పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/297

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గణిత భూగోళము

సంగ్రహ ఆంధ్ర

వాతి మూడు నెలలును అవి నిరక్షరేఖ వైపునకు మరలును. సూర్యుడు ఉత్తరమువైపు వంగియున్న ఈ ఆరు నెలలు (ఉత్తరాయణము) అతని కిరణములు ఉత్తరార్థ గోళమునందు తక్కువ వంపుతో ప్రసరించు చుండును. ఈఅర్థగోళమందు ప్రతిఅక్షాంశము (parallel) లోను, సగముకంటె ఎక్కువభాగము సూర్యునియొక్క వెలుగును, వేడిమిని పొందును. తత్ఫలితముగా ఇచటి ప్రతిస్థలము రోజుకు 12 గంటలకు మించి ఉష్ణమును, కాంతిని పొందుచు, తక్కువ పరిమితిగల కాలమందు మాత్రమే చీకటిలో నుండును. కనుక ప్రసరణము (Radiation) తక్కువగను, ఎండకాయుట (insolation) ఎక్కువగను ఉండును. ఉష్ణోగ్రత హెచ్చుచు వేసవి ఏర్పడును. ఈ ఆరు మాసములు నిరంతరముగా ఉత్తర ధ్రువము వెలుగులో నుండుటవలన అచట చీకటి ఏర్పడదు. దక్షిణార్ధగోళమందు పరిస్థితులు దీనికి విరుద్ధము (reverse) గా నుండును. సెప్టెంబరు 22 నుండి మార్చి 21 వరకు దక్షిణార్ధ గోళమందు వేసవియు, ఉత్తరార్ధ గోళమందు శీతకాలమును ప్రవర్తిల్లును. దక్షిణ ధ్రువమందు పగలును, ఉత్తర ధ్రువమందు రాత్రియు, ప్రవర్తిల్లుచుండును. ఉత్తర ధ్రువమండలము (Arctic circle), లోను, దక్షిణ ధ్రువమండలము (Antarctic circle) లోను, ప్రతి సంవత్సరము వేసవికాలమందు సూర్యుడస్తమించని దినము కనీస మొకటియైనను ఉండును. అట్లే శీతకాలమందు పూర్తిగా అంధకారముతో నిండియుండు రోజు కూడ ఒకటియైనను ఉండును. 661/2° లు దాటి ఉత్తరమున, దక్షిణమున, అట్టి దినములు ఎక్కువగు చుండును. చివరకు ధ్రువములయొద్ద ఆరుమాసములు ఒక రాత్రిగాను, ఆరుమాసములు ఒక పగలుగను ఏర్పడును.

దినపరిమాణ నిర్ణయము : 3వ పటములో దినపరిమాణమును కనుగొను విధానము వివరింపబడినది. వృత్తము భూగోళమును తెలుపును. A B నిరక్ష రేఖ: C D భ్రమణాక్షము (axis of rotation), E F ప్రయోగస్థానము యొక్క అక్షాంశరేఖ. C O H అను కోణము సూర్యుని యొక్క ఉత్తర దిక్పాతము (declination) ను చూపును కనుక G H కు పడమరగానుండు భాగమంతయు సూర్యకాంతిని పొందుచు, దానికి తూర్పుగ నుండు భాగ మంతయు అంధకారములో నుండును. E అను స్థానము, ఒక భ్రమణము (ఆవర్తము)లో 180°

చిత్రము - 88

పటము - 3

దూరమునేగాక, సూర్యుని ముందట, LM కు రెట్టింపు దూరమును గూడ తిరుగుచుండును. కనుక దినపరిమాణము 12 గం. మించియుండవలెను. ఆ అక్షాంశముమీద నుండు భ్రమణవేగమును బట్టియు, ప్రయోగస్థానముచే పూర్తి ప్రయాణము చేయబడిన దూరమును బట్టియు దిన ప్రమాణమును సులువుగా గుణింపవచ్చును. నిరక్షరేఖ యొద్ద కోణమునందలి అట్టి అభివృద్ధిగాని, క్షయముగాని లేని కారణమున అచట రేయింబవళ్లు సంవత్సరము పొడుగున సమాన పరిమాణములు కలిగి యుండును. అన్ని అక్షాంశములమీద మేష సంక్రాంతి (spring equinox), తులాసంక్రాంతి (autumnal equinox) దినములందు (విషువత్తులందు) అహోరాత్రములు సమముగా నుండును.

సూర్యుడు క్షితిజము క్రిందికి వ్రాలగా పగలు అంత మగుట స్పష్టము కాని సూర్యుడు అస్తమించిన తరువాత కూడ కొంతకాలము ఉన్నతాకాశములో వక్రీభవనము (Refraction) వలన కాంతి ఉండును. ఈ కాంతి నెమ్మదిగా అదృశ్యమై పోవుచుండును. సూర్యుడు క్షితిజము క్రిందికి 18° పోయినపుడు 3 వ బొమ్మలో J K అను బిందు రేఖచే చూపబడిన 108° పరిమాణము గల ఉన్నతాకాశదూరమున ఉన్నపుడు మాత్రమే చీకటి పడును.

252