పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/233

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఖనిజసంపద (ప్రపంచమున, భారతదేశమున)

సంగ్రహ ఆంధ్ర

గాని, వానిని భూగర్భమందు పెంపొందించుట, తయారుచేయుట తెలియదు; తెలియు అవకాశము కూడ శూన్యము. కావుననే వీనిని "తరుగుసంపద" (wasting assets) అందురు. ఇవి పూర్తిగా తరిగిపోయినచో, మానవుడు అత్యుత్తమ జీవితావసరవస్తువును కోల్పోయె ననియే చెప్పవచ్చును అందుచే ఇప్పుడు శాస్త్రజ్ఞుల కృషి యంతయు మూడు అంశములపై కేంద్రీకరింపబడి యున్నది. (1) ఖనిజములు దొరకు క్రొత్త ప్రదేశములను కనుగొనుట; (2) వాటిని సులభసాధనముల ద్వారా ఎక్కువ లోతునుండి వెలికితీయుట; (3) వెలికితీసిన వాటితో ఏ మాత్రమును వృథాకాకుండుటకై ప్రయత్నించుట; ఉన్న వానిని పొదుపుగా వాడుకొనుటగూడ దీనికి సంబంధించిన విధానమే. ఈ విషయములపై నిర్విరామముగా కృషి సాగుచునేయున్నది. క్రొత్తక్రొత్త ప్రత్యేక శాస్త్రములు ఉద్భవించుచున్నవి. ప్రధానశాఖల కెన్నో ఉపశాఖలు బయలుదేరుచున్నవి. వీటిని గూర్చి కొంతవరకు తెలిసికొనవలెనన్నచో, ఆర్థిక భూగర్భశాస్త్ర మందు (Economic Geology) నాలుగు ముఖ్య శాఖలుకలవని గమనింపవలెను. (1) ఖనిజములు భూగర్భమం దేర్పడు విధానము; ఏర్పడుట కనువైన ప్రదేశముల గూర్చి తెలిసికొను శాస్త్రము (genesis and occurence of ore-deposits) 2. అది దొరకుటకు అనువైన ప్రదేశములను గుర్తించుట కుపకరించు భూగర్భ భూ(గర్భ) భౌతిక శాస్త్రములు (Geological and geophysical prospecting), 3 ఖనిజములను ఎక్కువ లోతులనుండి సులభముగను, చవుకగను వెలికి తీయుట కుపకరించు శాస్త్రము (Mining), 4. వెలికితీసిన ఖనిజములలో అవసరమగు ఆర్థిక ఖనిజములను ఇతర పదార్థములనుండి కేంద్రీకరించి వేరు పరచు శాస్త్రము (Mineral dressing and Metallurgy).

ఈ వివిధ శాఖ లందలి శాస్త్రజ్ఞానాభివృద్ధిపై ఖనిజములు మానవునకు ఎంత ఎక్కువగా ఉపయోగపడునో, ఎట్లు వృధాకాకుండునో, ఖనిజసంపద పూర్తిగా ఎట్లు క్షీణింపకుండునో మున్నగు అంశములు ఆధారపడి యున్నవి. నవీన పారిశ్రామిక యుగమందు మానవజాతి ఖనిజసంపదపై పూర్తిగా ఆధారపడి యున్నది. గృహ నిర్మాణము, గృహోపయోగ సామగ్రి, విద్యుచ్ఛక్తి. బొగ్గు, మనము నడచు వీథులు, ప్రయాణమున కుపకరించు వాహనములు (బస్సులు, రైళ్ళు, ఓడలు, విమానములు మొ.) యుద్ధమునం దవసరమగు సామగ్రి, అన్నిరకముల యంత్రములు మున్నగునవి తయారగుటకు ఖనిజసంపదయే మూలము. పరిశ్రమల కత్యవసరమగు ఇనుము, బొగ్గు వంటి ఖనిజముల సమృద్ధియే దేశము యొక్క పారిశ్రామికాభివృద్ధిని నిర్ణయించును. పరిశ్రమల కత్యవసరమగు ఖనిజములును, విలాసజీవితమున కవసరమగు వజ్రములు మున్నగునవియు, శాంతి సమయమున కవసరమగు మరికొన్ని ఖనిజములును, యుద్ధావసరములగు ఇతర ఖనిజములును వాటిసంఖ్య కంటె ఎన్నో రెట్లు అధికముగా ప్రాముఖ్యమును సంపాదించుకొని యున్నవి.

భారతదేశమున అత్యధిక సంపద గలిగి, ఎగుమతుల ద్వారా ధనమార్జించుటకు వీలైన ఖనిజములు ముఖ్యముగా మూడు, అవి 1. ఇనుము, 2. మాంగనీసు, 3. అభ్రకము. మన దేశము పారిశ్రామికముగ ఉన్నతస్థితియందు లేకుండుటచే, కొన్ని ఖనిజములు, అనేకములైన ఇతర వస్తువులు పరదేశములనుండి దిగుమతి చేసికొనవలసివచ్చు చున్నది. ఈ దిగుమతుల ఖరీదు ఎగుమతులకంటె చాల ఎక్కువగా నున్నదని ఈ క్రింది పట్టికనుబట్టి గమనింప వచ్చును.

దిగుమతులు (కోట్ల రూ.) ఎగుమతులు (కోట్ల రూ.) భేదము
1951 - 1952 971.20 732.96 -238.24
1958 - 1959 856.18 580.30 -275.88

కనుక ఈ లోటును పూడ్చుటకై ఈ దేశమును అన్ని వస్తువులందు స్వయంసమృద్ద మొందించుకొనుట, ఎగుమతులను వృద్ధిచేయుట చాల అవసరము. ఈ దేశము ఎగుమతులద్వారా ధనమార్జించుటకు ఖనిజములు ముఖ్య సాధనములు. ఖనిజములలో ఒక్క లోహసంబంధమైన ఎగుమతులద్వారా 1959వ సంవత్సరమందు ఆర్జించిన ధనములో ఎంతవృద్ధి కన్పట్టుచున్నదో ఈ క్రింద గమనింప నగును.

190