పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/242

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

ఖనిజసంపద (ప్రపంచమున, భారతదేశమున)

కును. ఈ వజ్రములు ఎక్కడనుండి ఆ ప్రాంతమునకు కొట్టుకొని వచ్చినదియు ఇంతవరకు కనుగొనబడలేదు. దక్షిణాఫ్రికా దేశమున 1867 నుండి వజ్రములు తీయబడుచున్నవి. ఇచ్చట భూమిలోని వందలకొలది గొట్టముల నుండి గనులుగాత్రవ్వి తీయబడుచుండుట గమనార్హము. అందులో కింబర్లీ ప్రాంతమునందలి గనులు ప్రశస్తములు. ఆ దేశపు ఉత్పత్తి ప్రపంచపు ఉత్పత్తిలో 12 శాతము. గోల్డ్ కోస్టు దేశమునుండి 3-31/2 లక్షల వన్నెల వజ్రములు ఉత్పత్తియగు చున్నవి. అచ్చట బిర్రిమ్‌నదీ ప్రాంతము వీటి మనుగడకు ముఖ్యమైనది. తరువాత వీటి ఉత్పత్తికి పేర్కొనదగిన దేశములు : టాంగనీకా, బ్రెజిల్, బ్రిటిష్‌గయానా, రష్యా, బోర్నియో, వెనీజులా, దక్షిణరొడీషియా, అమెరికా దేశములలో కూడ ఇవి స్వల్పముగా దొరకును, భారతదేశము 18 వ శతాబ్దము వరకును వజ్రములకు పుట్టినిల్లుగా భావింపబడెడిది. ప్రప్రథమమున వజ్రములు ఉత్పత్తి అయినది భారతదేశముననే. ఆ రోజులలో ఈ దేశమున సం. నకు ఎన్నో లక్షల వన్నెల వజ్రములు ఉత్పత్తి అయ్యెడివి. కాని ఇప్పుడు 2 వేల వన్నెలు మాత్రము ఉత్పత్తి యగుచున్నవి. కోహినూరు మొదలగు పెద్ద పెద్ద ప్రపంచఖ్యాతి గాంచిన వజ్రములకు ఈ దేశము పుట్టినిల్లు - దక్షిణదేశమందలి అనంతపురం, బళ్ళారి, కర్నూలు, కృష్ణా, గోదావరి జిల్లాలును, ఉత్తర దేశమందలి పన్నా ప్రాంతము, మహానందిలోయ, సంబల్ పూరు, చాందా జిల్లాలయందు వీటిఉత్పత్తి అధికముగా జరుగుచుండెడిదని 17 వ శతాబ్దిలో వ్రాయబడిన గ్రంథములనుండి తెలియుచున్నది. కాని ప్రస్తుతపు ఉత్పత్తిలో చాలభాగము పన్నా ప్రాంతపు గనులనుండియే వచ్చుచున్నది.

బంగారము : ఈ లోహము ప్రాచీనకాలమునుండియు మానవోపయోగమున నున్నది. దీని ప్రధాన ఉపయోగములు ఆభరణములు, ద్రవ్యమారకము. ఇది మానవునకు ముఖ్యావసరము కానేకాదు. దీని లేమి మానవున కెవ్విధముగను నష్టదాయకముకాదు. కాని ఇది భూమియందు చాల స్వల్పముగా లభించుటచే, దీనికి ఎక్కువ విలువ వచ్చినది. ఈ కారణముచే ఇది అనేక మానవ సంక్షోభములకు కారణభూతమైనది. ఈ ఖనిజముయొక్క ప్రపంచపు సగటు ఉత్పత్తి 3 కోట్ల ఔన్సులు. దీనిని ప్రప్రథమముగ కన్గొనినది మొదలు ఇప్పటివరకు దాదాపు 50,000 టన్నుల బంగారము భూమినుండి వెలికి తీయబడినది.

ఉత్తర అమెరికా ఖండమందలి కెనడా దేశము, కాలిఫోర్నియా, అలాస్కా ప్రాంతములు, రాకీ పర్వత ప్రాంతము, ఆరిజోన– నెవాడ. మెక్సికో ప్రాంతములందు ఈ ఖనిజము లభ్యమగును. కెనడాలో 13 శాతము, అమెరికాలో 15 శాతము, దక్షిణ అమెరికాలో 4 శాతము ఈ ఖనిజము ఉత్పత్తి యగుచున్నది. దక్షిణాఫ్రికా దేశమునుండి ప్రపంచ ఉత్పత్తిలో 35 శాతము తీయబడుచున్నది. ఇచ్చట 'విట్ వాటర్ షాండ్' ప్రాంతము ఈ లోహమునకు ముఖ్యమైనది. రష్యాదేశమున ప్రపంచ సంపదలో 13 శాతము కలదు. ఇచ్చట బంగారము ఇసుక పర్రలలోని చిన్న అణువులయందు కేంద్రీకృతమైయున్నది. దీనికి యూరల్ , యెనిసై నది, యాకుత్ ప్రాంతములు ముఖ్యములు. ఆ దేశములోని ఒక్క ట్రాన్స్‌బై కాల్ ప్రాంతమున మాత్రము బంగారము గనుల నుండి తీయబడుచున్నది. ఆస్ట్రేలియా, న్యూజిలెండ్ దేశములనుండి 5 శాతము, జపాను ప్రాంతము నుండి 4 శాతము ఉత్పత్తి జరుగుచున్నది. పశ్చిమాఫ్రికా, కాంగో, రొడీషియా, ఇండియా మున్నగు దేశములలో కూడ ఈ ఖనిజము స్వల్పముగ లభ్యమగుచున్నది.

భారతదేశమునుండి ప్రపంచ ఉత్పత్తిలో 0.7 శాతము మాత్రమే వచ్చుచున్నది. ఇందులో చాల భాగము మైసూరు రాష్ట్రములోని కోలారు గనుల నుండియే వచ్చుచున్నది. ఇచ్చట ప్రాచీనులు ప్రప్రథమముగా బంగారము తీసిన సూచనలు కన్పట్టుటచే, ఆనాటి నుండియే గని త్రవ్వకముప్రారంభమైనట్లు తెలియుచున్నది. అది ఇప్పుడు ప్రపంచములోని అత్యుత్తమగనులలో నొకటిగ పరిగణింప బడుచున్నది. అచ్చట మొత్తము అయిదు గనులు కలవు. బంగారము దొరకు భాగము 4 అ. మందము కలిగి, భూగర్భమున 4 మైళ్లు వరకును లభ్యమగును. ఇప్పటివరకు ఈ గని 10,000 అ. పైగా త్రవ్వబడినది దీని తర్వాత రాయచూరు ప్రాంతమందలి 'హట్టి' గనులనుండి బంగారము తీయబడుచున్నది. మైసూరురాష్ట్ర మందలి ధార్వారుజిల్లాలోను, అనంతపురములోకూడ ఈ ఖనిజము

199