పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/374

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గాజు పరిశ్రమ

ముల పళ్ళెములు (discs) ఉత్పత్తిచేసెను. ఇవి దూరదర్శక (telescopic) పరికరములను నిర్మాణము చేయుటకై అనుకూలపడెను.

ఫారడే (1824), హార్ కోర్ట్ (1834 - 1871) అను ఇంగ్లండు దేశీయులును, స్కాట్, అబ్బె (1880) అను జర్మనీ వాస్తవ్యులును ప్రత్యేక తరగతికిచెందిన గాజు పదార్థములను తయారుచేసి, కళ్లద్దములను నిర్మాణము చేయుట కుపయోగపడు పలురకములగు ధాతువుల (metals) సంఖ్యను, ఆ ధాతువులయొక్క భౌతిక ధర్మములకు సంబంధించిన పరిజ్ఞానమును అభివృద్ధిపరచిరి.

వర్గీకరణము : గాజుయొక్క ఉపయోగమునుబట్టి, దానిని పలురకములుగా వర్గీకరింప వీలగును. ఉదా : కిటికీగాజు, సీసాగాజు, ఉక్కు మూసలో నొక్కి చేయు గాజు (pressed glass), బోలుగానున్న ఉక్కు గొట్టముతో ఊదబడెడిగాజు (blown glass), సులోచనముల గాజు. సులోచనములకు ఉపయోగపడుగాజు (optical glass) వీలయినంత వరకు పారదర్శకముగా (transparent) ఉండవలెను. తక్కిన రకములకు చెందిన గాజు పదార్థము రంగుగలదిగా నైనను లేక స్వచ్ఛత గలదిగా నైనను ఉండవచ్చును.

మిశ్రమము : కొన్ని రకములయిన కళ్లద్దములకు ఉపయోగపడు గాజులో ఆమ్లపు ఇసుక ( acid silica) కలియ కున్నను, ఇతరములయిన అన్ని గాజుపదార్థములయందును ఇసుక (silica) ప్రధాన ద్రవ్యమై యున్నది. పై పేర్కొన బడిన కొన్ని రకములయిన కళ్లద్దముల గాజులో ఇసుక స్థానమును స్ఫురితామ్ల నిర్జరామ్లము (phosphoric anhydride), లేక బోరిక్ ఆమ్లజనిదము (boric oxide) ఆక్రమించును. ఒక్క ఇసుకను మాత్రమే కరిగి చేయబడిన గాజునందు ఉష్ణోగ్రతయందు వేగముగా జరుగు మార్పులను నిరోధించు శక్తి కలదు. కావుననే ఈ గాజు వస్తువులను ప్రయోగశాలల యందును, రసాయన పరిశ్రమలయందును ఉపయోగింతురు.

1200-1400 డిగ్రీల సెంటిగ్రేడుల నడుమనుండు ఉష్ణోగ్రతయందు, ఇసుకతో సమ్మేళన మొనర్చి, కరిగించి గాజును తయారుచేయుటకై పెక్కురకముల ద్రవ్యములు లభ్యమగును. ఇసుకతో క్షారకామ్లజనిదము (alcaline oxide) ను మేళవించి గాజును తయారుచేసినచో, అట్టి గాజు ఆర్ద్రతాకర్షక లక్షణము (hygroscopic) ను కలిగి యుండగలదు. అనగా, గాలియందున్న తడిని గాజు స్వీకరించి, కొంతకాలమునకు పిమ్మట అది బలహీనత నొందును. అయినను సున్నమువంటి క్షారమృత్ ధాతువును (alcaline earth metal) వలసినంతగా మేళవించుటచే, వాతావరణ పరిస్థితులవలన కలుగు అరుగుదలకు గాజును లోనుగానీయక, దానికి మన్నిక చేకూర్చవచ్చును.

క్షారమృత్ ధాతువు స్థానములో సీసామ్లజనిదము (lead oxide) ను మిశ్ర మొనర్చి గాజును తయా రొనర్పవచ్చును. చెకుముకిగాజు (flint glass) ను తయారు చేయుటకై చేర్పబడు వస్తువులలో సీసామ్లజనిదము ముఖ్యమైనది. గాజు తయారుచేయుటకై కలుపబడిన పదార్థములలో కొన్నిటి యొక్క పాళ్లు అధికముగా నున్న యెడల, కరగిన గాజు మెల్లగా చల్లారునప్పుడు, స్వచ్ఛముగా (transparent) పరిణామ మొందక, దానికి కిరణ అభేద్యగుణము (devitrification) సంక్రమించును. అనగా, అది తెల్లగానుండును. గాజుకు అధికోష్ణము కలిగించి, దానిని వేగముగా చల్లార్చినచో, స్వచ్ఛమైన (transparent) గాజు రూపొందును.

ఆమ్లజనిదములను (Metallic oxides) కరగుచున్న గాజులో కలిపిన యెడల, సొగసైన పలురకములగు రంగులు గాజునందు సంక్రమించును. గాజునందు ఇనుమును కలుపుటవలన దానికి ఆకుపచ్చ రంగును, మాంగనమును' (Manganese) కలుపుటవలన ఎరుపు - ఊదా రంగును, మణిశిలను (Cobalt) కలుపుటవలన నీలము రంగును, బంగారమును, రాగిని కలుపుటవలన కెంపు - ఎఱ్ఱదనమును (ruby-red), క్రోమియమును (chromium) కలుపుటవలన ఆకుపచ్చ రంగును, వరుణమును (uranium) కలుపుటవలన పసుపు రంగుతో కూడిన ఆకుపచ్చ రంగును (yellow-green) సంక్రమింప గలవు.

ఇంచుమించు ప్రతి పదార్థ మందును కొలదిగనో, గొప్పగనో ఇనుము గర్భితమై యుండును. అందుచే ఇనుము లేకయే గాజును తయారుచేయుట కష్టము. కంటి అద్దములందు కాక, తక్కిన గాజుపదార్థము లన్నిటియందు ఇనుమువలన కలిగెడి స్వల్పపు నీలిరంగు ఛాయ

325