పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/364

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గర్భధారణము - ప్రసవసమస్యలు

పరిస్థితులలో కలుగవచ్చును. మావిలో కొన్ని భాగములు మిగిలిపోయి అవి రక్తగత విషదోషమునకు దారితీయ వచ్చును. ప్రసవకాలములో వాడిన పనిముట్లవలన విషదోషము గర్భాశయ రంధ్రములోనికి ప్రవేశింపవచ్చును. ముక్కలు ఏవేని ఉండిపోయిన యెడల వాటిని తీసివేయవలయును. ఈ వ్యాధివలన మరణము జరుగవచ్చును. ఈ వ్యాధి నేడు మిగుల అరుదుగా నున్నది. ఇందులకు రెండు ప్రధాన కారణములు గలవు :

(i) నేడు ప్రసవము క్రిమి వ్యతిరేక పరిస్థితులలో జరుగుట.

(ii) క్రిమిసంహారక ఔషధములు వ్యాప్తిలోనికి వచ్చుట.

అయినప్పటికిని క్రిములవలన గర్భాశయ అవయవములలో వాపులు కలిగి జ్వరము వచ్చుట, ఒక కాలు వాచుట, ఎక్కువ నెత్తురు పోవుటవలన రక్తలోపము కలుగుట మున్నగు చిక్కులకు అవకాశము కలదు. అప్పుడు సక్రమముగా రోగనిరూపణము చేసి, సరియగు చికిత్స చేయవలసియుండును.

ప్రసవానంతరము రక్తము కారిపోవుట : మావి పడునప్పుడు గాని, లేక పడిన తరువాత గాని అధికముగా రక్త స్రావము అయిన ఎడల ఒక చేతితో గర్భాశయమును పట్టుకొని మర్దనచేసి, రెండవ చేతిని గర్భాశయములోనికి పోనిచ్చి ముక్క లున్న యెడల వాటిని తీసివేయ వలయును. 'ఆర్గోమెట్రిన్'ను, 'పిట్ విటర్ ఎక్‌స్ట్రాక్టును' ఇంజక్ష ను చేయవలయును. ప్రమాదకరమైన కేసులలో గర్భాశయములోనికి 1:1000 ఎడినలిన్ ద్రావకములో ముంచిన గాజు గుడ్డను పూర్తిగా లోనికి త్రోయవలెను. ద్వారములో ఎక్కడ నైనను పగుళ్ళవలన వచ్చిన నెత్తురును పగిలినచోట కుట్టి ఆపవచ్చును. ప్రసూతి కాలములో కాళ్ళు, చేతులు చల్లబడుట ప్రసవకాలము దీర్ఘముగానుండి, అంతర్గతముగా రక్తస్రావము కలిగినపుడు సంభవించును. ఇది చాల ప్రమాదకరమైన పరిస్థితి. ఈ పరిస్థితి సర్దుకొనువరకు మరి ఎట్టి చికిత్సయు చేయరాదు. మార్ఫియా ఇంజక్ష ను ఇచ్చుట, నెత్తురుఎక్కించుట, రక్తపుపోటు పైకి పోవునట్లు చేయుట ఇందుకు జరుగ వలసిన చికిత్సలు.

గర్భాశయము పగులుట : ప్రసవమునకు ఆటంకము కలిగినపుడు గర్భాశయము పగులుట సంభవించును. ఇట్టి స్థితిలో కాళ్ళు, చేతులు చల్లబడును. దీనికి ముందుగా చికిత్సచేసి, ఆ పిమ్మట శస్త్రచికిత్స చేయవలెను. బిడ్డను తీసివేసి గర్భాశయమును కుట్టవలసియుండును. ఇది చాలా అవసరమగుటచే, వెంటనే చేయవలెను.

గొట్టపు గర్భధారణ : అండము గొట్టమునందే ఫలించి అందే పెరుగును. గొట్టము అతి పలుచగా నుండును. కాబట్టి పిండము 8-10 వారములకు మించి పెరుగ

చిత్రము - 98

పటము - 5

గొట్టపు గర్భదారణము

1. గర్భాశయము. 2. గొట్టము. 3. పిండము.

జాలదు. అందుచే అది పగిలి అంతర్గత రక్త స్రావము, కాళ్ళు, చేతులు చల్లబడుట సంభవించును. కొందరు స్త్రీలకు, వెలుపల నున్నప్పుడు క్రింది కడుపులో తీవ్రమగు నొప్పియు, రక్త స్రావమును ఏర్పడును. అట్టి పరిస్థితిలో వెంటనే చికిత్స చేయవలయును. నెత్తురు ఎక్కించి, క్రింది కడుపును కోసి, గొట్టమును తీసివైచి రక్త స్రావమును ఆపవలెను.

ఉదర కుహరములో గర్భధారణ : సిద్ధాంతరీత్యా అండము గర్భ కుహరములో పడి పెరుగవచ్చును. ఇది చాలా అరుదుగా సంభవించును. ఇట్టి ఉదాహరణములు 30 మాత్రము వర్ణింపబడినవి.

అండసంబంధమైన గర్భధారణ : అండము అండకోశములో పడి పెరుగ నారంభించును. ఇదికూడ పగులును. గొట్టపు గర్భధారణవిషయములో వలెనే ఇందును శస్త్రచికిత్స అవసరమగును.

319