పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/269

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గజశాస్త్రము

సంగ్రహ ఆంధ్ర


ఆనాహ ఉచ్చ్రయః పాదా
         ద్విజ్ఞేయో యావదాసనమ్.'
            (శివతత్త్వ రత్నాకరము VII. 11.32)

ఏనుగు ముఖమునుండి తోక మొదటివరకును నిడుపు. పృష్ఠ పార్శ్వమునుండి ఉదరాంతరము వరకును వెడల్పు. పాదతలమునుండి మూపు వరకును ఎత్తు అని తెలిసికొనవలెను.

భద్రాది - గజభేదములు : భద్రగజములు, సమములు ఘనములునైన కక్షాండకోశములు, కూర్మములవంటి మడమలు, దళసరి గోళ్ళు, గోళ్ళనడుమ రోమములతో కూడిన మాంసగ్రంధులు, బలిష్ఠములైన పాదములు గలిగి, సమ విభక్తములైన యంగములతోను, తేనెవన్నె కన్నులతోను, దంతములతోను వెలయునవి. ఇవి అతికృశములును అతిపీనములునుగాక సమ ప్రమాణయుతములై, పద్మకశోభితములై, పర్వత సంచారశీలములై యొప్పుచుండును. భద్రగజారోహణ మిట్లు ప్రశంసింపబడినది.


'ఆరోహణం భద్రనామ్నో మాతంగస్య యశస్కరః
ఆయుష్కరం పాపహరం బల తేజో వివర్ధనమ్'.
                                               (శి. త. ర . VIII)

భద్రగజము నారోహించుట కీర్తిదాయకము; బలము తేజస్సు వృద్ధినొంది దీర్ఘాయువు గలుగును. పాపము తొలగునని భావము.

మందగజములు : తొండము, తల, చెవులు పెద్దవిగా నుండి, బానపొట్టగలిగి మిక్కిలి యెత్తైనవి మందగజములు. వీని కాయము పూర్వభాగమున వంగియుండును. లావైన దంతములతో కండలు తేలిన యవయవములతో, పసుపుపచ్చని కన్నులతో ఈ మందగజము లొప్పారును. ఇవి విశేషముగా నదీతీరములందుసంచరించునవి. ఘాతుకములు.

మృగ గజములు : ఈ జాతివి నిడుపైన గాత్రము, దంతములును, ప్రసన్నములైన చూపులును, నిద్దపు వన్నెయు, పెనువళులును కలిగియుండునవి. వీనికి ముఖమున దట్టములైన సిబ్బెము లుండును. పాదములును, మెడయు, తొండమును, సన్ననివిగాను, నోరు, పెదవులు, రోమములు, స్థూలములై కురుచలుగా నుండును. వీని వెన్ను చిన్నది. మోము చిన్నది, దంతములు సన్ననివి. అతి వక్రములైన యీ మృగగజములు వనములలో నివసించును.

సంకీర్ణజాతి గజములలో అష్టాదశభేదములు గలవని కాశ్యపులు వచించిరి. అన్యజంతువుల గతి, చేష్ట, స్వరము, బలములను అనుకరించుట యను గజచేష్టితమును అనూక మందురు. ఈ యనూకము శుభానూకము, నిందితా నూకము అని రెండు విధములు. శుభజంతువులయొక్క చేష్టాద్యనుకరణము శుభానూకము. నింద్య జంతువుల ననుకరించుట నిందితానూకము.

గజములు - దేవతాంశములు :

1. బ్రహ్మాంశకము : మల్లెపూలవలె తెల్లనై, చక్కనై యున్న సువ్యక్త బిందువులతో, ఎఱ్ఱనైన నేత్రాంశములతో, సుదృఢములైన దంతములతో విలసిల్లు దంతావళము బ్రహ్మాంశము గలది. దీనికి కక్ష, కంఠభాగములు సమములై యుండును. తల పెద్దది. ముఖమున ఎఱ్ఱ కలువ చాయయు, మృదురోమములును గలిగియుండు ఈ గజము ఉరుము సవ్వడికి హర్షించును. ఇది చిరకాలము మదస్రావియై యొప్పునది. పూజార్హమైన యీ బ్రహ్మాంశ గజమున్న వానికి విజయారోగ్య వంశాభివృద్ధ్యాదులగు అభ్యుదయములు గల్గును.

2. ఇంద్రాంశకము : ముఖమున బిందుజాలకము, వక్షమున వళులు కలిగి స్వస్తిక వర్ధమాన నంద్యావర్తాది రాజదేవభవనములకు సాటియై, ఎఱ్ఱకలువలవంటి కన్ను గవగలది ఇంద్రాంశజాతము. ఈ గజరాజము యుద్ధమున విజయ మిచ్చి యైశ్వర్యమును పెంపొందించును.

3. ధనదాంశకము : ఎఱ్ఱని పెదవులు, ఉసిరిక వన్నె నాలుక, కుసుమరంగు కనులు, అట్టివియే యగు దంతములును గలిగినది కుబేరుని యంశము గలది. ఇది రాజభవనము మందుండదగినది. ధనరత్న సమృద్ధి గల్గించునట్టిది.

4. వరుణాంతకము : నల్లని వన్నెమేను, పేరిన నేతి కాంతిగల కొమ్ములు, చక్కని మూపు, చక్కని తలయు వెలయ గంభీరాకృతి గల హస్తి వరుణాంశకము. ఇది మేఘము గర్జించునట్లు ఘీంకరించును. ప్రచురముగా మదము వర్షించును. పగతురును చెండాడి యజమానికి జయము గూర్చును.

226