పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/163

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కౌటిల్యుడు (రాజనీతిశాస్త్రము)

సంగ్రహ ఆంధ్ర

సాహిత్య ప్రగల్భతను చాటుకొను ఛాందసుడుకాడు. ఇతడు అసాధారణమగు రాజకీయ తత్త్వ దార్శనికుడుగను, ఆచరణాత్మక వివేకశీలియగు రాజకీయవేత్తగను పేర్గాంచెను. అందువలననే ఇందు పరిపాలనాతత్త్వమునకు సంబంధించిన విషయములకు ప్రాధాన్యము ఇయ్యబడలేదు. ఈ దృక్పథమువలన, లక్ష్యము సాధించుట యే ముఖ్యముగాని అందులకు ఎట్టి మార్గమునైనను అవలంబించ వచ్చునని అతడు అంగీకరించెను.

2. తనకు పూర్వముగల గ్రంథముల నన్నిటిని పరికించి, వాటితో తన అభిప్రాయముల కనుగుణముగానున్న విషయములను అంగీకరించుటకుగాని, లేనిచో వాటిని సంస్కరించుటకు లేక నిరాకరించుటకుగాని సంసిద్ధుడై యుండుట ఇందలి మరొక విశేషము. ఆనాటి భావముల నన్నిటిని పరిశీలించి తానంగీకరించినమట్టుకు స్వీకరించి తాను ఆశించిన వ్యవస్థను చిత్రించెను

3. అతివాదము (Extremism) ను నిరసించిన సమన్వయ వాది కౌటిల్యుడు. ఒకవంక వైదికమతమును అభిమానించుచు వ్రాసిన గ్రంథములో వితంతు వివాహాది సంస్కరణములను సమర్థించుటయే యిందులకు ప్రబల నిదర్శనము.

అర్థశాస్త్రమునకు స్వతంత్ర ప్రతిపత్తిని సమకూర్చుట ఇతడు ఆ శాస్త్రమునకు చేసిన మహోపకారములలో నొకటి. దేశములోని ఆదర్శప్రజల లక్షణములను వివరించుచు అతడు అహోరాత్రములు కృషిచేసి, దేశ సౌభాగ్యమును వృద్ధిచేసెడు కర్షకులు దేశకల్యాణమునకు అత్యవసరమని నొక్కి చెప్పియున్నాడు. దుర్గ, రాష్ట్ర, ఖని, సీమ, వన, ప్రజ, వణిక్పథములను రాజ్యమునకు ఆదాయమునిచ్చెడు సాధనములనియు, వాటిని వృద్ధిచేయ వలయుననియు వక్కాణించినాడు.

కరువు కాటకముల నిర్మూలించుట, విప్లవములను, దండయాత్రలను ఎదుర్కొనుట మొదలగువాటికి ధనము కొరతపడినచో ధనసంపాదనమునకు కౌటిల్యుడు సూచించిన మార్గములు : "ఆశయసిద్ధి కలిగినచో, తత్కార్య క్రమము ఎట్టిదయినను సమంజసమయినదే" (The end justifies the means) అనెడు అతని సిద్ధాంతమునకు మచ్చుతునకలు : (i) శ్రీమంతులనుండి బలవంతముగా ధనము తీసికొనుట. (ii) దుష్టులభూములను దౌర్జన్యముగా స్వాధీనము చేసికొనుట (iii) ఫలవంతములయిన భూములపై అధికముగా పన్నులు వేయుట. (iv) రాజుపేర ఋణములు వసూలుచేయుట. రాజ్యకోశమును ఎల్లప్పుడు నిండుగా నుంచవలసిన అవసరమును కౌటిల్యుడు నొక్కిచెప్పి, దేశరక్షణ, దేశములో శాంతిభద్రతలు, వర్తక వాణిజ్యముల అభివృద్ధి, దానిమీదనే ఆధారపడునని ప్రభుత్వ యాజమాన్యముక్రింద పరిశ్రమశాఖలను నడుపుట, సస్యసంపదవృద్ధిచేయుట, వర్తక వాణిజ్యముల అభివృద్ధి రాజ్య క్షేమమునకు అవసరమని వివరించి యున్నాడు. పన్నులు వసూలుచేసెడు ఉన్న తాధికారులను రాజు జాగ్రత్తతో పరిశీలించుచుండవలెననియు, దండిగ వేతనము లిచ్చుటవలన ఉద్యోగులలో లంచగొండితనము పోవుననియు, విధినిర్వహణమున భక్తిశ్రద్ధలు కానబరచుదురనియు కౌటిల్యుని అభిప్రాయము.

కౌటిల్యుని సిద్ధాంతములు కొన్నిటితో కొందరు ఏకీభవించకపోవచ్చును. కాని ఇతని ప్రతిభను, దూరదృష్టిని మెచ్చుకొనక తప్పదు. ఇతని గ్రంథప్రాముఖ్యమును విస్మరించుటకు వీలులేదు.

ఆర్. వి. రా.


కౌటిల్యుడు (రాజనీతిశాస్త్రము) :

చాణక్యుడు, విష్ణుగుప్తుడు, ద్రమిళుడు అనునవి కౌటిల్యునకు నామాంతరములు. ఇతడు అర్థశాస్త్రము అను బృహద్గ్రంథమును రచించిన వాడుగను, క్రీ. పూ. 324 సం. నుండి క్రీ. పూ. 299 వరకు మౌర్యసామ్రాజ్యమును పాలించిన చంద్రగుప్త చక్రవర్తికి సామ్రాజ్య సంస్థాపన, పరిపాలనములందు ఆచార్యుడుగను, ప్రధానామాత్యుడుగను ప్రఖ్యాతిగాంచిన బ్రాహ్మణో త్తముడు.

ఇతని జీవితమునుగురించి సత్యములని నిశ్చయముగ జెప్పదగిన వివరములేవియు తెలియవచ్చుటలేదు. ఇతని జన్మస్థానము తక్షశిల యని కొందరును, ద్రవిడదేశమని కొందరును, ఆంధ్రదేశమని కొందరును చెప్పుచున్నారు. జన్మస్థానమేదియైనను ఇతడు తక్షశిలలో విద్యాభ్యాసము గావించి, సమస్త వేదశాస్త్రములందు ఉత్తీర్ణుడై, మగధ సామ్రాజ్యమునకు రాజధానియైన పాటలీపుత్రమున పండిత సత్కారమునకై ప్రభువులచే స్థాపింపబడిన విద్యా

120