పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/227

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఖనిజముల రంగులు

సంగ్రహ ఆంధ్ర

మయిన ఇత్తడి పీతవర్ణము (deep brass yellow Colour); ఛాల్ కోసైటు (Chal Cocite = Cu2S నల్లగనుండి మందమయిన కాంతి గలిగియున్నది; కోవెలెట్ (Covellite = Cu S) సాధారణముగా ఇతర తామ్ర ఖనిజములపై నున్నని నెమలిపింఛపు రంగుగల పూతగా నేర్పడును. బోర్నైట్ (Bornite=Cu5 Fe S4) ధూమ్రవర్ణము, కొంచెము నీలము, ఎరుపు వన్నెగలిగి యుండును. కావుననే దీనిని "బహువర్ణ తామ్రఖనిజము" (Variegated Copper ore) అని అందురు. దీనిలో క్రొత్తగా పగులువారిన ఉపరిభాగము ఇత్తడి రంగును లేక గోధుమ వన్నెయు గలిగి యుండును.

తామ్ర ఆమ్లజనిదములు (oxides) కాంతిమంతము లైన వర్ణములు గలవిగా నుండును. రూబీ కాపరు (Ruby Copper) అను మారు పేరుగల క్యూప్రయిటు (Cuprite) విశిష్టమయిన ఎరుపు రంగు, ఉపలోహకాంతి (Sub-metallic Lustre) లేక వజ్రపు మెరుపు గలిగి యున్నది. దీనికి కారణము దానియొక్క మిక్కిలి హెచ్చయిన వక్రీభవన గణక మే (2.85). ఆకుపచ్చరంగు గల్గిన మాలకైట్ (Malachite), మబ్బురంగు గల్గిన అజురైట్ (Azurite) అను రెండును రాగియొక్క క్షార కర్బనిదములు (Basic Carbonates of copper). ఈ రెండు రంగులకును గల తేడాకు కారణము మొదటి దానితో కూడియున్న అధిక జలమే. ఇనుము యొక్క ఆమ్ల జనిదములలోను, జలీయత ఆమ్ల జనిదములలోను (Hydrated oxides) గల ప్రాణవాయువుయొక్కయు, నీటియొక్కయు మొత్తములు వాటియొక్క వర్ణములను నిర్ణయించును మాగ్నటైటు (Magnatite Fe3 O4 ) కాంతి నిరోధకముగాను, నల్లగాను ఉండి, ధాత్వీయ కాంతితో నొప్పుచుండును. కాని దీని స్ఫటికములు సాధారణముగా కాంతి విహీనములై యుండును దీని యొక్క గీటు అనగా దాని చూర్ణము యొక్క వన్నె నల్లగా నుండును. హేమటైటు (Hematite Fe2 O3 ) స్వచ్ఛమైన ధాత్వీయ కాంతి గలిగి నల్లగానుండును. కాని చూర్ణము గోధుమ లేక నెత్తురు రంగు గలిగి యుండును. ఇనుముయొక్క జలీయత ఆమ్లజనిదము (Hydrated Oxides) లయిన గోధైట్ (Goethite), లిమొనైట్ (Limonite) గోధుమ, పసుపు పచ్చ మొదలగు రంగులుగా నుండును. ఇవి కూడ హేమటైట్ వలె రంగుల పరిశ్రమలో ఉపయోగపడును.

పాషాణ - గంధకిద ఖనిజములు (Arsenic Sulphides) రెండు గలవు. ఇవి 1. నిమ్మపండువలె పచ్చగా నుండు ఆర్ ఫి మెంటు (Orphiment As2 S2). 2. ఎఱ్ఱని ఎరుపుగానుండు రియాల్‌గార్ Realgar (As2 S2) రెండవదాని యొక్క అణువులో (Molecule) ఒక గంధకపు పరమాణువు (atom) తక్కువ అగుటవలన ఈ రెండు ఖనిజములలోను రంగు భేదము గలుగు చున్నది.

పిచ్ బ్లెండ్ (Pitch blende) లేక యురేనియ ఆమ్లజనిదము నల్లనై, కాంతి విహీనముగ నుండెడు అనాకర్షణీయమైన ఖనిజము. కాని - రాగి, కాల్షియము, భాస్వరము లేక పాషాణము (ఆర్శినిక్) లు దీనిలో చిన్న మొత్తములలో కలసి యున్నప్పుడు యీ ఖనిజములు ఉజ్జ్వలమైన కాంతితో నొప్పును.

సాధారణముగా ఖనిజములందు చాలా సూక్ష్మరూపములలో రంగు నిచ్చెడి ఇతర పదార్థములు సమముగా కలిసి యుండుటవలన ఆ ఖనిజములకు ఒకే రంగు (homogeneous colouration) ఏర్పడును. అట్టివి అల్లోక్రొమాటిక్ (Allochromatic) అనబడును అట్టి ఈ తరగతికి చెందిన ఖనిజములయొక్క రంగును, వాటి ముఖ్య ధర్మములలో మార్పు లేకుండా కృత్రిమ పద్ధతులతో మార్చుటగాని లేక పూర్తిగా తొలగించుట కాని సాధ్యము. ఫ్లోరైటు (Fluorite) అను ఖనిజము పరిశుద్ధముగా నున్నపుడు వర్ణ విహీనమై పారదర్శకముగా ఉండును. కానిదానిలో ఇతర పదార్థము లుండుటవలన అపరిశుద్ధత ఏర్పడినపుడు ఆకుపచ్చ, ఊదా, గులాబి, నీలారుణ, పసుపుపచ్చ మొదలగు రంగులు కానవచ్చును. ఒక్కొక్కప్పుడు అది భిన్నవర్ణములు గల గీతలుగూడా గలిగియుండును. క్రోమియం (Chromium) అను మూల ద్రవ్యముయొక్క లేశములు కురువిందము(Corundum) జాతికి చెందిన కెంపు. నీలములకు ఎఱ్ఱ నీలరంగులను, బెరిల్ (Beryl) కు పచ్చవన్నెను (మరకతము) అబ్బునట్లు చేయును.

184