పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/191

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్షేత్రపాయనము - మురుగుపారుదల

సంగ్రహ ఆంధ్ర

6. నేలను పదునుచేసి, సారవంతముగా చేయవలెను. సారవంతమైన భూమి తక్కువ నీటిసరఫరాతో మంచి ఫలితముల నివ్వగలదు.

7. సకాలములో మాత్రమే పైరులకు నీటిని అందజేయవలయును. ఏ తరుణములో ఏ పైరు నాటవలెనో జాగ్రతగా ఆలోచించి నిర్ణయించవలెను.

8. మురుగునీటిని వెలుపలికి పంపుటకు అవసరమైన చర్యలు తీసికొనవలెను.

9. పొలముయొక్క దిగువభాగమునకు ప్రవహించి వచ్చిన నీటిని పైరు పెంపకమునకై మరల పారుదలకు ఉపయోగించవలెను.

మురుగుపారుదల : పైరుకు అవసరమగు నీరు సరిపోగా, అదనపు నీటిని పొలమునుండి వెలుపలికి పంపివేయుట వ్యవసాయ విధానములో ముఖ్యమైన అంశము. నిలువనీరు పైరుయొక్క పెరుగుదలను నష్టపరచి పంటను తగ్గించివేయును. బాడవప్రదేశములందును, క్షారభూములందును, రేవడ పొలములందును, నీరు భూమిలోనికి ఇంకని ఇతర చోటులయందును మురుగు పారుదల సౌకర్యములు అవసరమగును.

భూమి ఉపరితలమునుండిగాని, భూమి లోతట్టు భాగమునుండిగాని నీటిని తోడి పారబోయవలెను. సవ్యమైన మురుగుపారుదల విధానమును అమలునందుంచిన యెడల, పంటలకు నష్టదాయకముగా పరిణమించెడి క్షార పదార్థములను, మిక్కుటమైన వర్షములవలన, నీటిపారుదలవలన కలిగెడి విపరీతమైన చిత్తడిని, చెమ్మను వేరు చేయవచ్చును. ఈ క్షారపదార్థములు, చిత్తడి, చెమ్మమిక్కుటముగా ఏర్పడినచో పంట నష్టపడును. మొక్కయొక్క అభివృద్ధికై గాలియొక్కయు, చెమ్మయొక్కయు పాళ్లు తగు సామ్యములో నుండునట్లు చూడవలెను. ఆరోగ్యకరమయిన వాయువు పైరుపై సోకిననేగాని పంటలకు హాని కలుగజేయు విషవాయువులు నశించవు.

వర్షములు వెనుకబడిన తర్వాత బాడవభూముల యందు వ్యవసాయము ప్రారంభింప వచ్చును. ఇట్లు ప్రారంభించిన యెడల సకాలములో విత్తనములు' నాటుటకును ఇతరములగు పొలము పనులు కొనసాగించుటకును వీలగును. ఒక్కొక్క సమయములో విత్తనములు నాటుటయందు ఒక వారము రోజులు ఆలస్యమైనను పంటలో నూటికి 10 నుండి 50 వంతులు వరకు నష్టము కలుగును.

బాడవప్రదేశములందు మొక్కయొక్క వ్రేళ్ళు భూమియందు లోతుగా చొచ్చుకొని పోవలెను. మొక్కయొక్క అభివృద్ధికి దోహద మొసగు సూక్ష్మక్రిముల కార్యకలాపము అధికమగును.

మురుగునీటి పారుదల విధానములో రెండు పద్ధతులు గలవు.

(ఎ) భూమి ఉపరితలమున కాలువలగుండ మురుగునీరు ప్రహించుట.

(బి) భూమి అడుగుభాగమున ప్రవహించుట.

ఉపరితలమున కాలువలద్వారా ప్రవహించు విధానమే శ్రేష్ఠమయినది, పొదుపైనది. ఉపరితలమున నిలువ యుండిన మురుగునీరు అధికమైన పరిమాణములో ఈ కాలువలద్వారా త్వరగా బయటికి పోగలదు. పర్వత పరిసరములయందు నిలువయున్న మురుగునీరు ఈ కాలువలద్వారా నిరాటంకముగా, స్వేచ్ఛగా వెడలిపోవును.

అయితే ఈ విధానమువలన చాల నష్టములుగూడ నున్నవి. సాగుకు పనికివచ్చు భూమిని ఈ మురుగు కాలువలు ఆక్రమించుకొనును. కావున ఎప్పటి కప్పుడు ఈ కాలువలను మరమ్మతుచేసి బాగుచేయవలెను. ఇంతేకాక, ఈ కాలువలు పశువులకు ప్రమాదకరముగా పరిణమించును. ఈ కాలువలలో కలుపు బలిసి, పంటలకు నష్టము కలుగజేయు జాడ్యములు అంకురించును.

భూమి లోతట్టు భాగమునుండి ఏర్పాటగు మురుగు కాలువలు కాల్చిన మట్టిగొట్టములతోను, సిమెంటు కాంక్రీటు గొట్టములతోను నిర్మితమై, నీరు ధారాళముగ ప్రవహించుటకై భూమి ఉపరితలమునుండి 5 అడుగుల లోతుగా అమర్పబడును. భూగర్భములో అమర్పబడుట వల్ల ఇట్టి గొట్టములతో ఏర్పాటైన మురుగుకాలువలు ఉపరితలమున జరుగు వ్యవసాయమునకు ఏ విధముగను ఆటంకము కలిగించవు. ఇంతేకాక ఇట్టి కాలువలను నైపుణ్యముతో అనేక రీతులుగా నిర్మించుటకు వీలగును. వీటి రక్షణకుగూడ శ్రమపడవలసిన అవసర ముండదు.

148