పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/271

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గజశాస్త్రము

సంగ్రహ ఆంధ్ర

కూటస్థగజములు – తదన్వయములు: 1. ఐరావతము, 2. పుండరీకము, 3. వామనము, 4. కుముదము, 5. అంజనము, 6. పుష్పదంతము, 7. సార్వభౌమము, 8. సుప్రతీకము.

ఈ యెనిమిది దిగ్గజములును కూటస్థగజములు. ఏ తద్వంశీయములైన గజముల స్వరూప స్వభావము లివి:

1. కేశలోమములును, వాలమును, పొత్తికడుపును, నేత్రములును తెల్లగానున్న కుంభి ఐరావతజాతిది.

2. విశేషముగా తామరకొలకులలో విహరింప నభిలషించునదియు, యుద్ధకౌశలము గలదియు, స్థూల శీర్షయుతము నైనదియు పుండరీకవంశజము.

3. అగ్నివర్ణము, బంగారువన్నె కన్నులు గలది, వేగవంతమై జలాసక్తి మిక్కుటముగా గలది వామనవంశ సముద్భూతము. ఇది ఆయతము, విస్తృతము, వామనము అయిన కాయముతో ఒప్పియుండును.

4. స్థూలమై తెల్లకలువ వన్నెగల తనువు, ఎఱ్ఱనివియు తీక్ష్ణములైనవియు నగు కనులు, నల్లనిదియు - వెడల్పై నదియు నగు శుండాగ్రము గలది కుముదజాతి గజము.

5. చిక్కని రోమములు గల పుచ్ఛము, స్నిగ్ధగండములు, తెల్లని పొట్ట, తెల్లని తొండము, ఉన్నతములైనవియు - స్థూలము లైనవియు అగు పిరుదులు గలది అంజనాన్వయసంభవము.

6. స్థూలములైన బిందుజాలకమువెలయు అంసభాగములతో, కృష్ణ కేశములతో, కృశోదరముతో, సుందర దేహముతో ఎసగునది పుష్పదంత వంశీయము.

7. చెవులు - వృష్ఠభాగము తెల్లనై, చెవులు పొట్టివై, తొండము కుఱుచయై కాయము స్థూలమై యున్నది సార్వభౌమము. ఇది తఱచుగా కరిణీయూధమునకు నాయకత్వము వహించి క్రుమ్మరుచుండును.

8. నల్లకలువ వన్నెగల దేహము, పావురపు రంగు కన్నులు, చిన్న రోమములుగలిగి ప్రజ్ఞాశాలియు, పరాక్రవంతమునై నది సుప్రతీక వంశోత్పన్నము.

అన్వర్థ వేద్యాదులు - గజ భేదములు : స్వభావమును బట్టి గజములలో వర్గచతుష్టయ మేర్పడినది. అన్వర్థ వేది, గంభీరవేది, ఉత్తానవేది, ప్రత్యర్థవేది యని ఇవి వర్గీకరింప బడినవి. వీనిలో :

1. అన్వర్థవేది : శౌర్యము, ధైర్యము, పాటవము, వినయముగలిగి. భయస్థానములను గుర్తించి మెలగు గజరాజము అన్వర్థ వేది.

2. గంభీరవేది : చెడు స్వభావము, సోమరితనము, నిద్రాళుత, మూఢత యను యవగుణములకు తావలమగు దంతావళము -గంభీర వేది

సుప్రసిద్ధ వ్యాఖ్యాత మల్లినాథసూరి రఘువంశ వ్యాఖ్యానములో (IV. 39) రాజపుత్రీయ, గజచర్మీయ గ్రంథములలోని వనుచు గంభీరవేది గజస్వరూప నిరూపకములగు ఈ క్రింది శ్లోకముల నుదాహరించెను :


'త్వగ్భేదా, చ్ఛ్రోణితస్రావా, న్మాంసస్య కథనాదపి
ఆత్మానం యోనజానాతి సస్యాద్గంభీర వేదితా'.
                                          (రాజపుత్రీయే).
'చిరకాలేనయో వేత్తి శిక్షాం పరిచితామపి
గంభీరవేదీ విజ్ఞేయః సగజో గజవేదిభిః'.
                                          (మృగచర్మయే).

చర్మము తెగినను, నెత్తురు కారినను, మాంసము కోసినను, ఏది తనను గుర్తింపదో యది గంభీరవేది—తనకు చిరాభ్యస్తమైన శిక్షనుకూడ ఏది వెంటనే గ్రహింపలేదో యది గంభీరవేది అని భావము.

3. ఉత్తానవేది : చండత్వము, చాపల్యము, తొందరపాటు, కాముకత్వము, శౌర్యముగలది ఉత్తానవేది.

4. ప్రత్యర్థవేది : వారించిన కొలదియు వడిగా పరుగెత్తునదియు, తనకు ప్రియమైన హస్తి వెంటబడిపోవునదియు నగు నది ప్రత్యర్థవేది. ఇది మిశ్రగజము.

5. గంధ గజము : గజజాతులలో సర్వశ్రేష్ఠమైనది గంధగజము. ఆరోగ్యము, పూర్ణయౌవనముగల కరిణియందు అట్టిదియే యగు గజమునకు వసంత కాలమున ఉద్భవించినది గంధగజమగును. ఈ గజరాజు యొక్క మూత్ర స్వేదపురీషములు తేనెవాసన గలిగియుండును. దేని మదమూత్రాదులను మూచూచి అన్యగజములు మత్తిల్లునో యది గంధగజమని తెలియదగును. ఇట్టి గంధగజముయొక్క మదమూత్రాదులను వాసన చూచి ఏ యేనుగు కోపదీప్తమగునో అదియు గంధగజ జాతిదియే యగును. దూరముననున్న కరుల మదవాసననుబట్టి మఱియొక దిక్కుగా పోవుచున్న తాను మరలి ఆ మద

228