పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/336

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గద్యవాఙ్మయము (తెలుగు)

మహాసభ — దాని యుద్దేశములు,” “సంఘ సంస్కరణ, మహాసభాధ్యక్షోపన్యాసము" మొదలగునవి వారి ప్రఖ్యాతములైన ఉపన్యాసములు.

ఆధునిక యుగము : (1910-55) వీరేశలింగముగారు ప్రారంభించిన వచన రచనోద్యమము ఆధునిక యుగమున గొప్ప అభివృద్ధిని పొందినది. ఈ విస్తరణమునకు ముఖ్యకారణము గిడుగు రామమూర్తి పంతులుగారి వ్యావహారిక భాషా ప్రచారము. తత్ప్రభావముచే కేవలము పద్యకవిత్వమునందే కాక వచనమునందును రచయితలు వ్యావహారిక భాషను ప్రవేశపెట్టిరి క్రీ. శ. 1910 నుండి 1955 వరకు సాహిత్యము నవలలు, కథానికలు, విమర్శనములు, వ్యాసములు అను రూపములలో వర్ధిల్లినది. (పూర్వము ఎప్పుడును వెలువడని విస్తృతమైన సాహిత్య ప్రక్రియ లీ కాలమున ప్రతి విభాగమున వెలసినవి.)


నవల : పాశ్చాత్య భాషా సంస్కారముల ప్రభావమున వృద్ధినొందుచు ఆధునికాంధ్ర వాఙ్మయమునకు పరిపుష్టి కలిగించుచున్న సాహిత్య ప్రక్రియలలో నవల యొకటి. ఆధునికాంధ్ర నవలా రచయితలలో అగ్రేసరులని చెప్ప దగినవారు విశ్వనాథ సత్యనారాయణగారు. 'ఏక వీర ' వీరి ప్రథమ నవల. అందలి శైలియు, కథాని ర్మాణ కౌశలమును, పాత్ర పోషణమును అనన్యాదృశము లైనవి. చెలియలికట్ట, ధర్మచక్రము, బద్దన్న సేనాని, స్వర్గానికి నిచ్చెనలు, తెఱచిరాజు, మాబాబు మొదలైనవి వీరి ఇతర రచనలు. వీరి 'వేయిపడగలు' పరిమాణమునందును, గుణమునందును పెద్దది. ఇది ఆధునికాంధ్రదేశ సాంఘిక, మత, రాజకీయ పరిస్థితులకు ప్రతిబింబము. నవలకుండవలసిన గుణములన్నియు దీనికి గలవు. భాష సరళ గ్రాంథికము . ఇది ఆంధ్ర విశ్వకళాపరిషత్తు బహుమతిని పొందినది. కీ. శే. అడివి బాపిరాజుగారు కూడ నవలా రచనలో సిద్ధహస్తులు. సాంఘిక నవలలైన నారాయణరావు, కోనంగి, చారిత్రక నవలయైన 'హిమబిందు' మున్నగు బాపిరాజుగారి నవలలు ఆంధ్రదేశమున ప్రశస్తిని పొందినవి. బుచ్చిబాబుగారి 'చివరకు మిగిలేది', జి. వి. కృష్ణారావుగారి 'కీలుబొమ్మలు', బలివాడ కాంతారావుగారి 'గోడమీద బొమ్మ' ఇవి సాంఘిక వస్తువుతో నున్న వ్యావహారిక వచన రచనలు. శ్రీ నోరి నరసింహ శాస్త్రిగారు చారిత్రక నవలా రచయితలలో చేయి తిరిగినవారు. నారాయణభట్టు, రుద్రమదేవి, మల్లారెడ్డి అను నవలలు సులభ గ్రాంథికముతోనుండి కవిత్రయ జీవితములను హృద్యముగా వివరించుచున్నవి. కీ. శే. ఉన్నవ లక్ష్మీనారాయణగారు వ్రాసిన మాలపల్లి, ఆంధ్ర నవలా ప్రపంచమునకు అలంకార ప్రాయము. ఇందలి భాష మాండలిక మేయైనను, ఇది ఆంధ్ర దేశమునందంతటను ప్రచారమును పొందినది. దీనిలో సాంఘిక, రాజకీయ పరిస్థితు లెన్నియో చిత్రించబడినవి. 'బారిష్టరు పార్వతీశం' మొక్కపాటివారు రచించిన హాస్యప్రధానమైన నవల. మునిమాణిక్యం నరసింహారావుగారి 'నేనూ, మా కాంతం', 'కాంతం కథలు', 'తిరుమాళిగ' అనునవి కూడ హాస్యప్రధాన రచములే. వ్యావహారికాంధ్రమున నున్న ఈ రచనలు ఆంధ్రుల అభిమానమును సంపాదించినవి. నవలా రచయితలలో పలువురు స్త్రీలును కలరు. 'సుదక్షిణా చరిత్రము'ను వ్రాసిన శ్రీమతి జయంతి సూరమ్మ, 'వసుమతి' అను నవల రచించిన కనుపర్తి వరలక్ష్మమ్మ, 'చంపకము' వ్రాసిన శ్రీమతి మాలతీ చందూరు పేర్కొనదగినవారు, కొన్ని ఆంగ్లనవలలు ఆంధ్రములోని కనువదింపబడినవి. వానిలో ఫాస్టు, నౌకాభంగము, అనా కెరినీనా, మేరీరాణి, సంజీవి ఇత్యాదులు పేర్కొనదగినవి.

కథానిక : పాశ్చాత్యభాషాసంపర్కమువలన ఆధునికముగా ఆంధ్రభాషలో ఉద్భవించిన సాహితీవిభాగమిది. ఒక చిన్న సంఘటననుకాని, కొన్ని సంఘటనలనుకాని వస్తువుగా తీసికొని రచించినది కథానిక యనిపించుకొనును. ఇది క్లుప్తముగనుండి కొలదికాలమున మాత్రము చదువుకొనుటకు వీలుగానుండును. ఇట్టి శిల్పమును దృష్టియం దుంచుకొని పలువు రాంధ్రరచయితలు ఉత్తమ కథలను సృష్టించిరి. కీ. శే. గురజాడ అప్పారావుగారి క థానికలే ఆంధ్రమున మొదటి రచనలుగా భావింపబడుచున్నవి. చిలకమర్తివారు కథానికలనదగిన 'చమత్కారమంజరి', 'భారతకథామంజరి' మొదలగువాటిని రచించిరి. కాని ఇందలి భాష గ్రాంథికము. విశ్వనాథ సత్యనారాయణగారు కూడ కొన్ని చిన్నకథలు వ్రాసినారు. వ్యావహారిక వచనమున నున్న అడివి బాపిరాజుగారి తరంగిణి, రాగమాలిక, అంజలి అను సంపుటములు ఉత్తమ కథానిక

291