పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/326

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గద్యవాఙ్మయము (తెలుగు)

గులో గద్యకావ్యములు లేవు. అప్పుడు చిన్నయసూరి తన వ్యాకరణము రచించి యందులకు లక్ష్యముగా నీతి చంద్రికను వచనముగా వ్రాసెను".

పై వాక్యములనుబట్టి గద్యము, వచనము అనునవి సమానార్థకములనుట స్పష్టము.

ఆంధ్రవాఙ్మయమున గల వచన రచనలను మూడు తెరగుల విభాగము చేయవచ్చును. 1. ప్రాఙ్నన్నయ్య యుగము నందలి వచనము. 2 నన్నయాదుల గ్రంథములందలి వచనము. 3. వచనైక గ్రంథములందలి వచనము.

ప్రాఙ్నన్నయ్య యుగము: ప్రాఙ్నన్నయ్య కాలము నందలి వచన రచనా స్వరూపమును తెలిసికొనుటకు ఆ కాలమున బయలుదేరిన శాసనములే పరమాధారములు. నన్నయ్య కంటె పూర్వకాలమున లభ్యమైన శాసనములలో ప్రాచీన తమములయినవి రేనాటి చోళరాజులు వేయించినవి. వీరు కాక బాణరాజులు, వైదుంబులు, తూర్పు చాళుక్యులు వేయించిన శాసనములుకూడ వచనమున నున్నవి. మనకు లభించిన శాసనములలో పద్య శాసనముల కంటె ప్రాచీన తరములు గద్య శాసనములే. రేనాటి చోళులు ఈ క్రింది శాసనమును వేయించిరి :

“చోళ మహారాజుఱ్ల ఏళ ఎరిగల్ తుక - రాజుఱ్ల ఇచ్చిన పన్నస రాచమానంబున ఏబది - తిరివుళపాఱకు ఇచ్చిన - పన్నస దీనికి వక్రంబు- వచినవారు పంచమహా- పాతక అగు”. . . . . .(చోళమహారాజు ఉరుటూరు శాసనము-7వ శతాబ్ది క్రీ.శ.)

ఈ పై శాసనము నందలి వచన రచనా విధానము ప్రాథమిక దశయం దున్నట్లు స్పష్టమగుచున్నది. క్రీ. శ. 8 వ శతాబ్దమున వెలసిన వెలుదుర్తి శాసన మిట్లున్నది:

"స్వస్తిశ్రీ ఉత్తమాదిత్య చోళమహారాజు ప్రిథివీ రాజ్యమ్ చేయ ఇమ్మడి ఇటొచ్చిన పన్నవీసకోసియపాఱ చేది శమ౯ కిచ్చిరి"— (ఉత్తమాదిత్య చోళమహారాజు వెలుదుర్తి శాసనము.)

క్రీ. శ. తొమ్మిదవ శతాబ్దినాటికి వచన రచనమున చక్కని పరిణామము కలిగినది. క్రీ. శ. 9వ శతాబ్ది మధ్య భాగమున బయలుదేరిన చాళుక్యభీముని కొఱవిశాసనము పరిశీలింపదగినది.

"శ్రీ విక్రమాదిత్య నృపాగ్ర తనయుణ్డయ్న చాలుక్య భీమునకు శౌచకన్దపు౯నకు వేగీశ్వరునకు రనమద్దాన్వయకుల తిలకుణయ్న కుసుమాయుధుణ్డు గన్న..... రాజ్యంబు సేయుచు నిష్ఠవిషయ కామభోగంబుల ననుభవించుచు సుఖంబుణ్డి యొక నాణ్డు కొరవినల్ల జెఱియ కొడుక పెద్దన రావించి నీవు నా ప్రాణ సమానుణ్ణవైన చెలివి. ” ఈ శాసనమునందలి వచన రచన క్రీ. శ. 11 వ శతాబ్ద మందలి భారత వచన రచనకు సమీపముగా నున్నది.

ప్రాఙ్నన్నయ్య యుగమునందలి వచన రచనములో ముఖ్య విశేషము లిట్లుండును :

1. పదములందు ప్రాకృతభాషా ప్రభావము స్ఫుటముగా కనిపించుట.

2. వాక్య నిర్మాణ క్రమము పరిపూర్ణముగా లేక పోవుట.

3. పెక్కు చోటులందు సమాపకక్రియ లేకుండుట.

4 నేడు ప్రచారమునలేని కొన్ని విశేష పదములు (పన్నస, పొలగరుసు మొ.) ఉండుట.

5. శకటరేఫము, ణ, ఋ అను నక్షరములు అధికముగా నుపయోగింపబడుట.

ఆంధ్రమహాభారతమునందలి వచనరచన: రాజమహేంద్రవరమును రాజధానిగా జేసికొని తూర్పు చాళుక్యరాజు రాజరాజనరేంద్రుడు క్రీ. శ. 1022 - 1063 వరకు ఆంధ్రదేశమును పాలించినాడు. అతని యాస్థానమున నివసించి నన్నయభట్టు ఆంధ్రమున తొలి కావ్యమగు ఆంధ్రమహాభారతమును రచించెను. నన్నయ విరచిత ఆంధ్రమహా భారతము గద్య పద్యాత్మకమైన చంపూ గ్రంథము. తన కావ్యమున నన్నయ వచనమునకు కూడ సముచిత స్థానమును కల్పించినాడు. మహాభారతమున నన్నయ రచిత భాగమున మొత్తము 4014 గద్యపద్యము లున్నవి. ఇందు ఆశ్వాసాంత గద్యములతోసహా వచనములు 1431. అనగా 35.5 శాతము. నన్నయ, మొత్తము గ్రంథమున దాదాపు మూడింట నొక వంతు వచనమును రచించినాడు. అందుచే నన్నయను కేవల పద్య రచయితగానే గాక గద్య రచయితగా గూడ పేర్కొనవలసి యున్నది. నన్నయభట్టు ఈ క్రింది ప్రత్యేక సందర్భము లందు వచనమును ఉపయోగించినాడు :

281