పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/157

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కోలారు

సంగ్రహ ఆంధ్ర

సుమారు పదిమైళ్లుండును. ఈ కోరంగికి మైలుదూరములో రాచబాటయం దున్న తాళ్ళరేవునకు సముద్రము మరల సుమారు 4, 5 మైళ్ళుమాత్రమే. కొన్నివందల ఏండ్లకు పూర్వము కోరంగికి సముద్రము నాల్గుఫర్లాంగుల దూరమున నుండెడిదని, తన తాతగారు తనకు చెప్పినట్లు, నేడొక శతవృద్ధునిపలుకు - అందువలననే చేపలవేటకై అగ్నికుల క్షత్రియులు కోరంగికి సివారగు బొడ్డు వెంకటాయపాలెమును సముద్రమునకు దగ్గరగా కట్టుకొనిరనియు తన తాతగారు ఆయనకు చిన్ననాడు చెప్పెనట. ఈ నదీముఖద్వారమున ఇసుకదిబ్బలు పెరుగుటచే సముద్రమునకును దీనికిని దూరమేర్పడెను.

ఇపుడు కోరంగికి నాల్గుమైళ్ళలోనున్న సముద్రమునకు నాల్గుఫర్లాంగు లెడముగా, మేటవేసిన ఇసుకతిప్పపై 'కోరింగ దీపగృహము' కలదు. ఇది చాల ప్రాతదై, శైథిల్యము నొందినది. ఇప్పుడు బైటపడియున్న ఈ దీపగృహము పూర్వము సముద్రములో నున్నట్లు చెప్పెదరు.

కోరంగిసంత : నదీముఖద్వార ప్రాంతమునందును, సముద్రమునందును వేటాడితెచ్చిన చేపలను చేపల వర్తకులు సంతలో ఇచట అమ్ముచుందురు. "దాక్షారామము' గొల్లల మామిడాడ, కాకినాడ, చామర్లకోట మున్నగు తావులందలి సంతలతో సమానమైనది కోరంగిసంత.

నాటి కోరంగి ఇంతటి ప్రసిద్ధి నార్జించుకున్న చారిత్రక పురాతనత్వముగల నగరము.

క్రీ. శ. పందొమ్మిది - ఇరువది శతాబ్దులలో నౌకావ్యాపారము మూలమున శ్రీమంతులైనవారు ఐదారుగురు మాత్రమే ! కాని, తుపానుల తాకిడికి దారియు తెన్నును కానలేక, మునిగిన నావలు పెక్కులనియు, మరణించిన జనులు పెక్కురనియు ఇచ్చటివారు చెప్పుదురు. నాటి కోరంగి మహాపట్టణము. నేటి కోరంగి గొప్ప కుగ్రామము.

బొ. వెం. కు. శ.


కోలారు :

కోలారుజిల్లా బంగారుగనులకు ప్రసిద్ధి. మైసూరు రాష్ట్రములో తెలుగువారు ఎక్కువగానుండు జిల్లా కోలారు. ఇది రాయలసీమ జిల్లాలమాదిరి వర్షచ్ఛాయా ప్రాంతమగు మైదానములో నున్నది. ఇందు వేసవిలో ఎండయు, చలికాలములో చలియు ఎక్కువగానుండును. ఈ జిల్లాలోని చిక్కబళ్ళాపురము దగ్గర నందికొండ ఉన్నది. ఇది సముద్రమట్టముకంటె 4850 అడుగుల ఎత్తున నున్నది. వేసవిలో విశ్రాంతికేంద్రముగా ఉండుటకు కావలసిన సౌకర్యములు ఇందు మైసూరు ప్రభుత్వము వారు కల్పించినారు. కొండమీదికి చక్కనిబాట నిర్మింపబడినది. విద్యుద్దీపములు, నీటిగొట్టములు కూడ అమర్పబడినవి. ఇచ్చటి వనరామణీయకము ఆకర్షకము. ఇచ్చటి వాతావరణము మిక్కిలి వాసయోగ్యము. హైదరాలీ, టిప్పుసుల్తానుల కాలమునాటి కొన్ని చారిత్రక స్మారక చిహ్నములుకూడ ఇచట కలవు. రాయలసీమలో ప్రవహించుచున్న ఉత్తరపెన్నా, దక్షిణపెన్నా, పాపఘ్ని, చిత్రావతి అనునదులు ఈ కొండలోనే పుట్టినవి. పాలారునదికూడ ఇక్కడనే జన్మించినది.

ఇక్కడిప్రజలు రాయలసీమ ప్రజలవలె వర్షముపైననే ఆధారపడుచున్నారు. జీవనదులు లేవు. ప్రతిగ్రామము నందును చెరువులున్నవి. చెరువులు, బావులు ఇచ్చటి సేద్యమునకు ఆధారములు. రాగులు ఇచటి ప్రధానమైన మెట్టపంట. సామాన్యప్రజలకు ఇదేముఖ్యాహారము. చిక్కబళ్ళాపురము, శిడ్లఘట్ట - ఇత్యాది ప్రాంతములలో బంగాళదుంపలను విరివిగా పండించి ఎగుమతి చేయుదురు. జనులు పట్టుపురుగులను పెంచి, పట్టుపరిశ్రమకు తోడ్పడుదురు. ఆ పరిశ్రమకు వలసిన మల్బరీ తోటలను పెంచుదురు. గౌరీబిదనూరు తాలూకా బెల్లము ఎగుమతికిని, చింతామణి తాలూకా చింతపండు ఎగుమతికిని ప్రసిద్ధమైనవి.

కోలారుజిల్లాకు ముఖ్యపట్టణము కోలారు. కంబళ్ళ నేత ఇక్కడి ముఖ్యపరిశ్రమ. ఈ పట్టణమునకు సమీపములో రామాయణకాలమునాడు ప్రసిద్ధికెక్కిన వాల్మీకి ఆశ్రమమైన అవంతికా క్షేత్రమొకటి కలదు. ముళబాగిలు తాలూకాలోని ఇప్పటి “అవణి” అను ప్రాంతమే అప్పటి అవంతికా క్షేత్రమని స్థల పురాణమువలన తెలియుచున్నది. శ్రీరాముడు సీతాదేవిని అరణ్యమునకు పంపించినప్పుడు ఆమె ఇక్కడనే వనవాసకాలము గడిపినదనియు లవకుశులు రామలక్ష్మణులను ఓడించి యజ్ఞాశ్వమును బంధించిన తావుకూడ ఇదియేననియు తెలియుచున్నది.

114