పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/238

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

ఖనిజసంపద (ప్రపంచమున, భారతదేశమున)

ఈ దేశమందు ప్రపంచ సంపదలో 5 శాతము మాత్రమే కలదు. దక్షిణఅమెరికాలో ఎండెస్ పర్వతశ్రేణి యందు (చిలీదేశము నుండి పెరూదేశము వరకు గల ప్రాంతము) ప్రపంచ సంపదలో 40 శాతము పైగా రాగి ఖనిజము భూగర్భితమైయున్నది. ప్రపంచమొత్తపు అవసరములలో 20 శాతము పై గా ఈప్రదేశము నుండి తీయబడుచున్నది. ఆఫ్రికా ఖండములో రొడీసియా దేశమందు ఈ ఖనిజము విస్తారముగా (ప్రపంచ సంపదలో 30 వ శాతము) దొరకును. రష్యాదేశ మందు 7 శాతమును, మెక్సికో యందు 3 శాతమును కలదు. తక్కిన దేశములలో ఈఖనిజము చెప్పదగినంతగా లభించదు.

సీసము (Lead); తుత్తునాగము (Zinc): ఈ రెండు లోహములకును రాసాయనికముగ ఎట్టి సంబంధములేదు. అయినను ఇవి సర్వ సాధారణముగ ఒకే స్థలమునందు దొరకును. వేర్వేరుగా దొరకుట చాల అరుదు. సీసము చాల పురాతన కాలమునుండి మానవోపయోగమం దున్నది. చైనాదేశీయులు దీనిని క్రీ. పూ. 2000 సం. నందే నాణెములు తయారుచేయుట కుపయోగించిరి. ప్రపంచము మొత్తములో ఈ ఖనిజములు ఒక్కొక్కటి సం కు 1.6 నుండి 2 మిలియను టన్నుల వరకు తీయబడుచున్నవి. కాని సీసము కనుగొనబడిన తరువాత 1500 సం.కు కాని తుత్తునాగము కనుగొనబడలేదు. ఇది పెక్కు దేశములందున్నను, సమృద్ధిగా దొరకు దేశములు కొలది మాత్రమే. అందు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, రష్యా, బెల్జియం, మెక్సికో దేశములు ముఖ్యములు. ప్రపంచములోని 27 శాతము సీసము, 47 శాతము తుత్తునాగము అమెరికా నుండి వచ్చుచున్నది. ఈ దేశములోని మిస్సోరి, ఓక్లహామ, కాన్సాస్ రాష్ట్రములలోని మిస్సిస్సిపి నదీలోయ ప్రాంతము ఈ లోహములకు ప్రశస్తమైనది ; మెక్సికోదేశ మధ్యప్రాంత మందును ఇవి విస్తారముగ దొరకును. మొత్తము ప్రపంచ సంపదలో సగము పైగా ఉత్తర అమెరికా ఖండమందే గలవు.

దక్షిణ అమెరికా ఖండములోని పెరూ, అర్జెంటినా, బొలివియా దేశములలోను, యూరపు ఖండములోని (ప్రపంచ సంపదలో 15 వ శాతము) స్పెయిన్, రుమేనియా, టర్కీ, జర్మనీ, పోలెండ్ మొదలగు దేశములలో ఈ ఖనిజము కొంతవరకు లభ్యమగును. ఆస్ట్రేలియా ఖండమున ఈఖనిజములు విస్తారముగా దొరకును. ముఖ్యముగా సీసము ఇక్కడ ప్రపంచ సంపదలో 13 వ శాతము కలదు. రష్యాదేశమందలి యూరల్ పర్వతప్రాంతమున ఈ ఖనిజములు ప్రపంచ సంపదలో సగటున 71/2 శాతము దొరకును. తరువాత ఈ ఖనిజములకు పేర్కొనదగినవి బర్మాదేశములోని బాడ్విన్ గనులు. ఇచ్చట మొత్తము 4 మిలియను టన్నుల ఖనిజము దొరకు గని కలదని అంచనా. అందులో సీసము 25 శాతము ; తుత్తునాగము 15 శాతము ; రాగి 0.7 శాతము ; వెండి 20 శాతము గలవు.

కాకి బంగారము (Tin) : ఇది ఇత్తడి, కంచు మొదలగు పరిశ్రమ లోహములను తయారుచేయుటకు, దీని ఉనికి తెలిసియో, తెలియకో, క్రీ. పూ. 3700 సం. నుండి ఈజిప్టు దేశములో ఉపయోగింపబడుచున్నది. ప్రపంచములో మొత్తముమీద ఇది సంవత్సరమునకు 11/2 నుండి 21/2 లక్షల టన్నులవరకు ఉత్పత్తి యగుచున్నది. ఇందులో 40 శాతము అమెరికా దేశమందే వినియుక్తమగుచున్నది. బ్రిటన్ 13 శాతము, రష్యా 12 శాతము ఉపయోగించుచున్నవి. మలే రాష్ట్రములు దీని ఉత్పత్తియందు అగ్రస్థానము వహించి యున్నవి (30 శాతము). ఇందు ఎక్కువ భాగము కిన్‌టా (Kinta) లోయ ప్రాంతమునందు దొరకును. ఇచ్చట ఈ లోహము పెద్ద రాళ్ళలో భాగముగా గాక, వాటినుండి తయారైన మట్టియందు కేంద్రీకరింప బడి యున్నది. ఈ రాష్ట్రములకు దక్షిణమునగల నెదర్లాండ్సునందు ఈ ఖనిజము ఇదే విధముగా దొరకును. (ప్రపంచ సంపదలో 24 శాతము). తర్వాత ఈ ఖనిజమునకు బొలీవియా దేశము ప్రసిద్ధమైనది. అచ్చట మొత్తము 10 కేంద్రములలో ఇది విస్తారముగ దొరుకును. అందు నల్లాల్ల గువ-ఉన్సియ గ్రూపునందు 60 శాతము లభించును. ఆ దేశమున ప్రపంచ సంపదలో 23 శాతము దొరకుచున్నది. చైనా దేశమున యూనన్ ప్రాంతములో ఈ ఖనిజము 3000 అ. లోతునుండి తీయబడుచున్నది. తర్వాత ఈ ఖనిజమునకు నైగీరియా, బెల్జియన్ కాంగో, సయాములు చెప్పుకొనదగినవి. ఇంగ్లండులోని కార్న్‌వాల్ లో క్రీ. పూ. 500 సం. వరకు 33 లక్షల టన్నులు తీయబడినది. కాని ఇప్పుడచట ఏమియు దొరకుటలేదు.

195