పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/288

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గణపతిదేవుడు - కాకతి

సింహాసన మెక్కించెను. త్రిపురాంతక శాసనమునందు శా. శ. 1182 వ సం. ఈతని 62 వ రాజ్య సంవత్సరమని చెప్పబడి యుండుటచే ఈతడు శా. శ. 1120 సం. నకు సరియగు క్రీ. శ. 1198 లో నే ఏలిక అయినట్లు ధ్రువపడు చున్నది.

రుద్రదేవ, మహాదేవుల పరస్పర వైరుధ్యమువలనను, జైత్రపాలుని దండయాత్రల వలనను దేశమునందు భద్రత సడలిపోయిన కాలమున గణపతిదేవుడు రాజ్యమునకు వచ్చెను. గొంటూరి (ఇప్పటి గుంటూరు) నాగదేవుడు మొదలుగా గల సామంతులు కొందరు ఆ యదను గాంచి స్వతంత్రింప నుంకించి, కాకతీయ రాజ్యమును కూలద్రోయ యత్నించిరి. కాని రాజనీతికోవిదు డగు గణపతిదేవుడు రేచర్ల రుద్రదేవుడు, బొప్పదేవుడు మొదలగు సమర్థులైన సేనానుల సహాయమున సామంతుల అలజడులను అణచివైచెను. అంతటితో ఆగక కృష్ణానదీ ముఖము మొదలు కాంచీపురము పర్యంతము వ్యాపించి, నామమాత్రముగా చోడ సామంతులమని చెప్పుకొనుచు పరిపాలించుచున్న కమ్మనాటి, పాకనాటి రెడ్లను జయించి తన ఏలుబడిక్రిందికి తెచ్చెను.

గణపతిదేవుడు క్రీ. శ. 1212 వ సంవత్సరమున పూర్వ దేశ విజయయాత్రకు బయలుదేరెను. కొలనుపురము (ఏలూరు) రాజధానిగా, తెలుగునాయకులు కృష్ణాగోదావరీ మధ్య ప్రదేశము నేలుచుండిరి. వీరు నామమాత్రముగా వెలనాటి ప్రభువులకు సామంతులుగా వ్యవహరించుచున్నను, స్వతంత్ర ప్రతిపత్తిని వహించి యుండిరి. అట్టివారిలో శ్రేష్ఠులైన మహామండలేశ్వర, కేశవదేవరాజ, సామినాయకులను వారితో గణపతిదేవుడు యుద్ధములు సలిపి, క్రీ. శ. 1228 వ సం. నాటికి పూర్తిగా వారి నోడించి, వారి రాజ్యముల నాక్రమించెను.

గణపతిదేవుడు సేవణ, కర్ణాట, లాట, కళింగ, చోళ రాజన్యులను జయించి వెలనాటిపై దండెత్తెను. 'అయ్య' వంశమునకు చెందిన కమ్మనాటి పాలకుడగు నారపనాయకునిచే నిర్మింపబడిన 'చోడసముద్ర' ప్రాంతమును పట్టి రత్నాశ్వ గజ, ధన, కనక వస్తు వాహనాదులను ఓరుగంటికి తరలించెను. ఆతడు జైత్రయాత్రలో శత్రు విజయముతో నాగక వారితో నేవో సంబంధ బాంధవ్యముల నేర్పరచుకొని శాంతియుతముగా దేశమును రక్షింప దలచెను. చోడినాయక సేనానియు, 'అయ్య' వంశజుడును అయిన పిన్నచోడుని ఓడించి, ఆతని కొమరితలైన నారాంబ, పేరాంబలను పెండ్లియాడెను. జాయప నాయకు డనుశూరుడు ఆ రాణులకు రెండవ తమ్ముడు. గణపతిదేవు డాతని సూక్ష్మబుద్ధిని, ధైర్యసాహస గుణాదులను గమనించి తన గజసైన్యాధ్యక్షునిగా (గజసాహిణి) నొనర్చికొనెను. జాయపనాయకుడును రాజునకు శాత్రవ విజయమునందు అధికముగా తోడ్పడి 'వై రిగోధూమఘరట్ట' యను బిరుదమును పొందెను.

కాకతిరుద్రదేవుని మంత్రియగు ఇందులూరి పెదమల్లన పుత్త్రులైన సోమరాజు, పెదగణ్ణగరాజు, అనువారు గణపతిదేవునికి అండగా నిలిచి, ఓరుగంటికి తూర్పుననున్న రాజ్యములను గెలిచి, రాజున కప్పగించిరని 'శివయోగ సారము' వలన తెలియుచున్నది. వీరిలో సోమరాజు మండలేశ్వరులైన తెలుగు నాయకులనుండి కొలనువీడు (ఏలూరు) దుర్గమును క్రీ. శ. 1228 లో సాధించి కాకతీయ రాజ్యమున కలిపెను.

రాజసేవా పరాయణులైన సేనానులు అకళంక భక్తిప్రపత్తు లాధారముగా, సహజముగా తనకున్న రాజకీయతంత్ర ప్రయోగ నైపుణ్యముతో రాజకీయ సాగరమును కడముట్ట ఈదుచున్నను, కళింగ గంగవంశపు రాజుల వలనను, తత్తీర సామంతుల వలనను కొంత అశాంతి గణపతిదేవునకు తప్పలేదు. మూడవ అనంగ భీమదేవుడును, అతని కుమారుడు మొదటి నరసింహదేవుడును కళింగమునుండి విజృంభించి, ఉత్తరమున బఖ్తియార్ ఖిల్జీ దండయాత్రలను నిగ్రహించి, దక్షిణమున కాకతీయ సామంత రాజుల కొందరిని గెలిచికొనిరి. క్రీ. శ. 1152, 1155 సంవత్సరములకు చెందిన రెండు శాసనములు అనంగ భీమునిపేర దాక్షారామమున కానబడుట బట్టి అతడు వేంగిని కాకతీయులనుండి జయించినట్లు చెప్పవచ్చును. ఈ ఉపద్రవమును దాటుటకై గణపతిదేవుడు తన ప్రధానియైన హేమాద్రి రెడ్డిని, గజసాహిణియైన జాయప నాయకుని, కళింగమును జయింప దండు నిచ్చి పంపెను. వారా ప్రాంతమును మరల జయించి శాంతి నెలకొల్పిరి. అందులకు శా. శ. 1159 నాటి హేమాద్రి

243