పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/286

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గడియారములు

దించుటకు దీర్ఘకాలము పట్టెను. క్రీ. శ. 1500 వ సంవత్సరములో 'పీటర్ హెన్‌లిన్' తయారుచేసిన జేబు గడియారములో, పైకి కనబడకుండునట్లు 'డ్రమ్' అను చిన్న ఇత్తడిపెట్టె అమర్పబడియుండెను. దీనిలో గడియారమును నడపు యంత్రముండును. 'కీ' ఇచ్చినప్పుడు డ్రమ్ తిరుగును. దీనిలో ఇందమర్చబడియున్న యంత్రములోని భాగములన్నియు ఒకే సమయమున తిరుగుచు కాలమును తెలిపెడివి. చిక్కిరి బిక్కిరిగా నున్న ఈ జేబు గడియారములోని యంత్రభాగములు అయోమయముగా నుండెడివి. ఈ జేబు గడియారమునకు గంటముల్లొక్కటి మాత్రమే ' యుండెను.

ప్రారంభములో జేబుగడియారములు కోడిగ్రుడ్డు ఆకారములోను, కాలక్రమమున పెక్కు విచిత్రరూపములలోను తయారు కాబడినవి. కొన్నిటియందు విలువైనరాళ్లుగూడ పొదగబడి ఐశ్వర్యవంతులకు అలంకార ప్రాయమగుచుండెను. క్లిష్టమైన ఇట్టి గడియారములను తయారు చేయుటకు ఆనాడు సున్నితమైన యంత్రసాధనములు లేకుండుటచే, పనితన మంతయు చేతులమీదుగనే జరుగవలసి యుండెను.

పూర్వము హాలెండుదేశము 30 లేక 40 గంటలు కొట్టగలుగు గడియారములకు ప్రసిద్ధమై యుండెను. ఇప్పు డిట్టి వాద్యగడియారములలో జాతీయ గీతములు కూడ కొన్ని పాశ్చాత్యదేశములలో మనోహరముగ ఆలపింపబడుచున్నవి.

లోలకమును ( పెండ్యులమ్) గడియారములో ప్రవేశపెట్టి, గడియారపు గమనము క్రమబద్ధముగ సాగునట్లు ప్రప్రథమముగ పరిశోధనము నెరపినవాడు గెలిలియో. కాని లోలకగడియారమును తయారుచేయుటలో అతడు కృతకృత్యుడు కాజాలక పోయెను. ఈ విజయము క్రిస్టియన్ హ్యూగెన్స్ అను మరియొక శాస్త్రవేత్తకు దక్కెను. గెలిలియో, హ్యూగెన్స్'లకు పూర్వమున గల గడియారములలో వలెనే ఈనాటి గడియారములలోను యంత్రభాగము లన్నియు అమర్పబడియున్నవి. అయితే లోలక గడియారమునకును తక్కిన వాటికిని గల భేద మొక్కటి మాత్రమే. లోలకగడియారములో 'విండ్ లాస్' గాని, 'బాలెన్స్' గాని ఉండదు. వాటి స్థానములో 'ఎస్కేవ్‌వీల్' ను పట్టుకొని బరువును త్వరగా క్రిందికి పోకుండునట్లు చేయు ఏర్పాటు ప్రవేశపెట్టబడినది. 'ఎస్కేవ్‌వీల్' నకు పైన 'యాంకర్' (anchor) అను పేరుతో వంగియున్న ఒక ప్లేటు ఉండును. తక్కిన చక్రము లన్నిటి క్రిందనుండి తిరిగెడి లోలకముతో సహా, ఈ యాంకర్ గూడ తిరుగును.

చిత్రము - 82

పటము - 6

పెండ్యులమ్ గడియారము పనిచేయువిధము

'యాంకర్ ' కు ఏర్పడి యున్న వంకీ (hook) ఎస్కేవ్ వీల్ యొక్క పళ్ళమధ్యపడినపుడు చక్రముకొలది కాలమాగును. కాని ఆ బరువు తన పనిని తాను నెరవేర్చి. వంకీని అవలకు నెట్టునట్లు చక్రమును ముందునకు త్రోయును. ఈ త్రోపిడివలన వంకీ పైకి వచ్చి, చక్రమందలి ఒక పన్ను పైకి పోవును. ఈ త్రోపిడివలన పెండ్యులము వెనుకకు ఊగును. యాంకర్‌కు గల కుడివంకీ మరల ఎస్కేవ్ వీలును ఆపును. ఈ యంత్రముల చలనము ఈ విధముగ ఎడతెగక జరుగుచునే యుండును. కుడివైపునుండి ఎడమ వైపునకు ఊగు పెండ్యులమ్ ప్రతి ఊపునకు చక్రమును ఒక పంటికంటె ఎక్కువగా తిరుగనియ్యదు. అందుచే వెండ్యులమ్ యొక్క ప్రతి ఊపు సమానకాలములో సాగిపోవును. దీనివలన మొత్తముగా యంత్రమంతయు నియమబద్ధముగా పనిచేయునట్లు పెండ్యులం సహాయపడగలదని స్పష్టమగును.

పూర్వము గడియారములు తయారు చేయుటకు వలయు సాంకేతికశాస్త్ర పరిజ్ఞాన మంతయు వంశపారంపర్యముగ సంక్రమించుచుండెను. తా మార్జించిన ఇట్టి పరిజ్ఞాన మంతటిని నిపుణులు కర్మాగారములలో గడియారములను వేరు వేరు ఫణతులలో తయారు

241