పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/280

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గజశాస్త్రము


మణి నేత్రో మహోష్ఠచ్చ
      మహాకర్ణో మహాముఖః
మహాకంఠో, మహాపాదో
      భవేత్సాంగ్రామికో గజః. '

గజోపయోగములు : గజబృందము అమూల్యమైన వనసంపదగా పేర్కొనబడినది. వాని దంతములు మిక్కిలి విలువగలవి. అవి ఆభరణములుగాను, విలాస వస్తువులుగాను, పీఠములు గాను, పాత్రములు గాను, కస్తూరి మున్నగునవి దాచియుంచు బరిణలుగాను అనేక విధములుగా రూపొందింపబడుచున్నవి. గజమృగయ ప్రధానముగా దంతములకే యనుట ప్రసిద్ధి. ఏయే మృగముల నెందుకు వేటాడుదురో ఈ శ్లోకము వివరించుచున్నది:


'చర్మణి ద్వీపినం హంతి దంతయోర్హంతి కుంజరమ్
వాలేషు చమరీం హంతి సీమ్ని పుష్కలకో హతః.'

వ్యాఘ్రము చర్మనిమిత్తముగను, కుంజరము దంతనిమిత్తముగను, చమరీమృగము వాల నిమిత్తముగను, కస్తూరి మృగము కస్తూరి కోశ నిమిత్తముగను చంపబడునని తాత్పర్యము. వాహనములుగా ఉపయోగపడుట, శుభదాయకములగుటవంటి ఆనుషంగిక ప్రయోజనములు మరి యెన్ని యున్నను గజముల ప్రధాన ప్రయోజనము మాత్రము దేశరక్షణమే యై యుండెను. తొల్లింటి రాజులకు, తన్మూలమున ప్రజలకు గజబలము శ్రీరామరక్ష.


'ప్రాకారతః పురద్వార కవాటోద్ఘట్టనాదిషు
భంజనే మర్ద నేచై వ, నాగాః వజ్రోపమాః స్మృతాః.'

ప్రాకారమును, పురద్వార కవాటములను భేదించుటలో గజములు వజ్రసన్నిభములు. అశ్వ పదాతు లల్పసత్వములు: గజము మహాసత్వము.


'ఏకశక్తి ప్రహారేణ మ్రియతే౽శ్వో నరో౽పివా
సహేన్మహాప్రహారాణాం శతం యుద్ధేషు వారణః.’

యుద్ధములో ఒక్క చిల్లకోలపెట్టుతోనే అశ్వము, భటుడు పడి చత్తురు. ఏనుగో, నూరు దెబ్బలనైన ఓర్చి పోరాడును. యుద్ధమున గజవాహన వైశిష్ట్య మిట్లుగడింప బడినది.


'రథయోగ్యా క్షి తిర్నైవ వాజియోగ్యాపి యత్రవా
మహావర్షాస్వపి గజాః తత్ర యాంతి సుఖం రిపూన్.'

వర్షాకాలములో రథాలు పోలేని, గుఱ్ఱాలు చేరలేని కర్దమదుర్గమ ప్రదేశాలకు కూడ గజములు అనాయాసముగా పోయి శత్రువులను తాకగలవు. కావుననే,


'జలే స్థలే చ దుర్గే చ శాఖిభిః సంకటే తథా
సమే చ విషమే చైవ జయో నాగవతాం ధ్రువమ్.'

అన్నారు. జలమనియు, స్థలమనియు లేదు. చెట్లు అడ్డమని లేదు. సమ విషమ స్థలము లన్నింటిలో గజసేన గల వారికి జయము నిక్కము. మత్తమాతంగ మొక్కటి విజృంభించి తలపడేనా, ఆరువేల గుఱ్ఱములను మట్టు పెట్ట గలదు. రథాశ్వశిబికాదులు వాహనములు మాత్రమే. గజమో! వాహనమగుచునే శత్రుసంహారక యోద్ధయునగుట విశేషము. గజశాస్త్రకోవిదుల వాక్యములలో గజప్రశంస యిట్లున్నది :


అగ్నిపురాణము :
    కుంజరాః పరమా శోభా శిబిరస్య బలస్యచ
    అద్రుతః కుంజరైశ్చైవ విజయః పృథివీక్షితా'

సేనావేశమునకు, సేనకు, ఏనుగులే పరమశోభాకరములు. రాజు గజములతోనే విజయము సాధించును.


శివతత్త్వసారము :
     రక్షంతి పక్షం ముదితాః స్వకీయం
     మృదంతి సైన్యం కుపితాః పరేషామ్
     ప్రాణైర పీచ్ఛంతి హితం ప్రభూణాం
     గజై స్సమానం క్వ బలం మహీయః.

స్వపక్షరక్షణమును, పరపక్ష శిక్షణమును గావించుచు గజములు అవసరమైనచో ప్రాణములైన నర్పించి ప్రభు శ్రేయమును కోరును. గజబలము సాటి యేది?


హరిహర చతురంగము :
      'సహి రాజా యస్య చమూః
      సా చమూర్యత్ర హస్తినః' (I-20)
సేనగలవాడే రేడు - గజము లున్నదే సేన.
     'నచ రుద్రాత్పరో దేవః నచ వేదాత్పరం శ్రుతమ్
      యానాంతరం పరం నాస్తి గజాదన్య న్మహీపతేః'

శివునికంటె వేరు దైవము, వేదములకంటె వేరు జ్ఞానము, గజయానముకంటె వేరు యానము లేదు.


రాత్రిర్యథా శశాం కేన యౌవనేన యథా స్త్రియః
తథా సేనా గజేంద్రేణ తయా రాజాచ శోభతే.'

చంద్రునిచే రాత్రియు, జవ్వనముచే యువతియు శోభిల్లు

235