పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/250

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

ఖమ్మముజిల్లా

ద్వారములును కలవు. దీనిని "బాలాహిస్సారు" అనెదరు. శిఖరాగ్రమునుండి చూచినచో చుట్టుప్రక్కలయందు గల ప్రదేశమంతయు వీక్షించనగును.

బాలాహిస్సారునందు చక్కగా నిర్మితమైన వేదిక యొకటికలదు. అచ్చట నాలుగు ఫిరంగులు పడియున్నవి. ఎంతో లోతుగల విశాలమయినబావి గలదు. ఈ బావికి ఒక వైపున రాతికుడ్యము కలదు. ఇచ్చటినుండి బావిలోని నీటిమట్టమునకు మెట్లు కలవు. వేదిక మీద నుండు ఫిరంగులపై ఒక శాసనము కలదు. ఆ శాసనమున "రఫీఖ్ నవాబు రుకునుద్దౌలా జఫరుద్దౌలా" అను లిఖితము కలదు. 1135 హిజ్రి ( క్రీ.శ. 1768) అని వ్రాయబడి యున్నది.

కోటలోని మశీదు, కోటప్రాకారకుడ్యములు జఫరుద్దౌలా నిర్మితములు. ఈ జఫరుద్దౌలా నిజాంఆలీఖాన్ నిజాం కాలములో అధికారము వహించి యుండెను. ఈ జఫరుద్దౌలా ప్రాకారకుడ్యములకు పిట్టగోడలు ఇటుకలతోను, సున్నముతోను కట్టబడినవి. ఇతడు కొన్ని తటాకములనుగూడ నిర్మించి యుండెను. ఈ తటాకములకు జఫరుద్దౌలా పేరే పెట్టబడినది. ఈతనికి "ధంసా" అను పేరు వీని క్రూరకృత్యములవలన లభించినది. ఈ ధంసా పేరిట ఖమ్మమునకు రెండు మూడు మైళ్ల దూరములో “ధంసలాపురము” అను గ్రామము ఇప్పటికిని గలదు. జఫరుద్దౌలాకు (ధంసాకు) నిర్మల, జగత్యాల. వేల్పు గొండలలో దుర్గము లుండెను.

చరిత్ర : ఖమ్మముజిల్లాకు ప్రధానపట్టణము ఖమ్మము నగరము. దీని మొట్టమొదటి పేరు కంబముమెట్టు. మెట్టు అనగా కొండ. కంబము సంబంధమయిన కొండ అని అర్థము. ఈ పట్టణమునకు ఈశాన్యభాగమున కొండమీద శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయము గలదు. ఇచ్చటనే శ్రీ నరసింహస్వామి కంబమునుండి వెడలివచ్చి హిరణ్యకశిపుని సంహరించినాడని స్థానిక గాథ. ఈ క్షేత్రమునకు భరద్వాజాశ్రమమని పేరు గలదు. 16వ శతాబ్దివాడగు హరిభట్టు అను కవిచంద్రుడు తన వరాహపురాణము నందు


వరుణదిగ్వీథి నే పురమునఁ బ్రవహించెఁ
         బావన సలిల సంపన్న మిన్న
దీపించె నేపురి గోపికామానసా
         స్పదవర్తి చెన్నగోపాలమూర్తి
భాసిల్లె నే వీట ప్రహ్లాదభక్తి వి
         శ్రాణి కొండ నృసింహశార్జపాణి
ఏ పట్టణంబున జూపట్టె హితపద్మ
         హేళి వీరేశ బాలేందుమౌళి

చతుర చతురంగ బలరత్న సౌధ యూధ
శాల గోపురతోరణ సకలవర్ణ
పౌర వారాంగనా జనప్రముఖ వస్తు
మేదురంబట్టి కంబము మెట్టుపురము .

అని వర్ణించినాడు. అంతేకాదు.

ఆంధ్రమండల గిరి దుర్గహారలతకు
విమలనాయక రత్న భావము భజించి
యున్నతోన్నత శైల సంపన్న మగుచు
సకలపుట భేదనముల నెన్నికకు నెక్కె.

అని కూడ కంబము మెట్టు పురమును వర్ణించియున్నాడు. కంబము మెట్టు పదమునకే సంస్కృతీకరణము చేసి, స్తంభాద్రి, స్తంభగిరి అని వాడినారు. కంబము మెట్టునకు అపభ్రంశ రూపమే ఖమ్మముమెట్టు ; సంగ్రహ రూపము ఖమ్మము. ఖమ్మము పట్టణ జనసంఖ్య 1951 లెక్కల ప్రకారము 28,251 ఇందు పురుషుల సంఖ్య 14,543, స్త్రీల సంఖ్య 13,708. ప్రస్తుత మీ పట్టణము విరివిగా నభివృద్ధిచెంది సకల వైభవములతో తనరారుచున్నది. ఇప్పుడు (1961) జనాభా సుమారు 35,000 లు ఉండ వచ్చును. ఖమ్మము అభివృద్ధి దశలో నున్న మ్యునిసిపాలిటీ పట్టణము.

కంబము మెట్టు అత్యంత ప్రాచీనమైనది. క్రీ. శ. 591 పూర్వము ఈ ప్రాంతము హిందూ రాజుల యధికారములో నుండెను. అప్పుడు మహదేవశర్మ అనునాతడు కంబము మెట్టుప్రాంతమునకు అధికారిగా నుండుచుండెను. మహదేవశర్మకు తొమ్మిదవ తరమువాడు మహదేవరాజు (క్రీ. శ. 950). ఈ మహదేవరాజు పరిపాలన కాలములో ఓరుగల్లు నుండి రంగారెడ్డి, లక్మారెడ్డి, వెల్మారెడ్డి అను సోదరులు తమకు దొరకిన గొప్ప గుప్తధనముతో వచ్చి కంబముమెట్టును ఆక్రమించిరి. వీరు ఒక దుర్గమును, ఒక తటాకమును నిర్మించినారట! ఈ దుర్గ నిర్మాణము

207