పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/268

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గజశాస్త్రము

సామలవలన పొడమినవగుటచేతనే గజములు సామజ వ్యవహారమును పొందినవి. తొలుత గజములు ఖేచరములై యుండినవి స్వర్గమున సుఖావాసము గావించు చుండిన అయ్యవి యేకారణముననో యొకముని కోపించి శపింపగా భూలోకమున పుట్టినవే భూచరములైనవట !

తొల్లి కృతయుగమున రాక్షసులు, దేవతలను బాధింప జొచ్చిరి. దానిచే ఈశ్వరునకు కోపము వచ్చెను. అందు వలన ముక్కంటి మోమున స్వేద ముద్భవించెను. ఆ స్వేదమునుండి యొక మహాగజ ముత్పన్నమయ్యెను. అదియే గణాధిపతి. వినోదకరమైన దానినిజూచి చతుర్దంతములు గల ఐరావతమును పరమేశ్వరుడు సృష్టించెను. దానిని జూచి జోడుగా శర్వాణి వినోదముచే భద్రయను ఒక హస్తినిని సృష్టించెను. ఆ గజదంపతులకు భద్రజాతి గజము లెన్నియో పుట్టినవి. అమరులు వాని సాయమున రాక్షసులను జయించిరి. త్రేతాయుగమున హతశేషులై యున్న రక్కసులు బ్రహ్మదేవుని సాయమును ప్రార్థించిరి. రక్కసులకు సాయము చేయవలసి వచ్చెనే యను మందమనస్సుతో ఆ చతుర్ముఖుడు మందజాతి గజములను సృష్టించి వారి కిచ్చెను.

గజవనములు : భారత దేశము గజములకు ప్రసిద్ధమైనది. గజములకు ఉత్పత్తిస్థానములైనవిగా ఎనిమిది వనములు పేర్కొనబడినవి.

1. ప్రాచ్యవనము : ఇది గంగానదినుండి హిమాద్రి వరకును, తూర్పున బ్రహ్మపుత్రమునకును, ఇటు ప్రయాగ వరకును వ్యాపించిన ప్రాంతము.

2. చేదికరూషకవనము (వేదిక రూపకము) : బ్రహ్మపుత్రానది, త్రిపురిప్రాంతము.

3. ఆంగరేయ వనము : గౌడ వంగ దేశస్థము.

4. కాళింగక వనము : వింధ్యాద్రి త్రికూటము, కళింగములను వ్యాపించి సముద్ర పర్యంతముగలది.

5. దాశార్ణక వనము : శ్రీశైల, దేవశైల సమయాద్రులను కలుపుకొని వ్యాపించినది.

6. అపరాంతక వనము : సహ్యపర్వతమునుండి భృగు కచ్ఛమువరకు నున్నది.

7. సౌరాష్ట్ర వనము : ద్వారవత్యవంతీ నగరముల మధ్యనున్న యడవి.

8. పంచనద వనము : హిమాలయావధిగా సింధునది ననుసరించి పశ్చిమ సముద్రమువరకును గలది.

వీనిలో కాళింగ, కారూషదశార్ణవనములు ఉత్తమములు. ప్రాచ్యాదులు మధ్యమములు. అపరాంత పంచానల (పంచనద) సౌరాష్ట్రములు అధమములు. కాళింగ వనము సర్వోత్తమ గజ స్థానముగ నిర్ణయింపబడినది.

కళింగ గజ లక్షణము : సూక్ష్మములయిన రోమములతో కూడిన, మెత్తని చర్మము, పిచ్చుకలవంటి కన్నులు గలవి. నిరంతరము మదస్రావముతో ఒప్పారునవి. దీనికి శౌర్యము, చురుకుదనము ఎక్కువ. మహాకాయము కలిగిన వీనితలయు, మెడయుకురుచగాను, బలసినదిగాను, ఉండును. తొండము నిడు పెక్కువ. తోక పొడవైనది. వెన్ను తిన్ననైనది. తేనెవన్నెదంతములతో, బిందుజాలకములతో ఈ కళింగ గజములు చూడముచ్చట గొలుపును. ఇవి పుట్టువుతో నేబలిష్ఠములగుటచే క్లేశసహనదక్షములై యుండును.

సౌరాష్ట్రగజ లక్షణము : విల్లువంగినట్లు వంగిన వీపును, పొట్టిదియగు మెడయు, ఎత్తైన తలయు, వక్షమును, రూక్షములైన చర్మము, కాళ్లు, గోళ్లు, చెవులును గలిగి నల్లనై యుండునవి సౌరాష్ట్ర వనోద్భూతములైన యేనుగులు. గోరోచనపు వన్నె కన్నులుగల యివి హీనసత్త్వములు. వీని మదస్రావము కూడ అత్యల్పము. ఉత్తమ గజములకు కళింగవనజాతము మచ్చుకాగా, అధమజాతికి సౌరాష్ట్ర వనోత్పన్నము ఉదాహరణ మగును. తక్కిన వనములలో బుట్టినవి మధ్యస్థితికి చెందునవి యని తేలును.

గజమానము : ఏడుమూరల యెత్తు, తొమ్మిదిమూరల నిడుపు, పదిమూరల వెడల్పు గల హస్తి సమప్రమాణ మైనది. అన్నింటను దీనికన్న ఒక మూరెడు ఎక్కువ ప్రమాణముగల గజమును అరాళ మందురు. అంతకన్న అధిక ప్రమాణము గలది అత్యరాళము. ఇది నింద్యమైన గజము. సమప్రమాణ గజముకంటె రెండు మూరలు తక్కువ ప్రమాణముగల దానిని కనిష్ఠగజమని వ్యవహరింతురు. కనిష్ఠహస్తికన్న తక్కువైనదానికి వామన మని పేరు. ఇదియు నింద్యగజమే.


గజ పరిమాణ వివరణ శ్లోకము.
'ముఖాదా పేచకం ధైర్ఘ్యం;
         పృష్ఠ పార్శ్వోద రాంత రాత్

225