యుత్సుకోభవతి యత్సుఖితోపిజంతుః" అని అనిపించినాడు. అనేకవిధముల ఆధికారికసంపద కల్గిన దుష్యంతాది మహానాయకులకే గానాకర్ణనమున చిత్తవికారము దుస్సహమగునెడ సామాన్య ప్రకృతులలో కల్గు చిత్తవికారము మరింత దుస్సహమగునను నంశమున సందియముండబోదు. కావుననే గానకళకు శాస్త్ర మవశ్యంభావియగు చున్నది. అందునను, నిత్యజీవిత వ్యవహారమునకు మూలములగు అర్థకామములను కళాధర్మముతో మేళవింప జేసికొని, ధర్మపురస్కృతముగ మధుర మార్గమున విషయములను అనుభవించుచు, మోక్షమును లక్ష్యముగ జేసికొని జీవించుటయే, భారతీయుల సంస్కృతి యందలి విశిష్టత. ఇట్టి భారతీయుని నిత్యజీవిత తరంగముతో మధుర నాదాత్మకమగు గానకళ అవినాభావ సంబంధ మేర్పరచుకొని యుండుట అబ్బురముకాదు. గానమునకు ప్రవేశములేని జీవితము ఏభారతీయ సంస్కృతి యందును కానరాదు. భారతీయుని ప్రవృత్తికిని, ప్రవర్తనమునకును ఆచార్యత్వము వహించి, ఆదర్శము దిద్దిన వేదచతుష్టయమునందు నాదస్వర ప్రధానమైన సామవేద మొకటిగానుండుట, గాంధర్వవేద ముపవేదమై భారతీయుని విజ్ఞానమునకు మకుటాయమానముగ నుండుటయు భారతీయుల గానకళాభిరతికి ఉపబలకములు. గానకళకును మానవజీవితమునకును ఇంత యవినాభావసంబంధ ముండుటచేతనే, రంజకగుణప్రధానమై, చిత్తవిభ్రాంతిని కల్గించుట కవకాశము గల గానకళవలన లోకభద్రతకు భంగము వాటిల్లి ఉపద్రవము లుప్పతిల్లుట కవకాశము లుండుటవలన, అన్నిటికంటెను గానకళకు శాస్త్రావశ్యకము హెచ్చుగా కన్పించుచున్నది. నట, విటులతో కలిపి గాయకులను కూడ పంక్తిబాహ్యులుగ నిషేధించుటయు, 'గాయతే బ్రహ్మచారిణే న దేయమ్' అని నిషేధించుటయు పైన సూచించిన విప్లవోత్పాతములను నివారించుట కొరకేనని తెలియుచున్నది. ఈ సందర్భముననే సుప్రసిద్ధ గ్రీకు తత్త్వవేత్తయగు ప్లేటో మహాశయుడు "పవిత్ర సృష్టిసంకల్పమగు కల్యాణపంథనుండి ఈశ్వరపుత్రులను సులభముగ వంచితులను జేయు నాట్యాదులను మానవులకు నేర్పుట కూడనిపని. ఆత్మశక్తిని వికసింపజేయు సంగీతమునే మానవులకు నేర్పవలసి యున్నది." అని పేర్కొని యుండుట కూడ గమనింపదగినది.

ఇక శాస్త్రమువలన గానకళకు కలుగు ప్రధాన ప్రయోజనములను వరుసగ చూచుకొందము. నాదము, స్వరము, రాగము, తాళము, సాహిత్యము, సాహిత్యభావము మున్నగు గానకళాప్రధానాంగముల ఉత్పత్తిని, పరిణామమును, ఆయా సందర్భములలో వాటి ప్రామాణ్యాప్రామాణ్యములను, ప్రాధాన్యాప్రాధాన్యములను తెలిసికొనుట, శాస్త్రజ్ఞానమువలన కలుగు చిత్తసంస్కారముతో లోకకల్యాణముకొరకు మాత్రమే, నిష్కామ ప్రవృత్తితో గానకళను ప్రచలింపజేయుట, నిర్దిష్టపద్ధతితో నిర్దుష్టమైన సంగీత కళాసృష్టి నొనర్పగలుగుట, శాస్త్ర సంస్కారమువలన కల్గిన- తెలిసికొనబడిన బహువిధరూప

333