పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/367

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గాంధీ (ఆర్థిక సిద్ధాంతములు)

సంగ్రహ ఆంధ్ర

సూత్రములయొక్క నిజస్వరూప మెట్టిది అను విషయములోనే ఒకింత వివాదము గలదు. ఒకవంక వాటిని తారక మంత్రమువలె జపించు ఆర్థిక శాస్త్రవేత్తలు కలరు. మరొకవంక ఈ సూత్రము లన్నియు కేవలము ఒక రాజకీయవేత్త చెప్పిన ధర్మపన్నములు అని నిరసించువారును కలరు. ఆర్థికవేత్తగా గాంధిమహాత్ముడు కీన్సు, ఆడమ్‌స్మిత్తు, మిల్ మొదలగు వారి ప్రక్కన నిలువగలడా అను సందేహించువారును కలరు.

గాంధీమహాత్ముని ఆర్థిక సిద్ధాంతములలో శాస్త్ర దృక్పథము కొరవడినదని చెప్పుట ఎంతమాత్రము సమంజసము కాదు. కేవలము కొన్ని పడికట్టు రాళ్ళవంటి పదములను ఆధారము చేసికొను ఆర్థిక శాస్త్రవేత్తలవలె గాక ఆయన ఆర్థిక సమస్యలను వాస్తవిక దృక్పథముతో పరికించెను. అందుచేతనే ఆయన సిద్ధాంతములయందు, అనేక ఆర్థిక శాస్త్రవేత్తలలో కొరవడిన సుస్పష్టత. సరళత్వము గోచరించు చుండును. ఇతర ఆర్థిక వేత్తలవలెనే, గాంధీమహాత్ముడు కొన్ని ప్రాతిపదికలను ఆధారము చేసికొనెను. అంతేకాక ఆశయములకును తదాచరణ మార్గములకును మధ్య వ్యత్యాసము ఉండరాదని ఉద్ఘాటించి అతడు అర్థశాస్త్రమునకు ఒక క్రొత్త వెలుగు చూపి యున్నాడు.

గాంధీమహాత్ముని ఆర్థికసిద్ధాంతముల విషయములో ఒకటి రెండు అననుకూల విషయములనుకూడ అంగీకరింపక తప్పదు. ఆయన ఆర్థిక సిద్ధాంతములు బహుళ గ్రంథ పఠనము యొక్కయు, శాస్త్రపరిశ్రమయొక్కయు ఫలితములుగా ఉద్భవించినవి కావు. అంతియకాక ఆయన ఎన్నడును తన సిద్ధాంతములను క్రోడీకరించి వాటిని సమన్వయపరచి రూపొందించి యుండలేదు. ఆయన ఎన్నడును ఇట్టిపనికై ప్రయత్నించి యుండలేదు. ఎడతెగని రాజకీ యోద్యమములు, నిర్విరామసంఘసంస్కరణ కార్యములు కారణముగా, ఆయనకు అందులకు అవకాశము చిక్కలేదు. తక్కిన రంగములలోవలెనే ఆర్థికరంగములోను మహాత్ముడు అహింసాత్మక వ్యవస్థను ప్రాతిపదికగ చేసి యున్నాడు. అట్టి ఆదర్శవ్యవస్థ ఆధునిక మయిన కలుషిత వాతావరణములో ఆచరణయోగ్యమగునా కాదా అను సంశయము పెక్కుమందిని బాధించుచున్నది. భారతదేశమునందు ఆర్థికపరిస్థితులను వీరు గుర్తించుటయే కాక, గ్రామీణ జీవితములో మార్పులు కావించి గ్రామీణ పరిశ్రమలను పునరుద్ధరించిననాడే భారతప్రజల పేదరికమును రూపుమాపనగునని చెప్పెను. ఈ ఆశయ సిద్ధికై అవిరామముగ కృషిసలిపెను. ఇతర శాస్త్రవేత్తలకును, ఇతనికిని గల భేద మిదియే. ఈనాడు భారత ప్రభుత్వము గాంధీజీయొక్క సిద్ధాంతములనే అనుష్ఠించు చున్నది. ఆతని ఆర్థికతత్త్వ ప్రశస్తిని గుర్తించియున్నది.

గాంధిజీ తాను ప్రతిపాదించిన తత్త్వవిషయమున రస్కిన్‌చే, టాల్‌స్టాయిచే, భగవద్గీతచే ప్రభావితుడయ్యెను. వీటినుండియే సాంఘిక ప్రయోజనముకొరకు, ప్రతివ్యక్తియొక్క శ్రేయస్సుకొరకు సంఘము పనిచేయ వలయుననియు, సామూహిక శ్రేయస్సుకొరకు ఏపనియైనను నిరసింపబడరాదనియు, ఆయన అభిప్రాయపడెను. ఆర్థిక శాస్త్రవేత్తలు మానవునియందు కొన్ని లక్షణములను ఆరోపించిరి. మానవులు వస్తువులను మిక్కిలి చౌకగా దొరకు అంగడిలోనే కొందురును సిద్ధాంతము అట్టిదే. సర్వశ్రేయస్సే ఆదర్శముగాగల గాంధిజీ అట్టి సిద్ధాంతములను నిరసించెను. పైన పేర్కొనబడిన సిద్ధాంతము మిక్కిలి అమానుషమైనదిగా ఆతనిచే గర్హింపబడెను. 1937 వ సంవత్సరమునందలి 'హరిజన' పత్రిక యందు ఆర్థికశాస్త్రప్రయోజనమును ఆత డిట్లు నిర్వచించెను: “విశిష్టమయిన నైతిక సిద్ధాంతము ఎట్లు విధిగా న్యాయబద్ధమైన ఆర్థిక సూత్రమగునో, అటులనే వాస్తవికమైన ఆర్థికసూత్రముగూడ అత్యున్నతమయిన నైతిక ప్రమాణమునకు ఎన్నటికిని భిన్నము కాజాలదు. బలహీనులను పీడించి, ధనమును ప్రోగుచేయు తత్త్వమును, ధనదేవతనే ఆరాధించు మనస్తత్వమును ప్రబోధించెడి ఆర్థికవిధానమును కృత్రిమమైనట్టి, ఘోరమైనట్టి ఆర్థిక శాస్త్రము."

గాంధి మహాత్ముని ఆర్థికసిద్ధాంతములలో ముఖ్యమైనది ఆర్థిక వికేంద్రీకరణ సిద్ధాంతము (economic decentralization). ఈనాటి పరిశ్రమలలోగల లోపములను - యంత్రమునకు మానవుడు దాసుడగుటయు, గ్రామములందలి కోటానుకోట్ల ప్రజలకు జీవనోపాధి పడి పోవుటయు గ్రహించి గాంధిజీ ఈ అభిప్రాయమునకు

322