పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/308

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గణితశాస్త్ర చరిత్రము

మగు సంకేతములను ఉపయోగించిన మొదటి శాస్త్రజ్ఞు డితడే.

ప్రాచ్యగణితము : ఈ కాలమున గణితశాస్త్రమున చెప్పుకొనదగిన అభివృద్ధి కనిపించకపోయినను, గ్రీకులకును, అరబ్బు, పారసీక, హిందూదేశములకును వర్తక సంబంధములు గాఢముగ అల్లుకొనిపోయి యుండుటచే, అదివర కుండిన జ్ఞానము ఈ దేశము లన్నిటియందును వ్యాపించుటకు అవకాశముగలిగి, ఆయా దేశస్థులు తమకు ఉపలబ్ధమైన జ్ఞానమును వృద్ధిపరచుకొన నవకాశము పొందిరి. అందుచే ఈ కాలమున ఆరేబియా, హిందూ దేశములలో గణితశాస్త్రమున కొంత ప్రగతి గల్గినది.

ఆధునిక విజ్ఞానమునకు హిందూ దేశము సమర్పించిన మొదటికానుక సిద్ధాంతములు. వీటిలో సూర్యసిద్ధాంతము (క్రీ. శ. 300 - 400) ముఖ్యమైనది. ఇది ఖగోళ శాస్త్ర విషయము. దీనిలో గ్రీకు, బాబిలోనియా ఖగోళ శాస్త్రముల ప్రభావము స్పష్టముగకన్పడును. ఈ సూర్య సిద్దాంతములో మొట్టమొదటిసారిగా జ్యాపథకములు (Tables of Sives) కన్పించును. ఈ సిద్ధాంతములు క్రీ. శ. 773 లో అల్-ఫజారి అనునాతనిచే అరబ్బీ భాషలోనికి తర్జుమా చేయబడెను. క్రీ. శ. 500 ప్రాంతమున జీవించియుండిన ఆర్యభట్టు 'ఆర్యభటీయ'మను గణితశాస్త్ర గ్రంథమును రచించెను. దీనిలో కొంత గణితమును, కొంత ఖగోళశాస్త్రమును కలిసియున్నవి. T= 3.1416 అని అర్యభట్టు గ్రహించెను. క్రీ. శ. 625 ప్రాంతముననున్న బ్రహ్మగుప్తుడును గణితశాస్త్రమున కొంత పరిశ్రమచేసెను. గ్రహగమనమాతనికి బాగుగ తెలిసినట్లున్నది. ax+by=c (a, b, c లు పూర్ణాంకములు). ఈ కుట్టక సమీకరణమునకు సాధారణ సమాధానమును మొదట కనుగొనినవాడు బ్రహ్మగుప్తుడు. అందుచే ప్రథమఘాత కుట్టక వ్యవహారమున 'డియొఫాంటస్ 'కంటె బ్రహ్మగుప్తుడు ఒక అడుగు ముందునకు వై చెననుట స్పష్టము. క్రీ. శ. 1150 ప్రాంతమున ఉజ్జయినీ నగరమున భాస్కరాచార్యులు అనునొక గొప్ప గణితశాస్త్రజ్ఞుడుండెను. అతడు రచించిన “లీలావతి” అను గ్రంథము పెక్కు శతాబ్దములవరకు హిందూ దేశమున ప్రమాణగ్రంథముగా నుండెను. ఇతడు ద్వితీయ ఘాతకుట్టకవ్యవహారమున అతిదక్షుడు. ఇతడు విడదీసిన సమస్యలు కొన్ని బహుకాలము తర్వాతగాని ఐరోపా ఖండమున సాధింపబడలేదు.

హిందూగణితము యొక్క ముఖ్యసాధన (achievement) దానిలో సంఖ్యలు వ్రాయుపద్ధతి. దీనిని దశాంశ స్థాన పద్ధతి (decimal position system) అందురు. శూన్యమును ఒక సంఖ్యగా గ్రహించిన మొదటివారు వీరే. ఈ రెండును క్రమక్రమముగా అరబ్బు ప్రపంచమునకును, అచ్చటినుండి యూరపు దేశమునకును ప్రాకి, అదివరకుండిన రోమను సంఖ్యలకు బదులు, ఇవి వాడుకలోనికి వచ్చెను.

అరబ్ దేశములోని గణిత శాస్త్రజ్ఞులలో ముఖ్యుడు 'మహమ్మద్ ఖన్‌మూసా ఆల్ ఖవారిజ్మి' (క్రీ. శ. 825). ఇతడు గణితశాస్త్రము పైనను, ఖగోళ శాస్త్రము పైనను పెక్కు గ్రంథములు రచించెను. అతని అంకగణితము హిందువుల సంఖ్యాపద్ధతియే. అతని ఖగోళ శాస్త్రము హిందూదేశములోని సూర్యసిద్ధాంతము మొదలైనవాటి క్లుప్తీకరణమే. అతని బీజగణితము ప్రథమ, ద్వితీయవర్గ సమీకరణముల సాధనమే. అతని క్షేత్రగణితము కేవలము కొన్ని వైశాల్యములను, ఘనపరిమాణములను లెక్కకట్టు సూత్రముల పట్టికయే. దానిలో ఎచ్చటను గ్రీకు గణిత శాస్త్ర పద్ధతుల వాసనయే కానరాదు. అయితే ఈ గ్రంథముయొక్క ప్రాధాన్యము ఏదియనగా, దీనిమూలముననే హిందూ సంఖ్యాపద్ధతి యూరపునం దంతట వ్యాపించుటకు అవకాశమేర్పడెను. అరబ్ దేశములోని ఇతర శాస్త్రజ్ఞులు గణితమునకు చేసిన సేవ అత్యల్పము.

అయితే అరబ్ దేశీయులు గణిత శాస్త్రమునకు చేసిన గొప్ప సేవ ఒకటి యున్నది. గ్రీసు విజ్ఞాన ప్రాముఖ్యమును వారు బాగుగా గ్రహించిరి. యూక్లిడ్, ఆర్కిమిడిస్, అపోలోనియస్, డైఫాంటస్, హిపార్కస్, టాలమీ మొదలగువారి రచనలన్నిటిని వారు సేకరించి, వాటి నన్నిటిని అరబ్బీ భాషలోనికి అనువదించుకొనిరి. తరువాత క్రైస్తవమత దౌష్ట్యమునకు పాల్పడి గ్రీకు విజ్ఞాన మంతయును ఉత్పన్నము (uprooted) కాగా ఈ అనువాదముల మూలముననే ఆ విజ్ఞానము మరల మానవ ప్రపంచమునకు ఉపలబ్ధమైనది.

263