పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/313

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గణితశాస్త్ర చరిత్రము

సంగ్రహ ఆంధ్ర

సాధారణవ్యవకలన సమీకరణములలో గొప్ప పని చేసి యుండగా, ఇతడు ఆంగికవ్యవకలన సమీకరణములలో (Partial Differential Equations) పరిశోధనలు గావించెను.

18 వ శతాబ్దిలోకెల్ల గొప్ప గణితశాస్త్రజ్ఞుడని చెప్పదగు 'లియోనార్డ్ ఎన్లర్ ' (Leonard Enler, 1707-83) గూడ ఈ బాసిల్ విశ్వవిద్యాలయమునుండియే వచ్చెను. ఇతడు జాన్ బెర్నోలీవద్ద గణితశాస్త్రము నభ్యసించి, కొంతకాలము బెర్లిన్‌లోను, కొంతకాలము సెయింట్ పీటర్స్‌బర్గులోను నివసించెను. ఈతనికి 1735 లో మొదటి నేత్రమును, 1766 లో రెండవ నేత్రమును నష్టమయ్యెను. అయినను, ఇతని గణితశాస్త్ర పరిశోధనల కేమియు తన్మూలమున ఆటంక మేర్పడలేదు. అసాధారణమగు తన జ్ఞాపకశక్తిచే అత డా శాస్త్రమున ఇదివర కుండిన జ్ఞానమంతటిని క్రోడీకరించి క్రొత్త విషయములను అనేకములను చేర్చి, చిన్నవి, పెద్దవి మొత్తము సుమారు 900 రచనలు గావించెను. గణితశాస్త్రమున ఆతని ముద్ర పడని భాగమే లేదు. (“ఆయిలర్ "అను వ్యాసమును చూడుడు). గణితశాస్త్రముననే గాక, అనువర్తిత గణితశాస్త్రమునను ఆతని పరిశోధనలు అమూల్యములు. నౌకా నిర్మాణశాస్త్రమున, సైన్యపరికర శాస్త్రమున, సంగీతశాస్త్రమున ఆతని సేవ చిరస్మరణీయము. ఆయిలర్ రచించిన గ్రంథములు చదివినవారి నెల్లరను ఆతని నిరంతర సృజనాత్మక శక్తి ఆశ్చర్యచకితులను చేసినది. అతని తర్వాత వచ్చిన గణితశాస్త్రజ్ఞులలో పేరెన్నికగన్నవా రందరును ఆతని గ్రంథములను క్షుణ్ణముగా చదివి ఆతని ప్రభావమునకు లోబడినవారే. ఇది యిట్లుండగా ఆ కాలమున ఫ్రాన్సుదేశమందు అత్యంత ముఖ్యమగు పరిశోధనములు జరిగెను. ఆకాలపు ఫ్రెంచి శాస్త్రజ్ఞులందరి ధ్యేయమును ఒక్కటియే. అది ఏమనగా, న్యూటన్ కనుగొనిన గురుత్వాకర్షణ సిద్ధాంతమును కలనగణిత పద్ధతులచే అభివృద్ధిపరచుటయే . ఈ విశ్వములోని చలనమున కంతటికిని కారణభూతమగు ఒకే ఒక సూత్రమును కనుగొనవలయునని ప్రయత్నించి 'కనిష్ఠతమకార్యసూత్రము' (principle of least action) ను కనుగొనిరి. దీనినే ఆయిలర్ గణితశాస్త్ర పద్ధతిని m v d s కనిష్ఠతమముగా నుండ వలయునని నిర్వచించి, దానిలో గణితశాస్త్రపు పద్ధతిని ప్రవేశ పెట్టెను. ఈ సూత్రమును తరువాతవచ్చిన లెగ్రాంజి (Legrange), హామిల్టన్ (Hamilton) మొదలగు గణితజ్ఞులు పుష్కలముగా ఉపయోగించుకొనిరి. ఆ కాలముననే పురాతన మతభావములను వ్రేళ్ళతో పెకలించి వేసి ఫ్రెంచి విప్లవమునకు దారితీసిన విశ్వవిఖ్యాతమగు ఫ్రెంచి విజ్ఞాన సర్వస్వము రచింపబడెను. ఈ విజ్ఞాన సర్వస్వ నిర్మాతలలో డి లాంబెర్టు (D'Alambert) అను నొక గణితశాజ్ఞుడును కలడు. చలనశాస్త్రములోని డి లాంబెర్టు సిద్ధాంతము (D'Alambert principle) అనునది ఈతడు నిర్మించినదే. ఆంగిక వ్యవకలన సమీకరణములలో ఈతని పేర బరుగు సమీకరణమును ఈతడు సాధించెను. ఇతడు అవకాశశాస్త్రమున గూడ అతిముఖ్యములగు కొన్ని పరిశోధనలు సలిపెను.

ఆ కాలమున ఇంగ్లండు దేశములో చెప్పుకొనదగిన వారు డా. మాయివర్ (Dr. Moiver), స్టర్లింగ్ (Stirling). లాండీ (Landy) మెక్‌లారిన్ (Maclaurin) అనువారు మాత్రమే. వీరెవ్వరును ఆ కాలమున ఐరోపా భూఖండమున వెలసిన సమకాలిక శాస్త్రజ్ఞులతో పోల్చదగిన వారుకారు. వీ రెల్లరును ప్రాంతీయ దురభిమానముచే తమ న్యూటన్ నిర్మించిన పద్ధతులనే అవలంబించి, అభివృద్ధి నిరోధక ములగు ఆతని సంకేతములనే వాడుచు, అంతకంటెను ప్రబలతరమగు లీబ్నిట్జ్ సంకేతములను పరిహరించి, ఇంగ్లండు దేశమున గణిత శాస్త్రాభివృద్ధికి నిరోధకులైరి. వీరిలో మెక్లారిన్ (Maclaurin) అను ఎడింబరో విశ్వవిద్యాలయ గణితశాస్త్రాచార్యుడు తమ పాత పద్దతులతోడనే ఆకర్షణ శాస్త్రమున కొన్ని ముఖ్య పరిశోధనలు జరిపెను. అతని పేరబరగు 'మెక్లారిన్ శ్రేఢి' అనునది జగత్ప్రసిద్ధము. కాని దీనిలో ఏమియు క్రొత్తదనము లేదు. దానిని లోగడ 'టెయిలర్' అను శాస్త్రజ్ఞుడు కనుగొనియే యుండెను. అయితే ఈ శ్రేఢిని ఆయిలర్ తన వ్యవకలన గణితములో ఉపయోగించునంతవరకు దాని ప్రాముఖ్య మెవ్వరును గుర్తించక పోయిరి.

దాని ప్రాముఖ్యమును గుర్తించినవారిలో ముఖ్యుడు జోసెఫ్ లూయీ లెగ్రాంజ్ (Joseph Louis Lagrange.

268