పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/343

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గద్యవాఙ్మయము (సంస్కృతము)

సంగ్రహ ఆంధ్ర

పేర్కొనెను. వరరుచి రచించిన 'చారుమతి', శ్రీపాలితుడు వ్రాసిన 'తరంగవతి' అను రెండు ఆఖ్యాయిక లున్నట్లు విదితమగుచున్నది. శ్రీపాలితుడు హాలుని ఆస్థానమున సుప్రసిద్ధకవియై వరలెను. తరంగవతి యనునది ప్రాకృతమున రచింపబడియుండును. రామిల సోమిలులు శూద్రకకథను రచించిరి. భోజుడు చారుమతి, మనోవతి, 'శాతకర్ణి హరణము' అను గద్యకృతులను పేర్కొ నెను. ఇవి క్రీస్తుశకారంభమునకు చెందియున్నట్లు ఊహింపబడినవి.

భట్టార హరచంద్రుని గద్యబంధము పదబంధోజ్జ్వల మనియు, 'వర్ణక్రమ సుశోభిత' మనియు బాణునిచే ప్రశంసింపబడినది. భోజుడు 'శృంగారమంజరి' అను ఆఖ్యాయికను, కులశేఖరుడు 'ఆశ్చర్యమంజరి' అను గద్య కృతిని రచించినట్లు తెలియుచున్నది. రుద్రటుని 'త్రైలోక్యసుందరి' యందు శ్రీకృష్ణునికథ కీర్తింపబడి నట్లు ఊహింపబడుచున్నది. అపరాజితునిచే రచితమైన 'మృగాంకలేఖ' అను కావ్యమును రాజశేఖరుడు పేర్కొనెను. విశ్వేశ్వరుడు 'మదనమంజరి'ని, జగన్నాథుడు 'ఆసఫీ విలాసము'ను రచించిరని తెలియుచున్నది.

ఆఖ్యాయికా స్వరూపమును సుందరముగ తీర్చిదిద్దిన త్రిమూర్తులు దండి, బాణుడు, సుబంధుడు అను కవి ప్రకాండులు. గద్య కవికుల లలామ భూతుడును, గద్యబంధ ధురంధరుడును, పండిత పురందరుడునైన దండి మహాకవి సంస్కృత సాహిత్యాంబరమున అంబరమణిగా విశ్రుతుడయ్యెను. ఇతడు క్రీ. శ. 635-700 సంవత్సరముల మధ్యకాలమున నున్నవాడని పెద్దల నిర్ణయము. దండిమహాకవి విరచితముగా ఉదహరింపబడిన అవంతి సుందరీ కథనుబట్టి అతడు వీరదత్తుడను దార్శనికునివలన గౌరియను విదుషీమణియందు జనించినవాడు. కంచుకీ పురి (కాంచి) అతని నివాసస్థానము. బాల్యముననే అతని తలిదండ్రులు గతించిరి. పలాశదండధారియు, నైష్ఠిక బ్రహ్మచర్య నిష్ఠితుడు నగు దండి స్వధర్మానుగుణముగ ఒక్కొక వర్షర్తువునందు ఒక్కొక పట్టణములో నివాసముగా నుండుచుండెను. ఒక పట్టణపు రాజాతనిని అంతఃపుర కన్యలకు విద్యగరపుటకై నియోగించెను. పిదప ఆతని రసికతాప్రకర్షమును గూర్చిన వృత్తాంతము రాజు చెవిని బడెను. రాజాతని శీలమును శంకించెను. ఆ విషయము దండికితెలిసెను. దండి అంతట రాజును దారిద్ర్యాష్టకమును రచింపప్రోత్సహించెను. రాజు అష్టకమును వ్రాసి దండి కొసగెను. దండి చిరునవ్వు నవ్వెను. దండి మనోవృత్తిని రాజు వెంటనే గ్రహించెను. రాజిట్లు తలచెను. తాను దారిద్ర్యమనుభవించి యుండలేదు. ఐనను అనుభవించిన వానివలె దారిద్ర్యాష్టక మును రచింపగల్గెను. తన దారిద్ర్యానుభవము కృత్రిమము. అట్లే దండి రసికతయు కృత్రిమము - అని రాజు గ్రహించి యథాపూర్వముగ దండిని గౌరవించెను అని తెలియుచున్నది.

దండి కృతమయిన దశకుమార చరితము సుప్రసిద్ధమైనది. ఇది కవితాకలాలంకృతమై, అత్యంత హృద్యమై అనవద్యమై భాసిల్లుచున్నది. ఇది పూర్వపీఠిక, చరితము, ఉత్తరపీఠిక అను మూడు విభాగములచేతను, ఎనిమిది ఉచ్ఛ్వాసములచేతను అలరారుచున్నది. 'దండినః పదలాలిత్యం' అను సూక్తినిబట్టి సులలిత పదావళిచే సమలం కృతమయిన ఈగద్య కావ్యమునందలి మధ్యభాగము మాత్రమే దండి కృతమని కొందరు తలచిరి. ఈ కావ్యము నందు పదిమంది రాజకుమారుల దేశ విదేశాటనాను భవములును, ఉచ్ఛావచక్రియాకలాపోపక్రమములును, వివిధ పరాక్రమములును, మనోరంజకముగా, మధుర రీతిచే వర్ణింపబడినవి. ప్రసాద మధురములు, లలిత లలితములు, భావగర్భితములునైన పదములను ప్రయోగించుట యందు కృతహస్తుడీ మహాకవి. పదార్థ విస్పష్టత, భవ్యభావనాభివ్యక్తి, కోమల కల్పనాకమనీయత, ఇతడు మెచ్చి స్వాయత్త మొనర్చుకొనిన కావ్యగుణములు. ఇతడు కావించిన చరిత్ర చిత్రణము విలక్షణము. ఇతని పాత్రలు సజీవములు. వ్యంగ్యభంగి హృదయంగమము ; వాక్య విన్యాసము మహోజ్జ్వలము. వార వనితలు, బ్రాహ్మణబ్రువులు, కులటలు, కుట్టినులు, తదానీంతన సామాజిక పరిస్థితులు-కవి, సజీవముగ చిత్రించినాడు. ఉదా :

క్షామవర్ణనము : “నవవర్ష వర్షాణి ద్వాదశ దశశతాక్షః, క్షీణసారం సస్యం, ఓషథ్యోవంధ్యాః, న ఫలవంతో వనస్పతయః, క్లీ బామేఘాః, క్షీణస్రోతసః స్రవంత్యః, పంక శేషాణి పల్వలాని, నినిన్ స్యందాన్యుత్సమండలాని, విరళీ

298