పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/226

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

ఖనిజముల రంగులు

వాటిని బయటికితీసిన తరువాత వాటివలన సంభవింపగల నష్టము మరల పూరింపబడ జాలదు. ఈ కారణము వలన ఇతర పరిశ్రమలకంటె ఖనన పరిశ్రమలో అధికతరమైన తరుగుదలకు అవకాశము ఉండును. ఖనన పరిశ్రమను సక్రమముగా నిర్వహించవలె నన్నచో, దక్షతగల 'కాస్ట్ అకౌంటింగు' (cost accounting) స్టాటిస్టికల్ సమాచారము (Statistical data) అవసరము. ఇది యొక ప్రత్యేకమగు సాంకేతిక విద్య. ఈ చిక్కులకు తోడు బొగ్గుగనులలో 'మిధేన్' (methane) అను బొగ్గు మసినుండి సంభవించు ప్రేలుడులు, లోహ సంబంధమైన గనులలో నుండు ఉష్ణోగ్రతయొక్క తీవ్రత, బండలు బ్రద్దలగుట, లోతైన ప్రాంతమునుండి ముడిపదార్థములను వెలికి తీయు క్లిష్ట సమస్యలు, ఆస్తి, ప్రాణములకు వాటిల్లు ప్రమాదములు, మొదలగు సంఘటనములు ఉత్పన్న మగుట కవకాశము కలుగును. ఈ విధమగు చిక్కులతో కూడుకొని యున్న ఖనన పరిశ్రమను నిర్వహించుట కెన్నియో శక్తియుక్తులు అవసరము.

హెచ్. ఎస్. ఎస్. ఆర్.


ఖనిజముల రంగులు : పదార్థములనుండి పరావర్తనముచెంది గాని, వెలువడి గాని లేక సరిగా ప్రసరించిగాని వచ్చిన వెలుతురు, నేత్ర ప్రణాళిక యందు కల్పించు వికారములనుబట్టి మనము ఆ పదార్థములయొక్క రంగులను గుర్తించుచున్నాము. దీనికి మూడు విషయములు సంబంధించి యున్నవి. (1) ప్రకాశము (illumination) యొక్క స్వభావము, (2) పదార్థముయొక్క స్వభావము, (3) కన్ను.

భూమియందలి రాళ్ళు నానావిధము లయిన ఖనిజముల కలయికల వలన ఏర్పడుచున్నవి. ఈ ఖనిజములు దాదాపు నిశ్చితమైన రసాయనిక సంఘటన (Chemical Composition) గల్గిన అంగారక పదార్థములై (Inorganic Substances) యున్నవి. ప్రకాశముయొక్క స్వభావమును, కన్నుయొక్క వర్ణగ్రహణ శక్తియు సాధారణముగా నున్నప్పుడు, ఖనిజము లందలి వన్నెయు, తదితర విషయములును, ఆయా ఖనిజముల యొక్క రసాయన సంఘటన పైనను, దీనికి ప్రత్యక్షముగానో, పరోక్షముగానో సంబంధించినట్టి ఇతర భౌతిక లక్షణముల పై నను ఆధారపడి యుండును. నానావిధములయిన రంజనములను (Colourations), వర్ణ ప్రతిరూపములను (Colour Patterns) కల్పించుటయందు బాహ్య పదార్థ లేశములు (Impurities) ప్రముఖమైన పాత్రను వహించుచున్నవి ఇవి చిన్న చిన్న దండములు (Rods), పళ్ళెములు, కడ్డీలు, గీతలు (Laminations) మున్నగు రూపములలో నున్నపుడు ఖనిజములలో అనేక విధములయిన, సుందరములగు నక్షత్ర రూపములును (Star impressions), వర్ణ విలాసములును కల్పించబడును. ఖనిజములలో వర్ణోత్పత్తికి కారణభూతము లయిన ఇతర భౌతికధర్మము లేవనగా - కాంతి నిరోధక (opaque), పారదర్శక (transparent) అసమగ్ర పారదర్శక (translucent) స్వభావము; వక్రీభవన గుణకము (refractive index), వెలుగు (lustre), ప్రకాశ పృథఃకరణము (dispersion), స్ఫటికత్వము (crystallinity), లేక నిరాకారస్థితి (amorphous state) : స్ఫటిక నిర్మాణము (Crystal Structure); ద్వివక్రీకరణము (double refraction) నకు సంబంధించిన ధర్మములు, వెలుతురుయొక్క అభిస్పందనము (Polarisation of light); ద్విదిజ్ఞ్నానావర్ణత (dichroism), మరియు చకాస (luminiscence)

పెక్కు ఖనిజములు వాటియొక్క రాసాయనిక సంఘటననుబట్టి విశిష్టములైన వర్ణములు గలిగియున్నవి. అట్టివాటికి ఇడియోక్రొ మేటిక్ ఖనిజము లని పేరు (Idiochromatic), ఉదా. స్వాభావిక లోహములు (Native Metals): బంగారు, రాగి మొ. అలోహ మూలకములు (Non-metallic elements) : గంధకము, రాగి, యురేనియము, కోబాల్ట్, నికెలు మొ. లోహములతో కూడిన ఖనిజములు.

వర్ణము రసాయనిక సంఘటనపై ఆధారపడునను సత్యము తామ్ర ఖనిజములలో స్పష్టమగుచున్నది. ఈ లోహముయొక్క గంధకిదముల (Sulphides) యొక్క విశిష్ట లక్షణములు లోహకాంతియు (metallic lustre), అపార దర్శకత్వమును. అట్టి కొన్ని తామ్ర గంధకిదముల ప్రత్యేక వర్ణములు ఈక్రింది విధముగా నున్నవి : ఛాల్ కోపై రైట్ (Chalcopyrite Cu Fe S2) గాఢ

183