పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/241

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఖనిజసంపద ( ప్రపంచమున, భారతదేశమున)

సంగ్రహ ఆంధ్ర

ఈ ఖనిజమునకు ప్రధానములు. సిలోన్ దేశమందలి ఖనిజము చాల నాణ్యమైనది. ఇచ్చట ఈ ఖనిజము 9 అం. వెడల్పున రేకులుగను, తీగలుగను దొరకును. ఇది 1600 అం. లోతువరకు త్రవ్వి తీయబడుచున్నది. ఇటలీ, అమెరికా, చెకొస్లోవేకియా, నార్వే దేశములందు ఈ ఖనిజము స్వల్పముగా దొరకును. భారతదేశమందు తిరువాన్కూరు నందలి గ్రాఫైటు సిలోను ఖనిజమును పోలియున్నది. అచ్చట ఇది చాల తక్కువగ దొరకుటచే ఎక్కువ లోతుల నుండి తీయుట ఏమియు లాభకరముగా లేదు. ఒరిస్సా, బీహారు రాష్ట్రములందలి భోండలైట్స్ అను రాళ్ళలో ఈ ఖనిజము అన్ని చోట్ల కన్పించును. కాని వీటియందీ ఖనిజము విస్తృతముగ కేంద్రీకరింపబడి యుండకపోవుటచే ఇవి అంతగా ప్రాముఖ్యత నొందలేదు.

అభ్రకము : ఈ ఖనిజము అతి సన్ననిపొరలుగా (1/1000 అం. వరకు) విడదీయుటకు వీలై యుండును. ఇది విద్యుచ్ఛక్తి నిరోధకారియగుటచే, వివిధములైన విద్యుచ్ఛక్తి పరిశ్రమలకు (రాడారు. రేడియో మొ.) అత్యావశ్యకమైనది. ఇది ఎంత ఎక్కువ వెడల్పుగా దొరకిన అంత శ్రేష్ఠము. 1 చ. అం. మొదలు 70 చ. అం. వరకును విస్తీర్ణము గల అభ్రకపుపలకలు ప్రపంచ వ్యాపారమందు చెలామణిలో నున్నవి. ప్రపంచము మొత్తమున ఈ ఖనిజము సం. నకు 50 నుండి 65 వేల టన్నులవరకు వినియోగింపబడుచున్నది. ప్రపంచములో ఈ ఖనిజసంపదకు భారతదేశము అగ్రస్థానము. బీహారు రాష్ట్రములోని మాన్ ఘీర్, హజారిబాగ్, గయ జిల్లాలును, ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరుజిల్లా ఈ ఖనిజోత్పత్తియందు అత్యుత్తమమైనవి. బీహారురాష్ట్రమందు ఇది లభించుప్రాంతము 70 మై. పొడవు, 12 మైళ్ళ వెడల్పు కలిగియున్నది. నెల్లూరుజిల్లాలోని వెలిగొండ కొండలు మొదలు సముద్రతీరమువరకును గల గూడూరు, రాపూరు, ఆత్మకూరు, కావలి ప్రాంతములలో ఇది విస్తారముగ లభించును. అందులో గూడూరు ప్రాంతపు గనులు (ముఖ్యముగా 'షా' గని) ప్రపంచఖ్యాతిగలవి. ఇంకను ఈ దేశమున మద్రాసురాష్ట్రములోని సేలంజిల్లా యందును, తిరువాన్కూరు, మలబారు, అజ్మీర్ - మేవార్ ప్రాంతములందును ఈ ఖనిజము స్వల్పముగ లభించును. తరువాత ఈ ఖనిజ సంపదకు పేర్కొనదగు దేశములు: రష్యా, కెనడా, బ్రెజిల్, అమెరికా, దక్షిణాఫ్రికా, కొరియా, సిలోన్ మున్నగు దేశములలో గూడ ఈ ఖనిజము స్వల్పముగ దొరకును.

వజ్రములు : ఆభరణములకును, వివిధ అలంకరణములకును ఉపకరించు ఖనిజములకు 'జెమ్‌స్టోన్స్ ' లేక 'ప్రెషస్‌స్టోన్స్' అందురు. వీటి నాణ్యము, ముఖ్యముగా ఆకర్షణీయత, నైర్మల్యము, మన్నిక, అరుదుగ లభించుట అనునాల్గులక్షణములపై ఆధారపడియుండును. ఇవి వివిధ వర్ణములు కలిగి, వేర్వేరు రాసాయనిక పదార్థసంయోగ ములతో కూడియుండును. 9000 సం. ల క్రితమే 15 రకముల రాళ్లు గుర్తింపబడియున్నవి. ప్రస్తుతము దాదాపు 100 రకములరాళ్లు వాడుకలో నున్నవి. పైన పేర్కొనిన నాల్గు లక్షణములు కలిగియున్న వానిని వివిధ నిర్ణీత కోణములలో కోసినయెడల వాటి అందము విశిష్టముగ రాణించును. ఈ సంబంధమైన విలువగల రాళ్ళలోకెల్ల వజ్రములు అత్యుత్తమమైనవి. ఇవి అందముగను, ఆకర్షణీయముగను ఉండుటయేగాక, ప్రపంచములోని పదార్థములలోకెల్ల దార్డ్యము గల్గినది. వజ్రమును వజ్రముతప్ప మరే ఇతరపదార్థమును కోయలేదు. కాని వజ్రము ప్రపంచములోని అన్ని పదార్థములను కోయగల్గి యుండును. ఇదియే దీని విశిష్టత, అత్యుత్తమ భౌతిక లక్షణము. ఇది వివిధ ప్రకాశవంతమగు కాంతులను, దాని వివిధముఖములనుండి వెదజిమ్ము చుండును. ఇందు వల్లను, అది చాల అరుదుగను, కొలదిగను దొరకుట వల్లను, అది అత్యధిక విలువ కలిగి యున్నది. ఇది ప్రపంచము మొత్తమున సంవత్సరమునకు 10 లేక 15 మిలియను వన్నెలు (carats) లేక 21/2 టన్నులు ఉత్పత్తి యగుచున్నది. దీని మొత్తమువిలువ దాదాపు 20 నుండి 40 కోట్ల రూపాయల వరకు ఉండును. దీని ఉత్పత్తికి బెల్జియన్‌ కాంగో చాలముఖ్యమైనది. అచ్చట 'కసాయ్' నదీలోయలో (Kasai River Basin) దాదాపు 15,000 చ. మైళ్ళ మేర ఈ ఖనిజము వ్యాపించి యున్నది. ప్రపంచోత్పత్తిలో ఇచ్చట 65 శాతము లభించుచున్నది. ఆ నదీప్రాంతమందును, దాని ఉపశాఖల ప్రాంతమందును ఇసుక పర్రలలో ఇది ఎక్కువగా దొర

198