పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/350

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గద్వాల సంస్థానము

5. రాణి లింగమ్మ : (శోభనాద్రి రెండవభార్య) శా. శ. 1647 నుండి 1660 వరకు సంస్థానమును పాలించెను. ఈమె సంస్థానమునందలి ముండ్లదిన్నె గ్రామవాసి నాగన్న కొడుకగు తిరుమలరాయుని దత్తుచేసికొనెను. ఈమె బీచుపల్లి వద్ద నిజాంకొండ కోటయొక్క నిర్మాణ మారంభించెను. సంగాల చెరువును, తాండ్రపాటి చెరువును, గద్వాలలో లింగమ్మ బావియును నిర్మించెను.

6. రాజా తిరుమలరావు: ఇతడు శా. శ. 1660 నుండి 1664 వరకు సంస్థానము నేలెను. ఇతనికి ఇద్దరు కుమారు లుండియుండిరి. బీచుపల్లివద్ద ప్రారంభింపబడిన నిజాంకోట నిర్మాణమును ఇతడు పూర్తిచేసెను.

7. రాణి మంగమ్మ : ఈమె రాజా తిరుమలరాయుని మొదటి భార్య. తనభార్య అనంతరము ఈమె శా. శ. 1664 న కొన్ని మాసములు రాజ్యభారము వహించినది.

8. రాణి చొక్కమ్మ : రాణి మంగమ్మ తరువాత, తిరుమలరావు రెండవ భార్యయగు చొక్కమ్మ శా. శ. 1664–1669 వరకు సంస్థానమును పాలించెను. బీచుపల్లి వద్ద నిజాంకోటలో ఆంజనేయ ప్రతిష్ఠగూడ గావించినది. ఈమె తన మరదియు, బోరవెల్లి గిరెమ్మ దత్తపుత్రుడును అగు రామారాయుని పిలిపించి తన ఇద్దరు కుమారులతో పాటు, అతనికిగూడ రాజ్యము స్వాధీనముచేసి, రామారాయుని తన కుమారులపై పర్యవేక్షకునిగా నియమించెను.

9. రాజా రామారావు: ఇతడు శా. శ. 1668 నుండి 1683 వరకు గద్వాల సంస్థానమును పాలించెను. తనకు సంతానము లేనందున చొక్కమ్మ అనుమతితో ఆమె ఇద్దరు కుమారులను స్వపుత్రులుగా భావించి, తనదగు బోరవెల్లి సీమయందలి గ్రామములను గూడ గద్వాల సంస్థానములో చేర్చి పాలించెను. రాజప్రోలు జమీందారులతో యుద్ధముచేసి, అతని జమీలోని 8 గ్రామములను సంస్థానములో చేర్చెను. కర్నూలు నవాబును గెల్చి అచ్చటి పసుపు జెండా, ఢంకా, నగారా మొదలగు వాటిని స్వాధీనపరచుకొనెను. అంతేగాక ఇతడు ఆవుక్ తాలూకా వరకు జయించి, బేతండ్ల గ్రామములో చెన్న కేశవ ప్రతిష్ఠ చేసెను.

10. రాజా చిన్నసోమ భూపాలుడు : రాజా రామారావు అనంతరము రాజా చిన్నసోమ భూపాలుడు శా. శ. 1684 నుండి 1715 వరకు గంగనపల్లె దొరలు, ఉప్పేరు నవాబుల (గంగనపల్లె, ఉప్పేరు గద్వాల తాలూకాలో ఇప్పటికిని గల గ్రామములు; సంస్థానము కాలములోను ఇవి అందులోనివే) గెల్చి, దరూరు (నేటి గద్వాల తాలూకాలోని గ్రామము) పరగణా గ్రామాలను సంస్థానములో చేర్చుకొని భూపాలు బిరుదమందెను. శా. శ. 1692 లో భార్యపేర కోటలోని కేశవాలయ విమాన (శిఖర) ప్రతిష్ఠయు, 1701 లో రామాలయ నిర్మాణమును, 1710 లో భూదేవి ఆలయ ప్రతిష్ఠయు ఇతడు చేయించెను.

11. రాజా చిన్నరామ భూపాలుడు: ఇతడు తన అన్న యగు చిన్నసోమ భూపాలుని అనంతరము శా. శ. 1716 నుండి 1728 వరకు గద్వాల సంస్థానమును పాలించెను. ఇతడు రాయచూరు దేశాయి హనుమంతరావు, నర్సింగ రావులతో దోరణాల శివారు విషయములో (దోరణాల గ్రామము గద్వాల తాలూకాలోనిది) కలహించి, నిజాం నవాబు పక్షమున సుబహనుల్లాఖాన్ అనువానిని రప్పించి తగాదాను పరిష్కారము చేయించెను. ఇతడు తన ఏకైక పుత్రికయగు లింగమ్మను జోళాపుర వాస్తవ్యుడైన నల్లారెడ్డి కుమారుని కిచ్చి వివాహముచేసి అల్లుని ఇల్లరిక ముంచుకొనెను. అల్లుని పేరును సీతారాం భూపాలుగా మార్చి అతనికి రాజ్యపాలనాధికారమును దత్త మొనర్చెను.

12. రాజా సీతారాంభూపాలుడు: ఇతడు శా. శ. 1728 నుండి 1761 వరకు సంస్థానమును పాలించెను. ఇతనికి అనంతమ్మ, లింగమ్మ, వెంకటలక్ష్మమ్మ అను మువ్వురు భార్యలుండిరి. ఇతడు నిస్సంతువు.

13. రాణిలింగమ్మ : సీతారాంభూపాలుని మరణానంతరము శా. శ. 1761 నుండి 1763 వరకు రాణి లింగమ్మ రాజ్యపాలన మొనర్చెను. (సీతారాం భూపాలుడు తన మొదటి భార్యయగు అనంతమ్మ మరణింపగా, లింగమ్మను వివాహమాడి యుండవచ్చును. లింగమ్మ జీవించియున్నను సంతానార్థము ఆతడు వెంకటలక్ష్మమ్మను గూడ పెండ్లాడి యుండవచ్చును.)

14. రాజా సోమ భూపాలుడు : రాణి లింగమ్మ, వెంకటలక్ష్మమ్మలు సంతానహీనలైనందున, వారు వడ్డెపల్లి

305