పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/376

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గాజులబండ

గాజువస్తువులు తయారుకాబడుచున్నవి. వంపైన కళ్ళద్దములును (crooked spectacles), అతి ప్రకాశమును నివారించు (anti glare) కొన్ని రకములయిన కళ్ళద్దములును పూర్వనీలలోహిత కిరణములను (ultra-violet rays) లోనికి చొరనీయక నిరోధించును. అయినను, దృశ్యమానకాంతి కిరణములను (visual rays) ఈ అద్దములద్వారా చూడవచ్చును. ఈ పైగుణములన్నియు శ్రీకము (cerium), డిడిమియము (didymium) అను లవణపదార్థములను ఉపయోగించుటచే గుర్తింపబడు చున్నవి.

అలంకరణ వస్తువులకొరకు పెక్కురంగుల మెరుగు గాజు తరచుగా ఉపయోగింపబడును. దీనిని 'ఫ్లాషింగు గ్లాస్' అని పిలిచెదరు. గడ్డకట్టిన తెల్లని గాజుపదార్థము లోనికి కరిగిన గాజును ఊది, అనంతరము దానిని రంగు గాజు ద్రవములో ముంచి, మరల తుదిసారిగా ఊదుదురు. రంగుగాజు ద్రవములో ముంచిన పిమ్మట, గాజువస్తువు యొక్క వెలుపలిభాగముపై పలుచటి రంగుపొర ఏర్పడును. గుండ్రని సానరాళ్ళపై (abrasive wheels) గాజును అరగ దీయుటవలనను, రంగుపొరమీద ద్రావకముల సాయముతో అలంకరణములను చిత్రించుటవలనను, గాజు వస్తువులకు మనోహరమయిన అలంకారమును కల్పింపవచ్చును.

బాయిలర్లలో అధిక మైన ఒత్తిడికి తట్టుకొనగల దృఢమయిన గాజుపలకలను తరచుగా వాడుచున్నారు. ఇట్టి పలకలు బాయిలర్లకు రక్షణగా అమర్చబడును. అధికోష్ణ మొనర్పబడిన మందపుగాజు పలకను వెచ్చటి నూనెలో వేసినచో వెలుపలిభాగము చల్లారును. గాజు పగులక, దాని లోపలిభాగము యధాప్రకారముగ నునుపుగనే యుండును. లోపలిభాగము చల్లబడగనే, అది సంకోచము చెందును. అప్పుడు ఉపరిభాగము కుదించుకొనిపోవును. ఇట్లు జరిగిన పిమ్మట ఉపరిభాగము పై ఏర్పడిన పగుళ్ళు, విస్తరించుటకు మారుగా మూసికొనిపోవును. అట్టి గట్టి పడిన రేకు (plate) పగిలిపోవుటకు బదులుగా ఎట్టి గొప్ప బాహ్యశక్తినైనను నిరోధించగలిగి యుండును. ఒకప్పుడు సెల్యులాయిడ్ పలకలను రెండు గాజుపలకల నడుమ బిగించి తాపటముచేసినచో (గాజుపలకలు సెల్యు లాయిడ్ పదార్థముతో సంపర్కము చెందుటవలన), గాజుపలకలు పగులనేరవు. ఈ విధానమువలన 'పగులని గాజులు' (unbreakable glasses) ఏర్పడుచున్నవి.

అ. ఆ.


గాజులబండ :

హైదరాబాదుపురాతత్త్వశాఖవారు 1947 సంవత్సరములో 'గాజులబండ' బౌద్ధారామమును కనుగొన్నారు. గాజులబండ బౌద్ధారామము నల్లగొండజిల్లా, సూర్యాపేట తాలూకాలో ఏటూరు గ్రామ సమీపమున నున్న గుట్టల ప్రాంతమున గలదు. గాజులబండ ఆంధ్రదేశములో విరాజమానములయిన బౌద్ధక్షేత్రములలో నొక్కటిగా విలసిల్లినట్లు పరిశోధకులు నిర్ణయించినారు. మరియొక బౌద్ధ క్షేత్రముగా 1940 లో కనుగొనబడిన ఫణిగిరి బౌద్ధవిహారమునకు ఇది 5 మైళ్ళ దూరములో నున్నది.

గాజులబండలో పురాతత్త్వ శాఖవారు త్రవ్వకములు సాగించగా బౌద్ధయుగమునాటి చిహ్నములు కనబడినవి. ఈ అవశేషములు పరిసర ప్రదేశమునందలి భూతలమునకు సుమారు 50 అడుగుల ఎత్తున బ్రహ్మాండమయిన నొక ప్రస్తరతలముపై నెలకొనియున్నది. ప్రాచీన కట్టడముల శిథిలావశేషములు ఒక దిబ్బరూపముగా ఏర్పడి యున్నవి. అచ్చట సులభముగా కుండల పెంకులు, ఇటికలు ఏరుకొనవచ్చును. గాజులబండలో దొరకిన వస్తు జాలమునుబట్టి రెండువేల సంవత్సరముల క్రిందటి మన పూర్వుల సంస్కృతీ సభ్యతలు ఎంత గొప్పవో తెలిసికొన వచ్చును.

ఈ క్షేత్రముయొక్క వయః పరిమాణమును నిర్ణయించుటకు రెండు ప్రబలాధారములు దొరకినవి. ఒకటి చిన్న సీసపు నాణెము. ఈ నాణెమునకు ఒక వైపున ఒక గజ విగ్రహముకలదు. మరియొక వైపున స్వస్తిక చిహ్నము కలదు. ఆంధ్రరాజులు అత్యంత ప్రాచీన కాలములో ముద్రించిన సిక్కానాణెముగా ఇది భావింపబడుచున్నది. ఆంధ్రరాజుల ప్రారంభదశలో ఈ నాణెము చెలామణిలో నున్నట్లు తేలుచున్నది. రెండవ ఆధారము, వంకర టింకరగానున్న భాండశకలములు. ఈ శకలములు సుమారు మూడడుగుల పొడవు. అంతే వెడల్పు కలిగినట్టివిగా నున్నవి. ఒక భాండశకలము మీద ఒకానొక బౌద్ధగాథకు

327