పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/235

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఖనిజసంపద (ప్రపంచమున, భారతదేశమున)

సంగ్రహ ఆంధ్ర

కిలోవాట్లు ఉత్పత్తి కావలెను. కాని ప్రాజెక్టులనుండి 30 మిలియను కిలోవాట్లకంటె ఎక్కువ తీయుటకు వీలుపడదని అంచనా. కావున కనీసము 10 మిలియను కిలోవాట్ల కంటె ఎక్కువగా అణుశక్తినుండి ఉత్పత్తి చేయవలెనని పథకములను రూపొందించిరి. ఈ రీతిగా విద్యుచ్ఛక్తిని తయారుచేయుటకు కావలసినవి ఖనిజములే. అవి 1. యురేనియం, 2. థోరియం. యురేనియం సంపద యందు ఈ దేశము వెనుకబడియున్నది (30,000 టన్నులు మాత్రమే గలదు). అయినను థోరియం మాత్రము సమృద్ధిగా గలదు. ఒక్క బీహారు రాష్ట్రమందే ఈ ఖనిజము 3 లక్షల టన్నులు కలదని కన్గొనబడినది. ఈ ఖనిజ సంపద సమృద్ధిగా నుండుటచే ఈ దేశమున అణువిచ్ఛేదనము నుండి విద్యుచ్ఛక్తి ఇతరపద్ధతులకంటె చవుకగా ఉత్పత్తిచేయుటకు వీలగునని భావింపబడుచున్నది.

ఇనుము, మాంగనీసు కాక మిగిలిన లోహముల విషయములో భారతదేశమున స్వయంసమృద్ధిలేదని చెప్పవచ్చును. తుత్తునాగ ఖనిజము ఉదయపూరులోని జావర్ గనులనుండి లభించును. దీనినుండి లోహమును వేరుచేయుటకై దీనిని జపానుకు పంపుచుండెడివారు. కాని ఇప్పుడు ఆపనిని ఇక్క డే చేయుటకు ఇటీవల పునాది వేయబడినది. ఇది సాలుకు 15000 టన్నుల లోహమును తీయగలదు. సీసమును వేరుచేయు కర్మాగారము బీహారులోని 'టున్ డూ' లో కలదు. దీనిశ క్తి 8500 టన్నులకు ఇటీవలనే పెంచబడినది. ఈ రెండింటికంటె ముఖ్యమగు రాగి ఈ దేశమున కావలసిన దానికంటె చాల తక్కువ లభ్యమగు చున్నది. 'ఘట్ శిల' యందలి కర్మాగారమునకు సాలుకు 85000 టన్నుల రాగిని వేరుపరచుటకు అనుమతి ఈయబడినది. భారత ప్రభుత్వముయొక్క వివిధ భూగర్భశాస్త్ర శాఖలు, ముఖ్యముగ జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యూరో ఆఫ్ మినరల్స్, ఈ ఖనిజములందు క్రొత్త ప్రదేశములను కన్గొనుటకు విస్తారముగ కృషిచేయుచున్నవి. రాజస్థాన్‌యందలి డారిబో (Daribo), ఖేత్రి (Khetri), ఆంధ్రప్రదేశ్‌ లోని 'గని' లేక గరిమెనపెంట ప్రాంతములనుండి రాగి లాభదాయకముగ తీయనగునని కన్గొనబడినది. పని ప్రారంభించుటకు ప్రయత్నములు విరివిగా సాగుచున్నవి. సిక్కింలోని భోటాంగ్ గనులందు ఈ మూడు లోహములు దొరకునని కన్గొనబడినది. 1966 లో భారతదేశమునకు సీసము 65,000 టన్నులు, తుత్తునాగము 1,87,500 టన్నులు, రాగి 1,70,000 టన్నులు అవసరమగునని అంచనా వేయబడినది. అల్యూమినియం ఖనిజము (బాక్సైట్) ఇచ్చట విస్తారముగా కలదు. కాని ఈ లోహమును వేరుచేయు కర్మాగారములను ఈమధ్యనే విరివిగా స్థాపింప మొదలిడిరి. ఈ లోహము, 25 శాతము రాగి, 15 శాతము సీసమునకు బదులుగా వినియోగింప వీలగుటచే, ఈ కర్మాగారముల ఆవశ్యకత ఇనుమడించినది. మూడవ ప్రణాళికాంతమునకు సీసము 43,000 టన్నులు, రాగి 1,00,000 టన్నులు దిగుమతి చేసికొనవలసి వచ్చునని అంచనా వేయబడినది.

వివిధ క ర్మాగారములందు అత్యావశ్యకముగ వినియోగింపబడు గంధకికామ్లజనిదము (sulphuric acid) తయారునకు కావలసిన గంధకము ఈ దేశమందు దాదాపు శూన్యము. ఇదియంతయు విదేశములనుండి దిగుమతి చేసికొనబడుచున్నది ఈమధ్య బీహారురాష్ట్రములోని ఆజ్‌మార్ (Ajmor) ప్రాంతములోని 'పై రైటు' (ఇనుము, గంధకము కలిసియున్న ఖనిజము) నుండి గంధకమును తీయుటకు నిశ్చయింపబడినది. ఇది చాల కొలదిగ మాత్రమే లభించును.

ఉక్కు మొ. కర్మాగారములందు అత్యావశ్యకమగు పదార్థములు ఉష్ణనిరోధక పదార్థములు. ఇవి కెయెలిన్, సిలిమనైట్, బాక్సైట్, మేగ్నసైట్, క్రోమైట్, గ్రాఫైట్ లు. చివరి మూడును ముఖ్యముగ ఉక్కు కర్మాగారములందు ఉపయోగపడును. పరిశ్రమలందీ ఖనిజములు లోహములను కరగించు కుండీలుగను, ఉష్ణమును పరిమితముగ అందించుటకు వీలగు సాధనములుగను ఉపయోగింప బడుచున్నవి. భారతదేశమందు ఇవి సమృద్ధిగా నున్నను, ఉక్కుకర్మాగారము లొక్కసారిగ స్థాపింపబడుటవలన, అనేకకోట్లు వెచ్చించి పై లోహములు విదేశములనుండి దిగుమతి చేసికొనబడుచున్నవి. ఈ సంబంధ ఖనిజములందు ఈ దేశమునకు ఉక్కు ఉత్పత్తి 10 మిలియను టన్నులు దాటినను ఏమాత్రమును కొరతఉండబోదు. ఇవి వివిధ ప్రాంతములందు వేర్వేరుగ, కొలదికొలదిగ దొరకును.

192