పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/160

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

కోళ్ళూరు

విప్లవసందర్భమున లూయీ ఫిలిప్పీయెడ రాజభక్తి ప్రమాణము చేయ నిరాకరించినందున ఇతడు తన ఆచార్య పదవులను కోల్పోయెను. అంతట ఇతడు ఇటలీయందలి ట్యూరిన్ విశ్వవిద్యాలయమునకు వెళ్ళెను. అచ్చట ఇతని కొరకు గణిత - భౌతికశాస్త్ర (Mathematical physics) విషయమున ప్రత్యేకమైన ఆచార్యపదవి కల్పింపబడెను. 1838 వ సంవత్సరములో ఫ్రాన్సుకు తిరిగివచ్చి ఇతడు కొన్ని క్రైస్తవపాఠశాలలలో అధ్యాపకుడుగా నుండెను. ఇతనికి 1843 వ సంవత్సరములో గణిత - ఖగోళశాస్త్ర (Mathematical Astronomy) మున ఆచార్య పదవి లభించెను.

ఉన్నత బీజగణితము (Higher Algebra), చలన సమీక రణములు (Deferential Equations) సంభవ నీయతా సిద్ధాంతము (the theory of Probability), గణిత - భౌతికశాస్త్రము (Mathematical physics), ఖగోళశాస్త్రము (Astronomy), వైశేషిక కలనము (calculas of variations), నిర్ణాయక కనిష్ఠఫలములు (determinants), గణితశాస్త్ర మూలములు (the foundations of Mathematics), ప్రమేయ సిద్ధాంతము (the theory of Functions) మున్నగు వివిధ గణితశాస్త్ర శాఖలయందు ఇతడు నిర్విరామముగా కృషి యొనర్చెను. గణితశాస్త్రమునం దితడు ఖచ్చితమును, విస్పష్టమునైన పద్ధతులను ప్రవేశపెట్టెను. అవధుల (limits) యొక్కయు, అవిచ్ఛిన్నత (continuity) యొక్కయు సహాయమున విస్తృతమొనర్చుచు ఇతడు కలన సిద్ధాంతములను (principles of calculas) స్పష్టీకరించెను టెయిలరు (Taylor) యొక్క సుప్రసిద్ధమయిన శేషపద్ధతిని (form of remainder) ఖచ్చితముగా స్థాపించుచు, ఆతని (Taylor's) సిద్ధాంతమును రుజువుచేసిన వారలలో ఇతడు ప్రథముడు. స్థితిస్థాపకత్వము (Elasticity)న పీడనసిద్ధాంతము (theory of stress)ను ఇతడు కని పెట్టెను. కాంతిశాస్త్రమున (optics) తరంగ సిద్ధాంతమును విపులీకరించెను. ఇతని పేరు సామాన్యమైన శ్లేషణసూత్రము (dispersion formula) తో ముడివడి యున్నది. మొత్తముమీద ఇతడు గణితశాస్త్రముయొక్క వివిధశాఖలలో దాదాపు 800 ముఖ్య చరిత్రాంశముల (Memoirs) ను ప్రచురించెను. ఇతని సంకలితరచనలు 27 సంపుటములుగా ప్రచురింపబడినవి.

కోషీ జీవితమునందు ఉపేక్షింపరాని లోటొకటి ఏర్పడినది. అది అహంభావము. బాల్యమునందలి శిక్షణ క్రమమో, శాస్త్రరంగమున మహత్తరమైన విజయములను గాంచి, అత్యంత కీర్తిమంతుడుగా పేరొందుటయో ఈ అహంభావమునకు కారణ మయి యుండును. ఈ అహంభావము కారణముగా ఇతడు రాజకీయాధికారుల యొక్కయు, శాస్త్రజ్ఞుల యొక్క యు అనిష్టమునకు గురి యయ్యెను.

జి. ల.


కోళ్ళూరు :

కృష్ణానదీ తీరమున, సత్తెనపల్లి తాలూకా నట్టడవులలో కొండలమధ్య కోళ్ళూరు గ్రామమున్నది. దీని నిప్పుడు కొల్లూరు అనుచున్నారు. ఇచ్చట చరిత్రాత్మకమైన ప్రాచీన చిహ్నము లెన్నియో బయల్పడినవి. దేవాలయములు, గోపుర ప్రాకారాదులు, మసీదులు, గోరీలు మున్నగునవి శిథిలావస్థలో నున్నవి. చారిత్ర కాధారములయిన శిలాశాసనము లున్నవి. భూగర్భ శాస్త్రజ్ఞుల పరిశీలన, అంచనాలనుబట్టి యిక్కడ విలువగల ఖనిజములు లభ్యమగునని తెలియుచున్నది. ప్రపంచ విఖ్యాతి వడసిన "కోహినూరు" వజ్రము దొరికిన స్థలమిదియే. శాసనదృష్టాంతములనుబట్టి యీ ప్రాంతము కోటకేతరాజు పరిపాలన యందున్నది.

దేవాలయములు - శాసనములు : కోళ్ళూరు గ్రామమునకు పశ్చిమ దిశన ఒక దేవళమున్నది. అక్కడొక శాసనమున్నది. ఈ శాసనము ప్రకారము శ్వేతశృంగ పర్వతమునకు పశ్చిమమునను, కృష్ణానదికి దక్షిణమును ఉన్న “కొడవలూరు" శ్రీరామలింగేశ్వర దేవాలయ మండపమును కోటకేతరాజు కట్టించినట్లును, అది శిథిలమైయున్నందున శ్రీ శిమ్మాజీ బాగు చేయించినట్లును తెలుగులిపిలో వ్రాయబడి యున్నది. దీనికి పూర్వకాలమును తెలియజేయుచు మరిరెండు శాసనములున్నవి. గడపకు అడ్డముగా మరొక శాసనము పడవేసియున్నది. ఈ కొడవలూరే నేడు కోళ్ళూరు (కొల్లూరు)గా వాడుకలో నున్నది. వేదాద్రి నృసింహస్వామిని సందర్శించ వచ్చిన యాత్రికులు

117