పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/330

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గద్యవాఙ్మయము (తెలుగు)

మున జీవించిన దాసగోస్వామి యను నామాంతరముకల దాసగోసాయి యను భక్తుడు, ఉపదేశరూప మగు ఈ గ్రంథమును రచించినాడు. ఇతడు మహారాష్ట్రుడయ్యును తెలుగున గ్రంథరచన చేయుట విశేషము. ఇది వేదాంత భరితము. “ఆత్మపూర్ణ సమాధినిష్ఠుడైన వానికి జాతీయ విజాతీయభేదములేదు. వర్ణాశ్రమధర్మాలు చేయబనిలేదు. సర్వధర్మాలు విడిచి బ్రహ్మమై, దేశకాల వస్తువులు లేక, అపరిచ్ఛిన్నుడై జ్ఞానపూర్ణుడై పరబ్రహ్మమువలెనే వుండి వాఙ్మనోతీతమై, నామరూపరహితమై, అఖండపరిపూర్ణ స్వరూపమై యుండును." ఇట్లు వ్యావహారిక శైలిలో నున్న దీరచన.

రాయ వాచకము : ఈ యుగమున వెలసిన వచన గ్రంథములలో రాయవాచక మొకటి. ఇది విశ్వనాథ నాయకుని స్థానాపతిచే రచితమైనది. ఇది రాజకీయ చారిత్రక ప్రయోజనమును దృష్టియందుంచుకొని రచింపబడిన గ్రంథము. ఇందలిభాష సుగమమును, వ్యావహారికమునై యున్నది. కుమార ధూర్జటి యను కవి కృష్ణరాయ విజయమును రచించుటయందు రాయవాచకము ననుసరించి యున్నాడు. రాయవాచకమున నాటి వ్యావహారిక రచనపు నుడికారములు, నాటి మాండలికములు, చక్కగా నుపయోగింప బడినవి. ఇది చారిత్రకముగా కూడ ప్రాధాన్యము కల గ్రంథము.

పైన పేర్కొనిన గ్రంథములేకాక క్రీ. శ. 15, 16 శతాబ్దుల యందు వెలువడిన వచనగ్రంథములలో తామరపల్లి తిమ్మయ్యమంత్రి రచించిన సభాపతి వచనము, సిద్ధరామకవి వ్రాసిన ప్రభుదేవర వాక్యము, కాశీ చెన్నబసవేశ్వరుని వివేకసింధువు, పరమానందయతి కూర్చిన వేదాంత వార్తికము మున్నగునవి పేర్కొనదగినవి.

ఉత్తర ప్రబంధయుగమున అనగా క్రీ శ. 17 వ శతాబ్దమున కూడ కొన్ని వచనగ్రంథములు రచితములైనవి. క్రీ. శ. 1670 ప్రాంతమున గోపీనాథకవి వచన విచిత్ర రామాయణమును రచించెను. ఇది ఉత్కలభాషలో సిద్ధేంద్రయోగి రచించిన గ్రంథమునకు తెలుగు అనువాదము. గోపీనాథకవి శ్రీ సీతారామభక్తుడు. వాల్మీకి రామాయణము ననుసరించి, ఓఢ్ర రామాయణమును చూచి, తానీగ్రంథమును రచించితినని చెప్పియున్నాడు. ఇందచ్చటచ్చట వాల్మీకిరామాయణమున లేని కొన్ని చిత్రకథలున్నవి. శైలి గ్రాంథికమును, మనోహరమునై యున్నది.

భాగవత సారము : దీనిని పుష్పగిరి తిమ్మన రచించెను. ఈ గ్రంథము బహుళ ప్రచారమును పొందినదగుటచే దీనిని చిన్నయ్యన్ అను కవి తమిళభాషలోనికి అనువదించెను. ఇందలి భాష సరళము, గ్రాంథికము. ఉదా:

“ఓ రాజేంద్రా ! నీవడిగిన ప్రశ్నము మంచిది. ఇది పెద్దలు మెత్తురు. వినదగినవి వేయి వేలుంగలవు. వాటిలో నీ వడిగినవి ముఖ్యము. సంసారమగ్ను లీ తత్త్వము తెలియగూడదు. పశు శిశు భార్యాదులు మీది మోహము చేత కాలము క్రమించి కడపట చత్తురు."

క్రీ. శ. 17 వ శతాబ్దమునకు కొలదిగ తరువాత మాచనామాత్యుడు రచించిన బ్రహ్మాండ వచనము, బుద్ధిరాజు పేరయ వ్రాసిన సాత్త్విక బహ్మవిద్యా విలాస నిరసనము, అజ్ఞాన ధ్వాంత చండభాస్కరము అనునవి కలవు. ఈ గ్రంథములన్నియు వేదాంతపరములు.

ఆంధ్ర నాయకరాజుల యుగము : వచన రచనమునకు ఆంధ్రనాయకరాజుల కాలము స్వర్ణయుగము. నాయక రాజులు పాలించిన మధుర, తంజాపురి ప్రాంతముల భాష తమిళము. కాని రాజులు, ఉద్యోగులు మాటాడు భాష తెలుగు. ఆంధ్రరాజులును, వారి ననుసరించిన రాజకీయోద్యోగులును ఇతర సంపన్నులగు ఆంధ్రులును తెలుగు భాషా పోషణము చేసిరి. ఈ సమయమునందలి సారస్వతము యక్షగాన వచన గ్రంథరూపముల వెలువడినది. ఇందు వచనగ్రంథములే హెచ్చు. ముఖ్యమైనవానిని ఈ క్రింద బేర్కొనుచున్నాము :

ధేనుకా మాహాత్మ్యము : క్రీ. శ. 1674 వ సంవత్సరమున తంజాపురిని జయించి పాలించిన ముద్దళ గిరియొద్ద ఆస్థానకవిగా నుండిన లింగనమఖి కామేశ్వరకవి యీ గ్రంథమును రచించినాడు. ఇతడు రుక్మిణీపరిణయము, సత్యభామా సాంత్వనము అను గ్రంథములు కూడ రచించినట్లు తెలియుచున్నది. ఈ కవి ఇందు గోమహాత్మ్యమును వర్ణించినాడు. శైలి సులభ గ్రాంథికము. ఉదా :

“ఆవుపా లమృతంబని అమరవిభుండు పలుకరించెగనుక, ఆవునిచ్చిన అమృతము నిచ్చిన ఫలము కలుగును. మేపుతో

285