పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/349

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గద్వాలసంస్థాన చరిత్ర

సంగ్రహ ఆంధ్ర

వదంతి' అను నాభాణక మెంతయు అన్వర్థమగు చున్నది.

గ. ల.


గద్వాలసంస్థాన చరిత్ర :

గద్వాల ప్రస్తుతము మహబూబునగరంజిల్లాలో చేరిఉన్నది. ఈ సంస్థానము పూర్వము రాయచూరుజిల్లాలో నుండియుండెను.

ఇది సికింద్రాబాదు-కర్నూలు రైలుమార్గమున కృష్ణా, తుంగభద్రానదుల నడుమ నడిగడ్డగా నున్నది. ఈ సంస్థానము అతిప్రాచీనమైనది. హైద్రాబాదులోని ఇతర సంస్థానముల కంటె అన్నిటను ఇది ప్రత్యేక ప్రతిపత్తి కలిగియుండినట్లు అనేక ఆధారము లున్నవి.

గద్వాలసంస్థానము దాదాపు 600 సంవత్సరముల వయస్సు కలది. పశ్చిమ చాళుక్యులు, ఆంధ్రచోళులు, కాకతీయ, విజయనగర రాజులు, మొగల్, బహమనీ, బిజాపురం నవాబుల క్రింద ఈ సంస్థానము సామంతరాజ్యముగా నుండి, అనంతరము నైజాముపాలన క్రిందకు వచ్చినది. భారత రాజ్యాంగశాసనము ప్రకారము నిజామురాజ్యము విచ్ఛిన్నమైనప్పుడు గద్వాలసంస్థానము ప్రతిపత్తిని గోల్పోయి, ఆంధ్రప్రదేశ రాష్ట్రములో విలీనమైనది (1956). గద్వాలసంస్థానమునకు బుడ్డారెడ్డి (పోలని రెడ్డి యని నామాంతరము) మూలపురుషుడని తెలియుచున్నది. క్రీ. శ. 1290 సంవత్సర ప్రాంతములో మానలీ, బెళుదోణీ, రాయచూరు, మోసలకల్లు, అలంపురము, ఆద వేని, అయిజ అను ఏడు పరగణాలపై కాకతి ప్రతాపరుద్రునిచే బుడ్డారెడ్డికి 'నాడ గౌడరికము' ఇవ్వబడినది. 1686-1687 సంవత్సర ప్రాంతమున బనగానిపల్లె. శిరివెళ్ల, నంద్యాల, శిరిగుప్ప, సిద్ధాపురము, బండాత్మకూరు అహోబిలమువరకును గద్వాలసంస్థానాధిపతులు జయించి తమ రాజ్యమును విస్తరించుకొనిరి. అనంతరము కర్నూలు నవాబును గెలిచి, విజయచిహ్నముగ ఆ నవాబుయొక్క పతాకమును తెచ్చి గద్వాలయం దుంచుకొనిరి.

దాదాపు 300 సంవత్సరముల క్రిందటివరకు 'నాడగౌడు', 'సర్ నాడ గౌడు' లాంఛనములతోడను, తరువాత సర్వరాజరిక లాంఛనాధికారములతోడను ఈ సంస్థానాధీశులు వెలసినారు. వీరు ముష్టిపల్లివంశమునకు చెందిన పాకనాటి రెడ్లు. ఆదినుండి వీరు వైష్ణవభక్తులు. క్రీ. శ. 1663 - 1713 నడుమ ఇప్పటి గద్వాల నగర ప్రదేశముననే దుర్గ నిర్మాణము జరిగినది. ఈ స్థలనిర్ణయమునకు అనేకములగు కథలు, గాథలు చెప్పుదురు. మొదటి నుండియు ఈ రాజ వంశమునకు అచటికి సమీపమున గల పూడూరు చెన్న కేశవస్వామి ఇలవేలుపు. అందుచే ఆ సంస్థానపు రికార్డులలో దానికి కేశవనగరము అనునామము లిఖితమై యున్నది. ఐనను గద, వాలు అను రెంటిచే ఈ సంస్థానపు రాజులు ఇతరులను జయించి, రాజ్యవిస్తీర్ణము గావించుకొనిన కారణముగా, దానికి 'గదవాల' అను పేరు వచ్చి ప్రజల నోట నాని క్రమముగ గద్వాల అయినదందురు. గద్వాల సంస్థానమును ఈ దిగువ వివరించిన పదకొండుగురు పురుషులును, ఎనిమిదిమంది స్త్రీలును పాలించినట్లు ఆధారములున్నవి.

1. రాజ శోభనాద్రి : ఇతడు కర్నూలు జిల్లా కొంతలపాడు గ్రామ మునసబైన వీరారెడ్డి కుమారుడు. తాను పూడూరు నాడ గౌళ్ళ పక్షమున వారసుడనని చెప్పుకొనెను. శా. శ. 1585 సం. లో ఇతడు బక్కమ్మ అనునామె పోషణలో నుండి శా. శ. 1310 నుండి 1619 వరకు యుద్ధము చేసి, అయిజపరగణాను గెలిచి స్వాధీన మొనర్చుకొనెను. బక్కమ్మ పేర అయిజలో ఒక బావిత్రవ్వించి, శా. శ. 1620 నుండి శా. శ. 1627 వరకు కోట నిర్మాణమందు నిమగ్నుడై యుండెను. పిమ్మట శా. శ. 1628నుండి శా. శ. 1634 వరకు ఇతడు కాశీలో రామలింగ ప్రతిష్ఠ ఇత్యాదులు చేసి శా. శ. 1634 వరకు జీవించియుండెను.

2. శోభనాద్రి అనంతరము శా. శ. 1641 సం. వరకు కల్లా వెంకటన్న యను నాతడు రాజకార్య పర్యవేక్షకుడుగా నుండెను.

3. కల్లా వెంకటన్న అనంతరము శోభనాద్రి భార్యలు (రాణులు) రాచకార్య నిర్వహణమునకై రమణయ్య అను నొక వైదిక బ్రాహ్మణుని నియమించుకొనిరి. ఈ రమణయ్య శా. శ. 1641 నుండి 1646 వరకు తన బాధ్యతను నిర్వహించెను.

4. రాణి అమ్మక్కమ్మ : ఈమె శోభనాద్రి మొదటి భార్య. రమణయ్య అనంతరము శా. శ. 1646-1647 వరకు ఈమె స్వయముగా రాజ్యభారము వహించెను.

304