పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/151

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కోయలు

సంగ్రహ ఆంధ్ర

త్సరమున 'పడా'కు వచ్చి అచ్చట వైద్యపాఠశాలలో జేరెను. అతడచట 1505 వ సంవత్సరము వరకు నుండెను. ఈలోగా 1503 వ సంవత్సరములో 'ఫెర్రరా' అనుచోట మతగురు న్యాయశాస్త్రమున డాక్టరేటు పట్టము పొందెను. తరువాత నికొలస్ పోలెండునకు తిరిగివచ్చి హీల్స్‌బర్గ్ అనుచోట బిషప్పునకు సంబంధించిన రాజగృహములో తన మేనమామకు వైద్యుడుగా నుండెను. 1512లో మేనమామ చనిపోయిన తరువాత నికొలస్ కోపర్నికస్ ఫ్రాన్‌బర్గు వచ్చి తాను చేయవలసిన మతసంబంధమగు విధులను పూర్తిగా నిర్వర్తించుట మొదలిడెను. అధికార సంబంధముగను, రాజకీయముగను పరిస్థితులు అనుకూలముగ లేకపోయినను, అతడు మతాధికారుల సభకు ప్రతినిధిగా విడువకుండ పనిచేసెను. తన కులవైద్యశాస్త్ర ప్రావీణ్యమును ఎల్లప్పుడు బీదల సేవయందే అతడు వినియోగించెడి వాడు. ధనికు లాతనిని తరచు పిలుచుచుండెడివారు. బహురూప కార్యనిమగ్నుడయి యుండియు కోపర్నికస్ కొంత తీరుబడి చేసికొని, సరికొత్త ఖగోళ శాస్త్ర పద్ధతి యొకటి మిగుల శ్రమపడి తయారుచేసెను. ఆ పద్ధతి నవలంబించుటచే, ఈ విశ్వమునుగూర్చి మానవునకున్న దృక్పథము మూలాధారములతో సహా మారిపోయినది.

ఖగోళశాస్త్ర విషయమున కోపర్నికస్ చేసిన మహోత్కృష్ట మైన కృషికి కావలసిన ముఖ్యవిషయము లాతడు హీల్స్‌బర్గులో నున్నపుడే నిర్ణయించుకొనెను. ఫ్రాన్‌బర్గు వచ్చినతరువాత తనకు లభించిన కొద్దిపాటి పరికరముల సహాయముతోడనే పరిశీలించి, ఆ విషయముల సత్యాసత్యములను పరీక్షింప మొదలిడెను. టాలెమీ యొక్క సిద్ధాంతములయెడ అతనికెప్పుడో విశ్వాసము పోయినది. ఇటలీదేశమున పై థాగరస్ అభిప్రాయములు 'సూర్యకేంద్ర సిద్ధాంతము' (heliocentric theory)ను గూర్చి విచ్చలవిడిగా చర్చింపబడుచుండుట ఆతడు చూచెను. సూర్యకేంద్ర సిద్ధాంతమును ప్రతిపాదించుచు 1530 వ సంవత్సరమున కోపర్నికస్ ఒకగ్రంథమునుపూర్తిచేసెను. దాని ముఖ్యార్థము వ్రాతప్రతిరూపమున ఆ సంవత్సరమే అనేకులకు తెలిసినది. ఏడవ క్లిమెంటు ఆ సిద్ధాంతము నామోదించెను. కార్డినల్‌షాన్‌బర్గు దానిని పూర్తిగా ప్రచురింపవలసినదని చెప్పెను. కాని కోపర్నికస్ శిష్యుడగు జార్జిజాషిమ్ రెటికస్ ప్రోత్సాహముచేసి 1540 వ సంవత్సరమున కోపర్నికస్ సిద్ధాంతము యొక్క పీఠికను అచ్చువేసెను. వెంటనే కోపర్నికన్ యొక్క పూర్తి గ్రంథమును రెటికస్ న్యూరెంబర్గులో నొక ముద్రణాలయమునకు కూడ పంపెను. ఆ గ్రంథము 1543 లో అచ్చుపడి, మొదటిప్రతి ఫ్రాన్‌బర్గు చేరునప్పటికి కోపర్నికస్ జీవితము అంత్యదశయం దుండెను. ఆ గ్రంథమును రచయిత మరణశయ్యపై మాత్రమే ఉంచగలిగిరి. 1542 వ సంవత్సరాంతమున రక్తజమూర్ఛ, పక్షవాత రోగములకు కోపర్నికస్ గురి యయ్యెను. అతడు 1543 వ సంవత్సరమున మే 24వ తేదీన చనిపోయెను. కోపర్నికస్‌యొక్క గ్రంథములోని త్రికోణమితి భాగమును విడదీసి, రెటికస్ తన పర్యవేక్షణలో 1542వ సంవత్సరమున విట్టెన్‌బర్గులో వేరుగా ప్రచురించెను. 19 వ శతాబ్దమున నికొలస్ కోపర్నికస్ జీవితమును గూర్చి చాలగ్రంథములు వ్రాయబడెను.

బి. వి. ర.


కోయలు:

'కోయ' అను పదమునకు 'కొండమనుష్యులు' లేక 'కొండలలో నివసించువారు' అని అర్థము. కోయలు ఆంధ్రప్రదేశములో తూర్పు గోదావరి జిల్లా మన్య ప్రదేశములోను, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో మైదానము లందును, విశాఖపట్టము, గుంటూరు జిల్లాలలోను నివసించుచు గోదావరికి దక్షిణమునగల ఖమ్మం మెట్టు వరకును, ఈ నదికి ఎడమ భాగమున నాగపూరును దాటియున్న బస్తరులోనికిని, ఒరిస్సాలోని మలకనగిరి తాలూకాలోనికిని వ్యాపించియున్నారు.

కోయలు ఈ క్రింద పేర్కొనబడిన తెగలుగా భాగింపబడి యున్నారు. 1. గుట్ల (కుట్ల) కోయలు లేక రాచ కోయలు. 2. గొమ్ముకోయ (లేక దొరల చట్టము). 3.. కమ్మరకోయ, 4. మూసరకోయ, 5. గంపకోయ, 6. ఒడ్డికోయ, 7. పథిడికోయ. ఈ విభాగము చాలమట్టుకు వారివారి వృత్తులపై నాధారపడియున్నది. వారు మరల 1. బేరంబోయి లేక ఏడుగుట్ట గోత్రము, 2. బండారి లేక ఐదుగుట్ట గోత్రము, 3. సన్‌పాగరి లేక నాల్గుగుట్ట

108