పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/377

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గాజులబండ

సంగ్రహ ఆంధ్ర

సంబంధించిన మూడక్షరములు బ్రాహ్మీలిపిలో కనబడు చున్నవి. ఈలిపిలక్షణములనుబట్టి ఇది క్రీస్తుశకము మొదటి లేక రెండవ శతాబ్దము నాటిదిగా పరిశోధకులు నిర్ణయించినారు. బౌద్ధమతాచారములననుసరించి రెండువేల సంవత్సరముల క్రిందట ముఖ్యభాండములపై తమ నామధేయములను లిఖించుట సంప్రదాయముగా నుండెను.

గుట్టమీది శిలాతలమునకు దక్షిణదిశయందు ధర్మ చక్రాకారమున గట్టబడిన ఒక స్తూపము దృగ్గోచరమైనది . ఈ స్తూపము 30 అడుగుల వ్యాసము కలది. చక్రమునకు ఉండవలసిన ఆకులు, నడిమిబొడ్డు పరిపూర్ణముగా నున్నవి. పశ్చిమదిశయందు చైత్యవిహారము యొక్క శిథిలములు కనబడినవి. చైత్యవిహారము తూర్పుముఖముగా నున్నది. ఇది సుమారు 24 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు కలదిగానున్నది. వాయవ్యదిశయందు మరియొక చైత్యము యొక్క శిథిలములు గోచరమగుచున్నవి. మరికొన్ని కట్టడముల చిహ్నములు అంగణమున కనబడుచున్నవి. వాటి నామరూప స్వభావాదులు ఇంకను బాగుగ తెలియలేదు.

ఇతర బౌద్ధ క్షేత్రములందువలెనే కట్టడములకు పెద్ద పెద్ద ఇటికలు వాడియున్నారు. ఇచ్చటి ఇటికలు 2 అడుగుల పొడవు, ఒక అడుగు వెడల్పు, 3 అంగుళముల మందము కలిగియున్నవి.

గాజులబండలో దొరకిన భాండ సామగ్రి ఆంధ్రదేశములోని పెక్కు బౌద్ధక్షేత్రములలో కనుగొనబడినట్టిదిగానే యున్నది. అత్యంతముగ పదునుచేసిన మెత్తనిమట్టి మిశ్రమముతో భాండముల నిర్మాణము జరుగుచుండెను. ఈ భాండములను ఆవములో కాల్చి పక్వము చేసినప్పుడు భాండము యొక్క రంగు పలుచని నల్లరంగు కలదిగానో, సాదాగులాబీరంగు కలదిగానో మారును. కుండలమీద చిత్రించుటకు సర్వసాధారణముగా గాఢరక్తవర్ణమును ఉపయోగించుచుండిరి. కొన్నికుండలమీద మీగడరంగులో చిత్రణములు కలవు. రంగు ఒక్కొక్కచోట పలుచగను, మరికొన్నిచోట్ల ఒత్తుగను పూసినట్లు కనబడుచున్నది. కొన్ని భాండశకలముల లోపలిభాగములో నలుపురంగు పూసినట్లుగా గనపడుచున్నది. కుండలమీద పెక్కు రంగులతో చిత్రించబడిన పువ్వులు, లతలు, తాంత్రిక చిహ్నములు అపరిమితముగా, వివిధములుగా నున్నవి.

పూర్వకాలమునాటి శిల్పకళావిన్యాసమునకు ఉదాహరణముగా, అత్యంత శోభావంతములయిన కళాఖండములు భూగర్భమున దొరకినవి. గచ్చుతో నిర్మితమయిన

చిత్రము - 100

గాజులబండ - సున్నపురాతిపై చెక్కబడిన శిల్పవిన్యాసము

మానవ శిరస్సులు ముఖ్యముగా పేర్కొనదగినవి. ఇవి ఆనాటి ప్రజల శిల్పకళా నైపుణ్యమును, అంతరంగిక భావ ప్రకటనా సామర్థ్యమును, వాస్తవిక దృష్టియు, రూపురేఖా నిర్మాణ కౌశల్యమును ఎంత గొప్పస్థాయిలో నుండెనో అధికముగా వ్యక్తీకరించుచున్నవి. ఈ శిరస్సులు దక్షిణాపథమందలి ఆదిమవాసుల ముఖవైఖరులను పోలి యుండును. ఒత్తు పెదవులును, వెడల్పగు నాసికయు ప్రస్ఫుటముగా గనుపడుచుండును.

గాజులబండ పరిశోధన కార్యము ఇంకను పరిపూర్తి కాలేదు. త్రవ్వకములు పూర్తి అయినచో బౌద్ధాంధ్ర

328