పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/381

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గానము

సంగ్రహ ఆంధ్ర

ముందే గణపతి హోమము గావించి బ్రహ్మచారికి పెరుగన్నముతో భోజనము పెట్టి, సూర్యోదయానంతరము రంగవల్లులతో సింహాకృతి రచించి, స్వస్తికము, సర్వతో భద్రము లిఖించి, వానిపై దీపారాధన గావించి, మొదట గణపతిని ఆవాహనచేసి, పూజించి జొన్న పేలాలు నివేదింతురు. గణపతిని విసర్జించకుండనే దేవీపూజ నిర్వర్తించి, దేవిని విసర్జించిన తరువాత గాని గణపతిని విసర్జించరు. దీని అభిప్రాయము బహుశః, గణపతిసేవ జరుగుచున్నంత వరకును పుత్రప్రీతిచే అంబికయు ప్రసన్నురాలై యుండునని కావచ్చును.

తమిళనాడులో గణపతి చాల ముఖ్యమయిన ఇలవేలుపు. పిళ్లయార్ కోవెలలేని గ్రామము అరుదు. ప్రతి గోపురముపైన, ప్రతి యింటిపైన వినాయకుని విగ్రహము చూడగలము. విఘ్నేశ్వరునకు ప్రణామము చేయునపుడు ఆ ప్రాంతపు జనులు విశేషభక్తిప్రపత్తులతో గుంజిళ్లుతీయుట, కణతలపై పిడికిళ్ళతో గ్రుద్దుకొనుట, ఆ విధాన మెరుగని క్రొత్తవారికి వింతగా కన్పించును. ఆంధ్రప్రాంతములో గూడ గుంజిళ్ళుతీయు ఆచారము కలదు. కాని వినాయక చవితి అనబడు భాద్రపద శుద్ధ చతుర్థినాడు మాత్రమే ఇట్లు చేయుదురు. ఆనాడు పార్థివ గణపతిని పూజించుటకు ఊరుంబాలెములు తిరిగి నేరేడు, మారేడు, నెలవంక, మామిడి ఆకులను, దూర్వార, చెంగల్వ, ఉత్తరేణి పత్రములను, వివిధ పుష్పజాతులను వేరువేరుగ తెచ్చి వేడుకతో పూజించు ఆచార మున్నది. గణపతి నవరాత్రుల ఉత్సవముచేయు అలవాటు కలదు. మహారాష్ట్ర దేశమున గణపతిపై చాల ప్రియము. ఔత్త రాహులలో సామాన్యజనము రామకృష్ణులకు, కాళీ మాతకు చూపు భక్తి మరి యే మూర్తికిని ఇవ్వరు. శిష్టులలో గాణపత్యము లేకపోలేదని యనుకొనవచ్చును.

ఈ విధమున భారతదేశమందు ఆసేతు శీతాచలము, ఆబాలగోపాలమునకు విదితమైన జాతీయ దైవము గణపతిదేహముపై తప్తాంకలింగ చక్రధారణము లేకుండ, సురాపాన స్వేచ్ఛావిహారము లేకుండ, శ్రద్ధాభక్తులతో చేయబడు గణపత్యుపాస్తి ప్రశస్తము. అధవా, ద్వంద్వ మోహనిర్ముక్తులు కాని సాధారణ జనులు చేయునట్టి గణపతిదేవతాపూజ ఏ దేశాచార ప్రకారము జరిగినను, ఆయా సంప్రదాయములోని వారలకు నిఖిల పురుషార్థముల నొసగగలదని శాస్త్రసిద్ధాంతము.

వే. వే. సు. శా.


గానము :

ఏ కళకైనను, ఏ విద్యకయినను శాస్త్ర మత్యంత ప్రధానమైనది. కార్యాకార్యవ్యవస్థితి యందు నిర్దుష్టమైన, నిష్కర్షయైన విచక్షణాజ్ఞానమును కల్గించుటేగాక, ధర్మసమ్మతముగ నాయా విద్యలకును, ఆయా కళలకును ప్రమాణత్వమును కల్గించుటకు శాస్త్రములే సమర్థములు. సమస్త విజ్ఞానానుభవములచే పరిపక్వమైన మేధస్సంపద గలవారును, తత్ప్రకటన దక్షులును ఐన మహాయోగులును, వీతస్పృహులును, స్వార్థరహితులునై, ఆచార్య పరంపరకు చెందిన ఆధికారిక పురుషులు లోకకళ్యాణము నాశించి రచించిన శాస్త్రములు మానవ సంఘమున కత్యంత ఉపాధేయము లనుటలో సందేహ మేమియును లేదు. "శాస్త్రం యత్ప్రమాణం కురుతే తదనువర్త నీయం" అను వాక్యమువలన పై యంశము స్పష్టపడుచున్నది. అనిష్టమును, అరిష్టమును, అమంగళమును పరిహరింపగల సమర్థతకూడ శాస్త్రమునకే కలదను నంశము కూడ “శాసనాత్ శాస్త్రమ్" అను వాక్యముచే తెలియబడుచున్నది. శాస్త్రకారులయిన మహా ఋషులు బహురూపమగు లక్ష్యప్రపంచమును మనమునం దుంచుకొని, ఆయా లక్ష్యములలో ఉత్తమములయిన వాటికి ప్రమాణత్వమును కల్పించుటకై శాస్త్రములను నిర్మించిరి. అట్టి శాస్త్రజ్ఞానముచే చిత్తసంస్కారమను ఉత్తమ ప్రయోజనము తప్పక సిద్ధించును.

శ్రావ్యము, చిత్తాకర్షకము, నాదాత్మకము, రంజక గుణప్రధానము, ఆకృతివహించు మధ్యమవాక్కునుండి జనించినదియునైన గానకళకు శాస్త్రమువలన నెట్టి ప్రయోజనము సిద్ధించుచున్నదో తెలిసికొందము.

విద్యాధిష్ఠాత్రియగు సరస్వతికి మిక్కిలి ప్రీతిపాత్రములైన సంగీత, సాహిత్యములలో సంగీతము ఆపాతమధుర మగుటకు కారణము అది నాదాత్మకమును, రంజకగుణ ప్రధానము నగుటయే.

గానమునకు జన్మస్థానమగు నాదము స్పందనాత్మకము. ఉచ్చరింపబడు శబ్దముయొక్క బలమునుబట్టియు,

332