పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/375

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గాజు పరిశ్రమ

సంగ్రహ ఆంధ్ర

లను మాంగనీసువంటి కొన్ని ప్రత్యేక విరంజన ద్రవ్యములను కలుపుటవలన తొలగింపవచ్చును.

తయారుచేయు విధానము : స్వల్ప మొత్తములలో (small batches) గాజును కరిగించుటకు కాలిన సుద్దమన్ను (fire clay) తో చేయబడిన మృణ్మయపాత్రలు ఉపయోగపడుచున్నవి. ఇనుము కాని, మరి ఏ యితర నిషిద్ధము లయిన కల్మష పదార్థములు గాని లేని మృదువైన సుద్ద మన్నులో అవసరమయిన నీటినికలిపి కొంత కాలమువరకు అట్లే ఉంచవలెను. ఈ సుద్దమన్ను ఎండిన పిదప అది సహజముగ సంకోచము చెందును. దాని యందు 25-30 శాతము ప్రమాణము గల మెత్తని కాలిన మన్నును (grog) కలిపెదరు. ఇట్లు కలిపినచో, సుద్దమన్ను అంత అధికముగా సంకోచము చెందదు. మరియు, ఈ మన్నుతో తయారగు పాత్రలను వేడిచేసినప్పుడుగాని లేక వాటియందు గాజును కరుగబెట్టినప్పుడు గాని అవి పగులవు. సామాన్యముగా కొలిమికి (furnace) ధూమము (Producergas) తో ఉష్ణము కలిగించెదరు. ధూమము, గాలియు కలిసి కొలిమియందు ప్రవేశింపగనే మంట ప్రారంభ మగును. మంట ప్రారంభ మగుటకు పూర్వమే పై జెప్పబడిన రెండు పదార్థములు, ఉష్ణధారణ దక్షత (thermal efficiency) అధిక మగుటకై పునరుద్ధారక గొట్టముల (regenerators and recuperators) ద్వారా కొలిమిలోనికి పంపబడుచు, వేడి చేయబడును.

గాజును తయారు చేయుటకై సిద్ధపరుపబడిన మిశ్రమ ద్రవ్యములన్నియు క్షుణ్ణముగా చూర్ణము చేయబడి సంపూర్ణముగా సమ్మిళిత మొనర్పవలెను. ఈ మిశ్రమము త్వరగా కరగుటకై పగిలిన గాజుముక్కలను (cullets) దానిలో కలిపెదరు. గాజు కరగుచున్న సమయములో కర్బనముల (carbonates) యొక్కయు నత్రజనుల (nitrates) యొక్కయు, ఇతర పదార్థముల యొక్కయు క్షయకరణము (reduction) మూలమున, గ్యాసు (gas) పై భాగమునకు వచ్చును.

గ్యాసు సంపూర్ణముగా వెలికిరాక లోననున్నచో, తడిసిన బంగాళాదుంపలనుగాని, తడిసిన కొయ్యముక్కలనుగాని కరగెడి గాజులో వేసిన యెడల గ్యాసు వెలికి వచ్చును. ఇట్లు జరుగుటవలన ఆవిరితో నిండిన పెద్ద బుడగలు కరిగిన గాజుపై తేలి గాజు మరింతగా కలిసిపోవుటకు అవకాశమేర్పడును. కరగని ద్రవ్యములు అందున్న యెడల ఉష్ణోగ్రతను అధికతర మొనర్పవలసి యుండును.

సులోచనములకు ఉపయోగపడు గాజును కరిగించునపుడు కొన్ని విధములయిన చారలు (Veins and striae) తయారయిన గాజు పదార్థములమీద ఏర్పడ కుండుటకై మరగుచున్న గాజుద్రవమును బాగుగా కలియబెట్ట వలయును (stirring). కరగుచున్న గాజు పదార్థమును డొల్లగానుండు పొడవైన ఇనుప గొట్టము యొక్క చివరి భాగముతో వెలికితీసి, దానిని నేర్పుతో గుండ్రముగ త్రిప్పుచు కావలసిన ఆకృతులుగల మూసలలోనికి ఊదుదురు. ఈ విధముగా ఉద్దిష్టములయిన వస్తువులు తయారగును. మాల రూపముననుండు మండెడు చిమ్నీలను, గోళాకారముననుండు ఇతర వస్తువులను రూపొందించుటకై కరగుచున్న గాజును గొట్టముల ద్వారా మూసలలోనికి ఊది, అది గట్టిపడిన వెంటనే, మూసను రెండు భాగములుగా విడదీసి, గాజువస్తువును వెలికి తీయుదురు.

గాజు సామానులను - ముఖ్యముగా సీసాలను - విస్తారముగా ఉత్పత్తి చేయుటకై స్వశక్తి ప్రేరిత యంత్రమును (automatic machine) ఉపయోగించెదరు. కరగిన గాజుపదార్థము ఈ యంత్రములోనికి వలసినంత మాత్రమే ప్రవేశించునట్లు ఏర్పాటు చేయబడి యుండును. టాంకు కొలుముల (tank furnaces) వద్ద ఇట్టి స్వశక్తి ప్రేరిత యంత్రములు అధికతరముగా వినియోగింపబడు చున్నవి.

గాజువస్తువులు తయారయిన వెంటనే అవి పగిలి పోకుండుటకై మెల్లగా చల్లార్పబడవలెను. కొన్ని వత్తిడులకు (stresses) గాజు వస్తువులు లొంగి తుదకు పగులుట సంభవించును. అందుచే ఈ వత్తిడులను తగ్గించుటకై, గాజు వస్తువులు తయారయిన వెంటనే క్రమ విధానములో వాటిని చాల నెమ్మదిగా చల్లార్చుట అవసరమగుచున్నది. ఈ విధానముచే గాజు వస్తువులకు గట్టి దనము కలుగును.

ప్రత్యేకావసరముల నిమిత్తమై పలురకములయిన

326