పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/324

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గతితార్కిక భౌతికవాదము

వులకు మానవులకు నడుమ అన్యోన్య సంబంధము లేర్పడుచున్నవి. దీని ఫలితముగా కార్మికలోకములో పని విభజనము (Division), శ్రామికులలో ప్రత్యేక నైపుణ్యము (Specialization of Labour), కార్మికుల హక్కులు, వారిని పీడించుట (Exploit) కు తోడ్పడు చట్టములు, అదేసమయములో శ్రామికులపీడను (Exploitation) నివారించుటకై కొన్ని ఉత్తరువులు తయారగును. ఇట్టి పరిణామములన్నియు మానవునకు మానవునకు నడుమ పరస్పర సంబంధములుగా మారును.

ఇట్టి సంబంధములు మానవ చరిత్ర మొదలైననాటి నుండి నేటివరకు కొనసాగుచునే ఉన్నవి. వివిధ సామాజిక వ్యవస్థల చారిత్రక పరిణామ దశలలో శ్రామికుల పీడన విధానము పెక్కు రూపములు ధరించెను. బానిస సమాజము, ఫ్యూడల్ (జమీందారీ) సమాజము, పెట్టుబడిదారీ సమాజము పరిణామముచెందిన దశ లన్నిటిలో ఒక వర్గము మరియొక వర్గమును పీడించినట్లు మనకు బోధ పడగలదు.

మానవుల పరస్పర సంబంధములలో కలుగు మార్పుల వలన, సాంకేతిక విధానములలో సంభవించు పరిణామముల వలన, శాస్త్ర పరిశోధనల వలన, నూతనావిష్కరణముల వలన మానవుని విజ్ఞానము, నైపుణ్యము అభివృద్ధి కాగలవు. వాని మూలమున ఉత్పత్తిస్థానములను నిర్మించు నూతన మార్గములను అవలంబించుటకు అవకాశమేర్పడుచున్నది. ఈ నూతన నిర్మాణములు, నూతన ఆర్థికనిర్మాణ రూపములను నిర్ణయించును. ఈ నూతన ఆర్థిక నిర్మాణములు మరల సమాజమును ఒక దశ నుండి మరొకదశకు అభివృద్ధిపరచుటకు మార్గమును సుకరముచేయును.

సమాజము యొక్క ఏ అభివృద్ధి దశయందైనను, ఆ సమాజము యొక్క నైతిక, న్యాయజీవిత విధానము, దాని యొక్క మౌలిక ఆర్థిక నిర్మాణము ప్రతిబింబించును. ఉదాహరణమునకు బానిసదశ యందు ఆనాటి సమాజము నైతికముగను, న్యాయశాస్త్ర ప్రకారముగను బానిస వ్యవస్థనే సమర్థించెను. అందుచే రాజకీయ విధానములు, ప్రభుత్వ చట్టములు, మతము, కళలు, నైతిక నియమములు ఆ యా కాలములనాటి ఆర్థిక నిర్మాణమును నిర్థరించును.

వివిధసామాజికవ్యవస్థల యొక్క గర్భాశయములందే ఆ వ్యవస్థలు అంతరించెడి బీజములు ఇమిడియున్నవని మార్క్స్, ఎంగెల్స్‌లు సిద్ధాంతీకరించిరి. ఈ కారణము వలననే సమాజము ఒకదశ నుండి వేరొకదశకు మారుచు అభివృద్ధినొందుచున్నది. ఈ మార్పులు శాంతముగను, నెమ్మదిగను, క్రమానుగతముగను కాక. వేగముగను, ఉగ్రముగను జరుగుచున్నవి. దీనికి కారణములు గలవు. ఆర్థిక నిర్మాణ ప్రాతిపదికపై పెరిగి, పెంపొందు రాజకీయ, న్యాయ, నైతిక సంస్థలు వాటికి అనువగు జీవిత విధానమును సృష్టించుకొనును. ఆర్థిక విధానము తలక్రిందై విచ్ఛిన్న మగుచున్నను, ఈ సంస్థలు జలగల వలె తమ స్థానములను అంటిపెట్టుకొని చిరకాలము బ్రతుకుటకు ప్రయత్నించును. ఇట్లే స్వప్రయోజనములను పరిరక్షించుకొనుటకై పాలకవర్గము (Governing Class) గూడ తన ప్రత్యేక హక్కులను (privileges) వదలక పట్టుకొని వ్రేలాడును. ఇట్టి పాలకవర్గము సంఘర్షణము, పోరాటము లేకయే తన అధికారమును పరిత్యజింపదు. శాస్త్రీయ పరిశోధనముల వలన, ఉత్పత్తి రంగములో, నూతనమైన సాంకేతిక ఆవిష్కరణముల వలన జరుగు పరివర్తనములు క్రమానుగతము లగుచుండగా, రాజకీయ జీవిత విధానములో జరుగు మార్పులు ఉద్రేకపూరితము లగుచున్నవి.

మార్క్స్, ఎంగెల్స్‌లు ప్రతిపాదించిన ఈ గతితార్ధిక సిద్ధాంతము కొందరిచే తీవ్రముగా విమర్శింపబడెను. వీటిలో వేదాంతశాస్త్రము నెడల భక్తిప్రపత్తులు ప్రకటించని సిద్ధాంతము ప్రధానమైనది. పెక్కు సామాజిక సంఘటనలను మనము చరిత్ర యని పిలిచెదము. ఈ చారిత్రక సంఘటనలను వ్యక్తీకరించుటలో వేదాంతమునకు కొంత స్థానము కలదు. మార్క్స్ ఈ విషయమును ఊహించెను. కాని తత్త్వమీమాంసకు వాస్తవ విషయములతో గల సంబంధము నిస్సారమైన వ్యాసంగమని ఆతని అభిప్రాయము. సిద్ధాంతమునకును, దాని ఆచరణమునకును నడుమగల సమైక్యముయొక్క ఆవశ్యకమును గూర్చి మార్క్స్ నొక్కి చెప్పెను. ఆలోచన (భావన) మానవుని కార్యవాదిగా చేయును. కార్యము లేనిదే ఆలోచన నిష్ప్రయోజన మగును. ఈ రెండింటికిని అవినాభావ

279