పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/260

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గండికోట

500 మంది సైనికులు బారుగ నిలుచుండుటకు తగిన వసతి కలదు. కోటగోడకు తూర్పున గోడలోనికి చొచ్చుకొనియున్న ఆంజనేయుని ఆలయమొకటి కాననగును. ఆతనిని కోటకు కాపుగానుండు వీరహనుమంతు డందురు. అటనుండి తూర్పునకు దిరిగినచో కోటప్రధాన, ద్వారము కానబడును. అందలి చిత్రశిల్పము కొనియాడదగినది. ద్వారపు తలుపులు సుమారు పది మూరలకంటె ఎత్తుగ నున్నవి. ఒక్కొక్క వాకిలి వెడల్పు మూడు మూరలుండును. అందు ఎడమప్రక్క వాకిలికి చిన్న పాణి ద్వారమొకటి కలదు. అది మూసిన ఒక వ్యక్తియు బయటికి వచ్చుట గాని లోపలి కేగుటగాని సంభవింపదు. కోటవాకిలి మూయుటకు ఒక గడియ మ్రాను వెనుకభాగమున అమర్పబడియున్నది. వాకిండ్లు వేయుటకును గడియ లాగుటకును ఏనుగుల నుపయోగించెడివారట. దర్వాజామీద నొక అంతస్తును, ద్వారము ముందుభాగమున శత్రువులపై వేడినూనె పోయుటకు కొన్ని రంధ్రములును కలవు. ఆపై భాగమున అన్నిదిక్కులకు తుపాకులు కాల్చుటకు అనువగు రంధ్రములు అమర్పబడి యున్నవి. తలుపులు కొయ్యతో చేయబడిన వైనను అన్ని ప్రక్కలను ఇనుప రేకులు వేయబడియున్నవి. ముందు భాగమున శత్రువుల కభేద్యమగునటుల ఇనుప గుబ్బలు వాడిగ నాటబడియున్నవి. ఏనుగులు ఢీకొన్నను వాటి తలలు పగులవలసినదే కాని తలుపు లూడునట్టివిగా కనిపింపవు. ఈ నిర్మాణము దురూహ్యము, దుర్భేద్యము.

చిత్రము - 73

పటము - 8

తూర్పు దర్వాజాదగ్గఱ చార్మినార్.

217