పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/213

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఖగోళశాస్త్రము (ప్రాచీన భారతీయుల కృషి)

సంగ్రహ ఆంధ్ర

కాక మౌహూర్తిక జ్ఞానమునకు కూడ నావశ్యక మనుటలో 'నామావాస్యాయాం చ పౌర్ణమాస్యాం చ స్త్రియ ము పేయాత్, యదు పే యాన్నిరింద్రియస్స్యాత్" అను వేద వాక్యముచే స్పష్టమగును. అమా పూర్ణిమలయందు స్త్రీ సాంగత్యము నొందు పురుషుడు నిరింద్రియుడగును -అను విషయమును సాధారణముగా అలౌకిక విషయములందే ప్రవర్తించు వేదము ప్రతిపాదించె ననగా తత్త్వ ద్రష్టలును, అతీంద్రియ జ్ఞాన సంపన్నులగు మహర్షులు మానవ శ్రేయస్సుకొరకు ఎట్లు జాగరూకత వహించిరో, తెలియుచున్నది.

ఆనాడు కేవల చాంద్రమాన వ్యవహారమేగాక వారలకు సౌర చంద్ర సంవత్సర ప్రమాణ భేదజ్ఞానము కూడ వ్యవహృతమైనట్లు తెలియజేయు విషయములు కలవు. సౌరమాన మనగా సూర్యుడు అశ్వినీనక్షత్రాదిబిందు ప్రవేశము మొదలు నక్షత్రచక్రమును చుట్టివచ్చి తిరిగి తద్బిందు ప్రవేశము చేయుటలో మధ్యకాలము సౌర సంవత్సర మని పేరు. ఇక పండ్రెండు అమావాస్యలు కల సంవత్సరము చాంద్ర సంవత్సర మనిరి. అమావాస్య మనకు మాసము పూర్తియైనట్లు ఎట్లు తెల్పునో అట్లే ఋతు పర్యావర్తకమగు సౌర సంవత్సరము సంవత్సరము పూర్తియైనట్లు మనకు తెల్పును. అనగా సూర్యునికి అశ్వినీబిందు ప్రవేశకాలము సరిగా వసంతర్తుకాల మగుటచేత, చూతము పుష్పించు కాలమని ప్రకృతియే మనకు సంవత్సర పూర్తిని, నూతన సంవత్సరారంభమును సూచించుచున్నది.

ఈ సౌర సంవత్సరమునకు పైన చెప్పబడిన చాంద్ర సంవత్సరమునకు రమారమి 12 దినములు వ్యత్యాస మున్నది. ఈ వ్యత్యాసమునకు అధిమాస శేషమని పేరు పెట్టినారు. ఈ అధిమాసశేషము ముప్పది రెండు మాసముల 15 దినములలో ఒక మాసముగా పరిణమించునని లెక్క చేసినారు. అనగా అప్పటికి చాంద్ర సంవత్సరము సౌరవత్సరమును అతిక్రమించి ఒక మాసము ముందుగా పూర్తియైన దన్నమాట. ఈ మాసమును విడిచిపెట్టిన గాని చాంద్ర సౌర సంవత్సరములకు సంబంధము లేక పోవును గాన దీనిని అధికమాస మను వ్యవహారముతో విసర్జించి తిరిగి చాంద్ర సౌరమానములను సమానముగా నడపించిరి. ఈ అధిక మాసమును శుభకర్మబాహ్యముగా చేసినట్లే ప్రతి సంవత్సరము చాంద్రమానము సౌరమానము నతిక్రమించు 12 దినములను అధికమాస శేష మగుటచేత శ్రౌతకర్మ బాహ్యముగా చేసి ఆ దినమును శ్రౌతకర్మఠులకు విశ్రాంతి దినములుగా జేసినట్లు తెలియుచున్నది. ఈ విధము వేద కాలమునాటికి కేవల పంచాంగగణిత వ్యవహారమే గాక సునిశితములైన ఖగోళీయాంశములు కూడ విజ్ఞాతములై యున్నట్లు స్పష్టమగు చున్నవి.

మరియొక విషయము - యజుర్వేద సంహితయందు 'మధుశ్చ మాధవశ్చ వాసంతి కావృతూ' అని ఋతు నిర్వచనము చేయబడియుండుటచేత ఋతువులు సాయన (సౌర) సంవత్సరానుగతములు గావున వేదప్రతిపాదితములైన మధుమాధవమాసములు సాయనమాసము లని తేలుచున్నది.

వేదకాలమునాడు పై విధముగా పంచాంగ వ్యవహార ముండెడిది. ఆనాటి పంచాంగ గణితమునకు ఆధార భూతములైన గ్రంథములు నేడు మన కుపలబ్ధములు కాకున్నవి. ప్రాచీన సిద్ధాంతగ్రంథము లెన్నియో ఖలీ భూతములై కాలగర్భములో నశించిపోయిన వనుటకు తార్కాణము బ్రహ్మగుప్తాచార్యుని ఖండఖాద్యకవ్యాఖ్యాతయగు ఆమరాజు వ్యాఖ్యానములో నుదాహరించిన గ్రంథము లెన్నియో నేడు గానరాకున్నవి. వేదకాలమునకు తరువాత వేదాంగకాలమని వ్యవహరింపబడు కాలములోని (క్రీ పూ. 1377) ఒక్క గ్రంథము మాత్రము వేదాంగజ్యౌతిష మను పేర నేడు ప్రచారములో నున్నది. ఇది స్థూలముగా పంచాంగవ్యవహారమున కుపయుక్తమగు గ్రంథము. ఇక చారిత్రక కాలమని వ్యవహరింపబడు కాలమునుండి ఆర్యవిద్వాంసులు ఎంతో కృషి చేసినారు అట్టి రచనలలో మన కుపలబ్ధములగు గ్రంథములలో ప్రధానమైనవి 'ఆర్యభటీయము' (క్రీ. శ. 476) వరాహమిహిర పంచసిద్ధాంతిక బ్రహ్మస్ఫుట సిద్ధాంతము, లల్లాచార్యుని శిష్యధీవృద్ధిదము, సూర్యసిద్ధాంతము, శ్రీపతియొక్క సిద్ధాంత శేఖరము, ముంజలాచార్యుని లఘుమానసము, భాస్కరాచార్యుని సిద్ధాంతశిరోమణి (క్రీ.శ. పండ్రెండవ శతాబ్ది), గణేశ

170