పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/275

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గజశాస్త్రము

సంగ్రహ ఆంధ్ర


'గురుత్వం రూపతః శ్రేష్ఠంగురుత్వాదధికం బలమ్
బలాదప్యధికం సత్వం 'తస్మాత్సత్వం నిరూపయేత్'

(హ. చతు. 52 పు.)

అని శాస్త్రజ్ఞుల వాక్యము.

అయిన ఈ సత్వస్వరూపమేమి? యని ప్రశ్నించుకొని దానిని నిర్వచించినారు.


'శుద్ధస్ఫటిక సంకాశం, సత్యం హృది శరీరిణామ్
దుర్లక్షం విద్యతే సమ్యగుపాయైస్తత్తు లక్ష యేత్'

(హ. చతు. 52 పు.)

శరీరధారుల హృదయములో వెలికి కనుపింపక శుద్ధ స్ఫటికమువలె సత్వముండును. దానిని ఉపాయములచే గుర్తింపవలెను.

1. గజశ్రేణికవచముగా గల్గి భీషణాయుధోద్ధతమైన పదాత్యశ్వసమూహమును నిర్భయముగా తాకి చెల్లా చెదరు కావించు గజరాజు ఉత్తమ సత్వసంపన్నమనబడును. శార్దూలాది ఘాతుకములను ధైర్యముతో ముట్టి, కొమ్ములతో క్రుమ్మి చంపునట్టిది సత్వవంతము. నాలుకలు చాచి, కార్చిచ్చు చుట్టుకొని వచ్చుచున్నను చెదరక బెదరక అడవిలో క్రుమ్మరు ఏనుగు మేలిసత్తువకలది.

2. ఆరోహకు డధిరోహించి, బలాత్కరించి నడుపగా ఘీంకరించుచు, సంకోచించుచు ఇష్టములేనిదైనను తప్ప దురా దైవమా యన్నట్లు జాలిగొలుప మెల్ల మెల్లగా అడుగు లిడుచు పోవునది మధ్యమ సత్వము గల హస్తి.

3. మావటీడు ప్రేరేపింపగా ఏది దిక్కు అన్నట్లు ప్రక్కలుచూచుచు, సీత్కారములు చేయుచు, వెరపు దోపు చూపులతో ఎదిరి యేనుగును కాంచుచు, పరబలము నెల్ల ఒక పెద్ద మంటగా తలచి, తలకునట్టిది అధమసత్వము

దంతాఘాతములు : మహావీరులకు ధనుర్వేదాదిపరిజ్ఞాన మెంత యవసరమో, యోద్ధృగజములకు దంతాఘాత శిక్షణమంత యవసరము. దంతాఘాత శిక్షితము కాని హస్తిరూపబలసత్వములలో ఎంత యుత్తమమైనదైనను యుద్ధసమయమున కొరగాని కొయ్యగా తేలును.


'బలసత్వ గురుత్వాది గుణయుక్తోపి వారణః
దంతాఘాతాన్న జానాతి యో రణేనిష్ఫలోహిసః

(హ. చతు. 54 పు.)

అని ప్రమాణము. దంతాఘాతము లివి :

1. సంపాతము (సంఘాతము) 2. ఉల్లేఖము (లేఖః) 3. పరిఖేలము (పరిలేఖము) 4. కర్తరీఘాతము 5. తలఘాతము 6. పార్శ్వఘాతము 7. ఆరాఘాతము 8. సూచీఘాతము 9. తాడితఘాతము 10. సంధితా ఘాతము. అజాఘాత నిర్ఘాతాదులు మరి నాలుగు కలిపి మొత్తము పదునాల్గు దంతాఘాతములను సోమేశ్వర మహీపాలుడు చెప్పెను. (మానసో 209-10) వీనిలో కొన్నింటిని గ్రంథకర్త లిట్లు వివరించిరి. ప్రతి దంతిదంతముల క్రిందిభాగమున గాని, ముఖముమీద గాని చేయు దంతఘాతమును తలాఘాతమందురు. తలనడ్డము త్రిప్పి కొట్టు కొముదెబ్బ పరిఖేలము. కొమ్ములను నిటారుగా ఎత్తి దండముతో కొట్టినట్లు కొట్టుట ఉల్లేఖము. శత్రు గజముఖమును తన దంతయుగ్మము నడుమ ఇరికించుకొని యిటునటు త్రిప్పిత్రిప్పి పీడించుటయే కర్తరీఘాతము. తన దంతములతో ఎదిరి యేనుగుదంతములు ముక్కలు ముక్కలై పడునట్లు కొట్టుట తాడితాఘాతము. ముందరి కాళ్ళు పైకెత్తి శత్రుగజముపై, సింహము హస్తిపై దూకినట్లు దూకి, రేగిన యలుకతో చచ్చునట్లు దెబ్బపై దెబ్బగా వేయు వ్రేటులే సంధితాఘాతము. కట్టెదుట నిలిచి ప్రతి గజముఖమునే లక్ష్యముచేసి పొడుచుట ఆరాఘాతము. ఒక దంతముతోనే కొట్టుట ప్రతిఘాతము . ఒక కొమ్ముతో తొండము నడుమ గ్రుచ్చుకొనునట్లు పొడుచుట సూచీఘాతము. తిర్యగ్దంతప్రహారముచేయు దానిని పరిణతగజ మందురట! 'ఆషాఢస్య ప్రథమదివ సే మేఘమాశ్లిష్టసానుం వప్రక్రీడాపరిణత గజప్రేక్షణేయందదర్శ' (మే. సం. 1 2 శ్లో.) రామగిరి సానువులనున్న మేఘము వప్రక్రీడలాడు పరిణతగజమువలె ప్రేక్షణీయముగా నున్న దన్న భావమిచ్చు కాళిదాస మహాకవి వాక్యముననున్న పరిణతగజ శబ్దమును వివరించుచు, మల్లి నాధసూరి'పరిణతః తిర్యగ్దంత ప్రహారీ' అని చెప్పి తన వివరణమునకు ఉపష్టంభకముగా 'తిర్యగ్దంత ప్రహారీతు గజఃపరిణతో మతః' (తిర్యగ్దంత ప్రహారముచేయు గజము పరిణత మనబడును ) అను హలాయుధ నిఘంటు వాక్యమును ప్రదర్శించెను.

గజములకు సాధారణముగా ప్రహరణ సాధనములైన దంతములు రెండే యుండును గాని అట్టివి నాలుగు దంతములు గల గజజాతులు కూడ ఉన్నట్లు పూర్వగాథలలో

232