పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/289

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గణపతిదేవుడు - కాకతి

సంగ్రహ ఆంధ్ర

శాసనము, శా. శ. 1175 నాటి జాయప నాయకుని శాసనమును దాక్షారామమున నుండుట ప్రబల నిదర్శనము. గణపతిదేవుని మోటుపల్లి, ఉప్పరపల్లి, ఏకామ్రనాథ, పాకాల శాసనాదులు గణపతిదేవుని కళింగ విజయమును పేర్కొనుచున్నవి.

వెలనాటి చోడులకును, నెల్లూరి చోడులకును ఈతని కాలమున స్పర్థలు హెచ్చెను. నెల్లూరును ఏలు చోడతిక్క రాజు సుమారు శా. శ. 1175 లో చనిపోగా, మనుమసిద్ధి రాజ్యమునకు వచ్చెను. కాని ఆతని దాయాదులగు అక్కన, బయ్యన్నలు వెలనాటిని పరిపాలించుచున్న ద్రావిడ మూడవ కుళోత్తుంగ చోళుని సహాయమున మనుమసిద్ధిని పదభ్రష్టునిచేసి రాజ్యమాక్రమించిరి. అప్పుడు మనుమసిద్ధి మంత్రి తిక్కన గణపతిదేవునివద్ద కేగి తన పాండిత్య ప్రకర్షను ప్రకటించి తన ఆంధ్రభారతమును వినిపించి ఆతని మెప్పించి, ఆతనిని సహాయునిగా తోడ్కొని నెల్లూరునకు విచ్చేసెను. గణపతిదేవుడును సమయమును పురస్కరించుకొని దిగ్విజయముచేసి పరమండలములు సాధించి, నెల్లూరులో దక్షిణభాగమును గాల్చి తద్విరోధులైన పడిహారి బయ్యన, అక్కనలను చంపి, మనుమసిద్ధిని గద్దియపై నిల్పి ఆతనిచేత ఏనుగులను కాన్కగా బడసెను. దీనితోపాటు వెలనాటిని, కొట్యదొనను (కొణి దెన) ఏలు మల్లచోడాదులను, అద్దంకిని ఏలు మాధవరావును, ములికినాడును, పొత్తపినాడును, రేనాడును, పెనదాడిని, పెడకల్లును, సకిలనాటిని, ఏరువనాటిని, గండికోటను జయించి కాంచీపురమువరకు తన రాజ్యమును విస్తీర్ణ పరచెను.

క్రీ. శ. 1249 వ సంవత్సరమున కాంచీపురము రాజధానిగా నేలుచున్న జటవర్మ సుందర పాండ్యమహారాజు విక్రమసింహ పురమునకు (నెల్లూరు) దిగువ దేశమును కల్లోలపెట్టు చుండగా గణపతి దేవుడు సామంతభోజుడను తన మంత్రిని దండుతో కంచిపైకి పంపి సుందరపాండ్యుని తరిమించెనని ఏకామ్రనాథ దేవాలయమునందలి శాసనము తెల్పుచున్నది. ఆ తరువాత సామంత భోజునే సైన్యపాలునిగా, కాంచీపురపాలకునిగా నచ్చట నియమించెను. 1250 లో మరల సుందరపాండ్యుడు తెలుగు చోడరాజులలో కొందరి సహాయముగొని విక్రమసింహ పురమును ఆక్రమించెను గాని, గణపతిదేవుని సేనానుల సాయముతో విజయగండ గోపాలదేవుడు మొదలగు తెలుగు చోడరాజు లాతని నెల్లూరునుండి తరిమివైచిరి. ఈ విధముగా ఇటు దక్షిణమున బళ్ళారి, రాయచూరు మండలములనుండి అటు బస్తరువరకు, అట్లే ఆదిలాబాదు నుండి కంచివరకు సుమారు ఒక లక్ష చదరపుమైళ్ళ విస్తీర్ణముగల సువిశాల సామ్రాజ్యమును గణపతిదేవుడు నిర్మింపగల్గెను.

గణపతిదేవుని కెందరు భార్యలున్నను, పుత్త్రసంతతి కలుగలేదు. అతని పట్టమహిషి సోమాంబాదేవి; అతనికి రుద్రాంబ, గణపాంబ అను ఇద్దరు కుమార్తెలు మాత్రము కలరు. రుద్రాంబను నిరవద్యప్రోలు (నిడుదవోలు) పాలకుడగు చాళుక్య వీరభద్రునకును, గణపాంబను కోటవంశీయుడగు కోట బేతరాజునకును ఇచ్చి పెండిలి చేసెను. గణపతిదేవునికి మేలాంబిక యను సోదరి కలదు. ఆమెను నతవాటి సీమ నేలు బుద్ధ రాజు కుమారుడగు రుద్రున కిచ్చెను. ఇట్లు సామ్రాజ్యములోని బలవంతులగు సామంతులతో సంబంధము నెరపి, అంతఃకల్లోలములు లేకుండునట్లు కావించెను.

గణపతిదేవుడు రుద్రాంబనే తన తరువాత రాజ్ఞిగా జేయుటకై రాజకీయ శాస్త్రాదులందు ఆమెకు శిక్షణ నిచ్చి, చివరకు ‘రుద్రదేవుడ'ను పురుష నామముతో గద్దె నెక్కించెను. గణపతిదేవుడు తాను పరిపాలించుచున్న కాలముననే రుద్రాంబ రాజ్య పరిపాలన వ్యవహారము లందు పాల్గొనునట్లు చేసెను. క్రీ. శ. 1261 లో ఆమె పట్టాభిషిక్తురాలయ్యెను. ఆమె సింహాసనమెక్కినక్రొత్తలో స్త్రీ పాలనము అంగీకరింపని కొందరు సామంతులు ముఖ్యముగా జన్నిగదేవ, త్రిపురాంతకదేవులు, అంబయదేవుడు, జటవర్మపాండ్యుడు, గొంటూరి నాగదేవుడు, దేవగిరి సేవణ వంశీయులు - తిరుగబడి స్వాతంత్ర్యము వహింప యత్నించిరి. కాని గణపతిదేవుడు వృద్ధుడైనను, రాజభక్తిపరులైన సేనానుల గట్టికొని వారి అలజడి నణచివైచెను. ఆవణ్యవనోద్భవులును, కాకతీయ సామంతులు నైన మహారాజసింహాదుల వలన వేంగీ విషయము కళింగగాంగుల హస్తగతము కాకుండ రక్షించుకొనెను. పడికము బొప్పదేవుని ప్రయోగించి నాగదేవాదులను

244