పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/153

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కోరంగి

సంగ్రహ ఆంధ్ర

అన్ని తరగతులకును చెందిన 'ఏలుపుదేవుడు' అను దేవత వారి కత్యంత ముఖ్యదైవము. కోయలలోని ప్రతి గోత్రము వారికిని ఆ గోత్రమునకు చెందిన ప్రత్యేక 'ఏలుపు' ఉండును. (ఏలుపు అనగా భగవంతునికిని, అతని శ క్తికిని చిహ్నముగా లోహముతో చేయబడిన ఒక గుర్తు) ఇది ఒక విధముగా పూర్వీకులను పూజించుటయనవచ్చును. ఈ పూజ ప్రతి మూడు నాలుగు సంవత్సరములకొకసారి జరుగుచుండును. వర్షాకాలము తరువాత వారుచేయు 'భూమి పండుగ' అనునది మరియొక ముఖ్యమగు ఉత్సవము. ఎద్దులను చంపి వాటిరక్తము భూమిపై చల్లెదరు. ఈ విధముగా చేసినయెడల భూమియొక్క సారము, పంట అభివృద్ధి యగునని వారినమ్మకము. ' నాలు గై దు దినములవరకు సంబరములు, త్రాగుడు, నృత్యము, విందు బ్రహ్మాండముగా జరుగును. ఏలుపుదేవునేగాక వీరు షుమిదేవి, ముత్తాలమ్మ (కలరా జాడ్యదేవత), మైసమ్మ (మశూచికపు దేవత) అను దేవతలనుకూడ కొలిచెదరు.

కోయ సంఘమునకు చెందిన వివాదములను తీర్చుటకు 'కులపంచాయితి' అనునొక వ్యవస్థయుండును. 'పిన్న పెద్ద', 'కులపెద్ద' అనువారు దీనిలో ముఖ్యులు. 'కులపెద్దకు' ఎక్కువ అధికారముండును. ఈ యిరువురు ఉద్యోగులును వంశక్రమముగా వత్తురు. కాని ఒక 'పిన్న పెద్ద' చనిపోయినపుడు మరియొకనిని ఆ స్థానములో ఎన్నుకొనుట ఆచారము. పల్లెలోని వివాదముల నన్నిటిని 'కులపెద్ద ' తీర్చును. సాధారణముగా ఇతని తీర్పే అంత్య నిర్ణయముగా నుండును. నేరస్థులు పెద్ద జరిమానాలతో శిక్షింపబడుదురు. ఈ జరిమానాలు ఈయని వారిని వెలివేసియు, రెండుచేతులతో చెట్లకు వ్రేలాడదీసి క్రింద ముళ్లుపోసియు కఠినముగా శిక్షింతురు. వారి నిజాయితీని పరీక్షించుటకు మరుగుచున్న నూనెలోగాని, నీటిలోగాని వారిచేతులను ముంచుట అనునది మరియొక పరీక్షా విధానము.

రా. ప్ర.


కోరంగి :

ఇరువది శతాబ్దములకు పైబడిన చరిత్రయందును, భూగోళ శాస్త్రమునందును పేర్కొనబడిన చరిత్రాత్మక ప్రదేశము కోరంగి.

“కోరంగి” నేటి తూర్పుగోదావరిజిల్లా యందు నిడుచతురాకారముగ బంగాళావియుక్తాగ్ర గుడతీరమున గల కాకినాడ తాలూకాకు ఆగ్నేయదిశయం దున్నది. నేటి కాకినాడ పట్టణమునుండి 'చొల్లంగి' దాటి దక్షిణముగ 'ఏనాము'నకు పోవుదారిలో సుమారు పదియవమైలు నందుగల కుగ్రామముల సమాహారమే కోరంగి. అనగా (1) ప్రాతకోరంగి (2) క్రొత్తకోరంగి (3) సీతారామపురము (4) చినబొడ్డువెంకటాయపాలెము (5) పెదబొడ్డు వెంకటాయపాలెము (6) బొడ్డువానిలంక అను ఈ శివారు లన్నిటిని కలిపి 'కోరంగి' యని నేటి ప్రభుత్వము వ్యవహరించుచున్నది. కొన్ని వందల ఏండ్లకు పూర్వము 'కోరంగి'కి 'కురంగి' యని పేరున్నట్లును, పాశ్చాత్యులరాకతో ఆ పేరు 'కోరింగ' (Koringa) అనియు, ఇటీవల 'కోరంగి' (Korangi) అనియు మారినట్లును అచ్చటిపెద్దలు చెప్పుదురు.

పై జెప్పిన 'కాకినాడ - ఏనాము' బాటకు పదియవ మైలున పడమరగా గల 'ఆత్రేయ' గోదావరిని దాటిన వెంటనే ప్రాత కోరంగియు, తూర్పుగా క్రొత్త కోరంగియు, కడమ శివారులును ఉండుటచేత మొత్తముమీద కోరంగిని చతురస్రమన్నను తప్పులేదు.

కోరంగికి తూర్పున బంగాళాఖాతమునకు చేర్చు రిజర్వు ఫారెస్టును, దక్షిణమున ఒక మైలులో తాళ్ళరేవును, పడమర సుమారు అరమైలులో కోరంగికాల్వయు, ఉత్తరమున ఆరుమైళ్ళలో చొల్లంగియు కలవు.

సుమా రొకమైలు పొడవును, అరమైలు వెడల్పును గలిగి చతురస్రాకారముగా నుండి చదరపు టరమైలు విస్తీర్ణము కలదని చెప్పదగు ఆరుపల్లెల మొత్తము కోరంగి.

కోరంగికి పడమట ఆత్రేయ గోదావరియు, పడమటను ఉత్తరమునను కోరంగికాల్వయు కలవు. రాజమండ్రి, రామచంద్రపురము, కాకినాడ అను మూడు తాలూకాలలో ఈ కోరంగికాలువ ప్రవహించుచున్నది. వర్షములు తక్కువైనను ఇది పంటలకు నష్టము రానీయదు. దీని పొడవు నలుబది మైళ్లు. 37,601 ఎకరములు దీనిక్రింద సాగుచేయబడుచున్నదని క్రీ. శ. 1931 సంవత్సరము నాటి అంచనా. ఇచటి 'ఆత్రేయ' కోరంగియొద్ద సముద్రములో కలియు

110