పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/155

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కోరంగి

సంగ్రహ ఆంధ్ర

క్రీ. శ. 1839లో పెద్ద తుపానువచ్చి కోరంగి గ్రామము కొట్టుకొనిపోయినది. సముద్ర తీరమున ఉండుటచేత ప్రాచీన కాలము నుండియు ఎన్ని ప్రాత కోరంగులు బంగాళా ఖాతము పాలయ్యెనో, ఎన్ని క్రొత్త కోరంగులు తలయెత్తుచు వచ్చెనో ఎవరును నిరూపింప జాలరు.

క్రీ. శ. 1877 – 78 సంవత్సరములలో రు. 8,22,000 ల నౌకా వ్యాపారము కోరంగియందు జరిగినదనియు, క్రీ. శ. 1884 - 85 సంవత్సరములలో ఈ వ్యాపారము 33 వేల రూపాయలకు పడిపోయిన దనియు తెలియుచున్నది.

ప్రప్రథమమున భారతదేశములో విదేశములతోడి సముద్రవ్యాపారమును ఆరంభించినవారు ఆంధ్రులు. ఈ విషయమున వీరికి తోడ్పడిన ప్రధానమైన నదులలో కృష్ణ ఒకటి. రెండవది గోదావరి. పదునైదవ శతాబ్ద్యంతము వరకు ఈ గోదావరి తీరమున 'కోరంగి' కళింగ తీరమున చిలుక సరస్సువలె, ఓడల బాగుసేతకు కూడ ఉపయోగపడిన ఒక గొప్పరేవు. తరువాత క్రీ. శ. 1611 వ సంవత్సరమునందు బ్రిటిషువారును, క్రీ. శ. 1614 వ సంవత్సరమునందు మచిలీపట్టణములో ఫ్రెంచివారును, క్రీ. శ. 1628 వ సంవత్సరమునందు భీముని పట్టణములో డచ్చివారును స్థావరము లేర్పరచుకొనిరి. అదిమొదలుగా ఆయా పాశ్చాత్యుల అవసరములనుబట్టి ఆంధ్ర నౌకావ్యాపార వాణిజ్యములు ప్రధానముగ ముందు మదరాసునకు తరలింపబడినవి. కలకత్తాకును, దక్షిణమున 'ట్రింకోమలి' కిని నడుమ పెద్ద పెద్ద ఓడలు పట్టుటకు వీలుగనుండెడి కోరంగికి, 19 వ శతాబ్ద్యంతమున క్షీణదశ ప్రారంభించెను. కాలక్రమమున 'కోరంగి' రేవు మేట వేసికొని పోయినది. దీనితో మిగిలిన వాణిజ్యలక్ష్మి కూడ బెండమూరులంక, నీలపల్లి, ఇంజరము, కాకినాడ మొదలగు రేవులకు తరలి, క్రమక్రమముగ అంతర్ధానమైనది. క్రీ. శ. 1946 ఆగస్టు 15వ తేది నుండి బర్మా స్వతంత్రరాజ్య మయ్యెను. తన్మూలమున రంగము (రంగూన్), మోల్మేను పట్టణములతో, కోరంగికి ఇటీవలివరకు గల వ్యాపారము కూడ నశించినది.

నేటి కోరంగి: చారిత్రక చిహ్నములు: నేటికిని ప్రాత కోరంగియందు కురం గేశ్వరాలయము కలదు. మద్రాసులోని ప్రాచ్యలిఖిత పుస్తక భాండారమునందు ఈ కురంగేశ్వరాలయమునకు సంబంధించిన యొకానొక తామ్రశాసన మున్నదట. దానిలో ఈ క్షేత్ర మహత్త్వమును, గర్భాలయ వర్ణనమును లిఖింపబడియున్నవట. గర్భాలయ భూభాగమును, త్రిపీఠములును, శివలింగమును కలిసి ఏకశిలగానున్నవి. ఇందలి శివలింగము అష్టబంధములు లేకయున్నది. ఈ రెండంశములును పై జెప్పిన తామ్రశాసనమున గలవనియు, లింగమునకు అష్ట బంధాదులు లేకపోవుట మానవప్రతిష్ఠ కాకుండుటచేననియు కొందరి వాదము. ముందు ప్రసిద్ధశాసనాదుల లేమియే, ఈ లింగము దైవప్రతిష్ఠిత మనుటకు సాధక మను వాద మింకొకటి. మొత్తముమీద ఈ దేవాలయమును గూర్చి ఇంకను చాల పరిశోధనము జరుగవలెను.


'ఆత్రేయీ సంగమం నామ తీథన్౦ త్రైలోక్య విశ్రుతం
యత్ర సన్నిహితో దేవః కురంగేశః స్సదా శివః

అని సప్తసాగర మాహాత్మ్యమున గలదు. ఈ తీర్థమును గూర్చి ఒక క్షేత్ర మాహాత్మ్యము గలదు. ఆ గ్రంథము పేరు కురంగక్షేత్ర మాహాత్మ్యము. అది మద్రాసు ప్రాచ్య లిఖిత పుస్తక భాండారములో కలదు. డాక్టర్ వింటర్ నిట్జు (Dr. Winternitz) ప్రభృతి పాశ్చాత్య సంస్కృత పండితుల మతమునుబట్టి చూచినను ప్రాయికముగ ఇట్టి పురాణములు క్రీ. శ. నాల్గైదు శతాబ్దులలో వ్రాయబడి యుండవచ్చును. అట్లన్నను కురంగి, కోరింగ యను పేళ్లు కోరంగికి ఆకాలమునుండియు కలవన్న మాట. నేటికిని అచ్చటివారు చెప్పుకొను స్థలపురాణమును బట్టి రావణప్రేరితుడును, మాయాకురంగ రూపధారియునగుమారీచుని శ్రీరామచంద్రుడు ఇచట సంహరించెననియు, తత్సంహారజనిత పాతక నివారణార్థము అతడీశ్వరలింగ ప్రతిష్ఠ చేయుటచే అది కురంగేశ్వరాలయమైనదనియు, ఆ గుడిగల గ్రామము కురంగి, కోరింగ, కోరంగి యైనదనియు తెలియుచున్నది. సప్తసాగర సంగమముల యందును శ్రీరామచంద్ర ప్రతిష్ఠితములైన శివాలయము లుండుటయు, రావణ వధానంతరము శివప్రీత్యర్థము రామేశ్వరమునగూడ శ్రీరాముడు శివలింగమును ప్రతిష్ఠించుటయు, మున్నగునవి పై ఊహకు ప్రోద్బలకములుగ నున్నవి. ఇచటివారు నేటికిని సంకల్పమున దండకారణ్య మధ్యేయని చెప్పుకొందురు. అట్టి పురాణములను, ఇట్టి

112