పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/282

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గడియారములు

ప్రకాశింపని పగటి వేళలయందును, రాత్రుల యందును మాత్రమే ఉపయోగించెడిది. ఇటీవలి కాలమువరకు ఇట్టి గడియారములు చైనా యందు గూడ అచ్చటచ్చట కనిపించుచుండెడివి. నాలుగు రాగి పాత్రలు ఒకదానికి దిగువగా మరొకటి మెట్లమీద అమర్పబడి, ఒక దానినుండి వేరొక దానిలోనికి నీరు ప్రవహింప చేయబడెడిది. ప్రతి రెండుగంటల కొక సారి అన్నిటికంటె ఎగువననున్న పాత్రను నీటితో నింపవలసియుండెను. ఇతర పాత్రలు వాటంత టవియే నిండెడివి. ఈ పాత్ర లన్నిటినుండి నీరు బయటికి వెడలు కాలపరిమితి ఒక 'యూనిట్' గా భావింపబడెను. దానిననుసరించియే కాలమానము గుణింపబడెడిది.

చిత్రము - 78

పటము - 2

చైనా నీటిగడియారము

కాలక్రమమున నీటి గడియారమును నిర్మించు విధానములో పెక్కు మార్పులు ప్రవేశపెట్టబడినవి. గంటలను తెలుపుటకై గరాటా (శంకువు) వంటి పాత్రను 24 భాగములుగ విభజించి, దానిపై 24 గీతలు గీచెడివారు. నీటిమట్టమునుబట్టి ఎన్నవ గీతవరకు నీరు నిలిచినదో పరిశీలించి, కాలమును లెక్కించెడివారు. అంతకు పూర్వమువలె గాక, క్రొత్తరకమైన 'గరాటా నీటి గడియారము'లపై సమాన దూరములలో గీతలు గీయ బడుటచే, వీటివలన కాలమును గంటలలోనికి సరిసమానముగా విభజించుట సులభమయ్యెను. గ్రీకు ప్రజలు గరాటాలోని నీరు ఒకసారి ఖాళీయగుటను 'క్లెప్సి డ్రా' యని పిలిచెడివారు. ఒకగంట పరిమితిలో ఒక పనిని పూర్తిచేసిరని చెప్పుటకు నాలుగు 'క్లెప్సిడ్రాలు' పూర్తి అయినవని చెప్పెడివారు.

రెండువేల సంవత్సరములకు పూర్వము అలెగ్జాండ్రియాలో 'క్లెసీబియస్' అనునతడు క్రొత్త విధమైన నీటి గడియారమును తయారు చేసెను. నీటియావిరి, విద్యుచ్ఛక్తియన నేమియో తెలియని ఆదినములలో ప్రకృతి సిద్ధములైన నీరు, గాలిమాత్రమే ఇట్టివారికి ఉపకరించెను. నీటియంత్రములు జలపాతములవలన నడచెడివి. క్లెసిబియస్ తయారుచేసిన గడియారముయొక్క నిర్మాణము నేడు మన ముపయోగించు గడియారముల దానికంటె క్లిష్టమైనది. ఇది అన్ని ఋతువులలోను సరైన కాలనిర్ణయముచేసెడిది. ఇది గుండ్రముగగాక, నిలువుగనుండెడిది. దానిపై గుర్తింపబడిన రోమన్‌అంకెలు రాత్రికాలమును, అరేబియన్ అంకెలు (ఇప్పటి ఇంగ్లీషుఅంకెలు) పగటి కాలమును తెలిపెడివి. ఒక చిన్న గొట్టముపై యొక బాలునిబొమ్మ నిలబెట్టబడెడిది. ఈ బొమ్మ చేతిలోనుండెడి కర్రపుడక ఈ గడియారమునకు ముల్లుగా వ్యవహరించును. ఈ గొట్టము స్వయముగా తిరుగుచు, గడియారములో నుండి పైకివచ్చి, బొమ్మను గడియారముయొక్క పై భాగమువరకు లేవనెత్తును. బొమ్మతోపాటు, దాని చేతిలోని కర్రపుడక గూడ పైకిపోవుచు కాలమును సూచించును. బొమ్మ క్రిందినుండి చివరవరకు పోవుటకు 24 గంటలు పట్టెడిది. ఆ బొమ్మ మరల క్రిందపడి, పూర్వమువలె తిరిగి మెల్లగా పైకి పోవుచుండును. గంటల అంకెలు వేర్వేరు ఋతువులలో వేర్వేరు దూరములలో నుండును. అందుచే గడియారమునకు ఒక చక్రముగాక పండ్రెండు చక్రములుండెడివి. ఇవి 12 నెలలకు ఉపయోగపడెడివి. ఈ గడియారము ఒక అక్షముపై తిరుగుచు, అంకెల సమూహములను ఒక దాని తరువాత మరియొకదానిని కర్రపుడక వద్దకు తెచ్చు చుండును. ఈ నీటిగడియారము అక్షము పై తిరుగుటకును,

237