పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/166

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

కౌటిల్యుడు (రాజనీతిశాస్త్రము)

ర్వంశికుడు, ప్రశాస్త, సమాహర్త, సన్నిధాత, ప్రదేష్ట, నాయకుడు, పౌర వ్యావహారికుడు, కార్మాంతికుడు, మంత్రి పరిషదధ్యక్షుడు, దండపాలుడు, దుర్గపాలుడు, అంతపాలుడు, ఆటవికుడు అను పదునెనుమండ్రు చేరి యుండిరి. వీరికి లోబడి తక్కిన ఉద్యోగస్థులందరు వారి వారి కార్యములను నిర్వహించుచుండిరి. ఉద్యోగస్థుల నెన్నటికిని నమ్మరాదనియు, వారు రాజ ద్రవ్యమును స్వల్పముగ నయినను అపహరింపకుండుట అసంభవ మనియు అందుచేత రాజు గూఢచారుల సహాయమున వారి నెల్లప్పుడు పరీక్షించు చుండవలెననియు కౌటిల్యుడు అభిప్రాయపడెను: కౌటిల్యుడు ఊహించిన రాజ్యము శ్రేయోరాజ్యమని చెప్పదగియున్నది. అతని ఆదర్శము —


ప్రజాసుఖేసుఖం రాజ్ఞః ప్రజానాంచ హితే హితం
నాత్మప్రియంహితంరాజ్ఞః ప్రజానాంతుప్రియంహితం.

అను శ్లోకముచే స్పష్టమగుచున్నది. దీని ననుసరించి రాజులు నడుపవలసిన వ్యవహారములు ఒకటి రెండుగాక, బహు సంఖ్యాకములుగ నుండెను. వ్యవహారముల నన్నిటిని రాజులు అనేక శాఖలుగ విభజించి, ఒక్కొక శాఖను ఒక అధ్యక్షుని వశమందుంచుట ఉత్తమ మార్గమని కౌటిల్యుని అభిప్రాయము. ఈ శాఖలలో కోష్ఠాగారము, పణ్యము, కుప్యము, ఆయుధాగారము, తులామానము, దేశకాలమానము, శుల్కము, సూత్రము, సీత, సుర, సూనము, గణకవృత్తి, గోసంపద, ముద్ర మొదలైనవి చేరియుండెను. ప్రజల సౌఖ్యమునకు ప్రధాన సాధనము లైన వ్యవసాయము, గోసంపద, అటవీ సంపద, వర్తక వ్యాపారములు, మొదలయినవి వీటిలో చేరియుండుట గమనింపదగిన విషయము. పంచవర్ష ప్రణాళికల మూలమునను, జాతీయసాధనములు మూలమునను ఆర్థిక సాంఘికరంగములకు సంబంధించిన పను లనేకములు చేయుట కౌటిల్యునికి సమ్మతమై యుండెను.

రాజ్యమందు జనపదము, నగర మను రెండుభాగము లుండవలె నని కౌటిల్యుని అభిప్రాయము. గ్రామములతో గూడిన భాగము జనపదము. పట్టణములతో గూడినది నగరము. ఉత్తమ గ్రామములలో నూరింటికి తక్కువ గాక, ఐదువందలకు మించక, శూద్రకర్షకుల ఇండ్లుండ వలెననియు, పరిపాలనము గ్రామికుని యొక్కయు, గ్రామవృద్ధుల యొక్కయు వశమం దుండవలె ననియు, గ్రామము లై దింటిపై గోపుడను అధికారి ఉండవలెననియు, గోపుడు క్షేత్రములకు సంబంధించినట్టియు, ప్రజల ఆదాయ వ్యయములకు సంబంధించినట్టియు లెక్కలను, జనాభా లెక్కలను తయారుచేయవలె ననియు, కౌటిల్యుడు నిర్ణయించియున్నాడు. ప్రతినగరము ఒక పద్ధతిని అనుసరించి నిర్మింపబడవలె ననియు, అందు విశాలములగు బాటలు, సమృద్ధములగు జలాధారములు, వృత్తి, జాతి, కులములనుబట్టి ఏర్పరచబడిన నివాసప్రదేశములు ఉండవలెననియు, నగరమును పాలించు నాగరికుడను అధికారి నగరవాసులు క్షేమసంపాదనమునకును, ఆరోగ్యసంపాదనమునకును, కావలసిన కార్యములను చేయవలయుననియు కౌటిల్యుడు విధించియున్నాడు.

శూన్యప్రదేశములందు గ్రామములను నిర్మించుట, క్రొత్తగా జయించిన రాజ్యమును పరిపాలించుట, సామంత రాజులను వశపరచుకొనుట, రాజుల యొక్క ఆదాయమును వృద్ధి చేయుట, ఉద్యోగస్థులు అవినీతిపరులు కాకుండుట, సౌష్ఠవమగు సైన్యములను సమకూర్చుట, ఇతరరాజ్యములకు దూతలను పంపుట, యుద్ధ యాత్రలను జేయుట, జయముసంపాదించుటకై ఆయుధములతోపాటు మంత్ర తంత్రములను ఉపయోగించుట, వ్యాధిదుర్భిక్షాది పీడలనుండి ప్రజలను రక్షించుట మొదలగునవి మరికొన్ని విధులు.

ఒక పరిపాలన విధానమును గురించియేగాక, ప్రజలు స్వపోషణమునకై స్వీకరింపవలసిన వృత్తులు, చిన్న దేశములతో వేర్వేరు సరకుల నుద్దేశించి వ్యాపారము చేయు విధానము, కూలివాండ్రను, దాసులను ఆదరించు పద్ధతి, దేశమందు వృద్ధిగావింపదగిన కళలు - ఇట్టి పెక్కు విషయములు అర్థశాస్త్రమందు వివరింపబడియున్నవి. గ్రంథములోని ధర్మస్తేయకంటక శోధనాది అధికరణములలో సాంఘికాచారములు, వివాహధర్మములు, దాయ విభాగము మొదలగువాటిని గురించిన వివరణము కలదు. కౌటిల్యుని అర్థశాస్త్రము ఒక విధమైన విజ్ఞానకోశమని చెప్పుట అతిశయోక్తి కాజాలదు. ఇట్టి అమూల్యమయిన గ్రంథమును రచించిన కౌటిల్యుడు భారతీయులందరికి చిరస్మరణీయుడు.

మా. వెం. రం.

123