విజ్ఞానకోశము - 3
గయానా (భూగోళము)
జేసెనట. అంత వసిష్ఠుడు ఆ యేరు స్నానార్హము కాకుండునట్లు శపించెనట. వైనతేయుడు ప్రార్థింప ఆదివారము లందు మాత్రము వైనతేయము స్నానయోగ్యమగునని వసిష్ఠు డనుగ్రహించెనట.
వైనతేయము మీదుగా గన్నవరము కాలువనీటిని 31/2 ఫర్లాంగుల తొట్టిలో ప్రవహింపజేయుటకు కాటన్‌దొర పర్యవేక్షణము క్రింద, లెఫ్టినెంటు జి. టి. హైగ్ నిర్వహణమున, సంకల్పింపబడిన పథకమును అప్పటి బోర్డు ఆఫ్ డై రెక్టరులు 14-2-1852 న ఆమోదించిరి. వరదలు తుడిచివేయుటకు పూర్వము పనిని ముగించు భగీరథ ప్రయత్నమునకు హైగ్ పూనుకొనెను. ముంగండ వాస్తవ్యుడు ముక్కుగణపతిశాస్త్రి యను ప్రసిద్ధ జోస్యుడు పనికి ముహూర్తము పెట్టి విస్తారమైన తన తోటలలోని మామిడిచెట్లు ఇటిక కాల్పు నిమిత్తము కొట్టివేయకుండ దొరనుండి సమ్మతి నొందెనట. ఆనకట్ట ఇటికలకొరకు ఆప్రాంతమున లెక్కలేనన్ని చెట్లు నరికివేయబడెను. నాటి ఇటిక లిప్పటి ఇటికలకంటె సుమారు ఆరు రెట్లు పెద్దవి. కూలివాండ్రంత పెద్ద ఇటికలను చేతులతో నందించు చుండిరి.
ఇచ్చట నదీగర్భముపై వరదనీరు సుమారు 25 అడుగుల ఎత్తు లేచును. ఇటికతో, సున్నముతో ఒక్కొక్కటి 40 అడుగుల వెడల్పుగల 49 కమానులు, కమానులమీద 7 అడుగుల మందముపై 22 నుండి 24 అడుగుల వెడల్పుగల కాలువ యొకటి నిర్మింపబడెను. కమానుల స్తంభములు ఇసుక అడుగున 7 అడుగుల లోతునుండి 5 లేక 6 అడుగుల వ్యాసము గల గుండ్రపు గోడలతో కట్టబడెను. పరికరములు సమకూర్చుకొన్న తేది మొదలు నాలుగు మాసములలో 2248 అడుగుల తొట్టిని హైగ్‌దొర పూర్తిచేసెను. మరినాలుగు నెలలలో కాలువలో నీరు ప్రవహించెను. యంత్ర సహాయము లేని మారుమూల 5000 మంది కూలీలతో, తగినంత అనుభవములేని యిద్దరు ముగ్గురు ఓవర్‌సీర్లతో ఒక్క ఋతువులో ఇంత గొప్ప నిర్మాణము ముగించుట ప్రపంచమందలి అత్యద్భుత కార్యములలో నొకటి యని హైగ్ ప్రజ్ఞను కాటన్‌దొర వేనోళ్ళ పొగడెను. ఈ కాలువ మొదట 40,000 ఎకరముల భూమి సాగునకు నీరందించెను.
మొదట - ఈ కాలువ వ్యవసాయమునకును పడవల రాకపోకలకును ఉద్దేశింపబడెను. ఈ నిర్మాణమునకు 1852 లో 1.68 లక్షల రూప్యములు వ్యయమయ్యెను. పిమ్మట కాలువకు రెండుప్రక్కలను 4 అడుగుల బాటలు కట్టబడెను. కమానుల క్రింద వైనతేయపు జలమును, మీద తొట్టితో కాలువనీరును ప్రవహించుట మహా గంభీరమగు దృశ్యముగా నుండును. వరదలలో తూములను కాలువను ముంచుచు నదీజల మావలకు ఉరుకుచుండును.
1944 లో వరదల వలన సుమారు ఆరు కమానులు బ్రద్దలాయెను. నగరము ఖండమునకు పోవు కాలువ తెగెను. తాత్కాలికముగ ఇనుప పంట్లమీద నీరు అందింపబడెను. అక్విడక్టు నంతయు పడగొట్టి మరల నిర్మింపదలచి వ్యయమునకు భయపడి కూలిన కమానులను మాత్రము మరల కట్టిరి. పూర్వపు తొట్టిని చేర్చి యెడమవైపున 11 అడుగులు వెడల్పుగల ఇంకొక తొట్టిని పొడుగునను నిర్మించిరి. దీని మూలమున పదివేల ఎకరములకు అదనముగా నీరందును. ఈ అదనపు తొట్టిమీద పూర్వపు అక్విడక్టు రోడ్డును ఆనుకొని బలమైన రోడ్డువంతెన 19 అడుగుల వెడల్పయినది నిర్మింపబడెను. ఇది మోటారు కార్లును బండ్లును పోవుటకు వీలైనది. ఈ నిర్మాణమున కంతకును 22.7 లక్షల రూప్యములు వ్యయమయ్యెను. ఈ రోడ్డు వంతెన 21-1-1949 న తెరువబడెను. ఈ రోడ్డు వంతెన అమలాపురము రాజోలు తాలూకాలను దృఢముగా కలుపుచున్నది. తొట్టిక్రింద నలుబదియైదు వేల ఎకరముల నేలకు జలదానము చేయుచు, ఇంకను ఐదు వేల ఎకరముల భూమియొక్క సాగునకు అవకాశము చూపుచు, సులభప్రయాణ సౌకర్యము చేకూర్చుచు, ఈ నిర్మాణము గోదావరీనదియొక్క డెల్టా భాగమును సౌభాగ్యవంతము గావించుచున్నది.
వా. రా.
గయానా (భూగోళము) :
దక్షిణ అమెరికాయొక్క ఉత్తరభాగమునందుగల విశాలమగు పీఠభూమిని, ఇరుకైన సముద్రతీర మైదానమును గయానా దేశము ఆక్రమించియున్నది. ఈ దేశము భూమధ్యరేఖకు 10 డిగ్రీలలోపల భూమధ్యరేఖకు ఉత్తరముగా 3° 30' N నుండి 8° 40' N ల వరకు వ్యాపించి
311