పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/149

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కోడూరు V

సంగ్రహ ఆంధ్ర

నని వెన్నెలకంటి సూరనార్యుని ఆంధ్ర విష్ణుపురాణము చెప్పు దానితో పై విషయము పొంది పొసగియుండుట గమనార్హము.

ఈ అనపోతారెడ్డి కోడూరు శాసనములో పేర్కొనబడిన పేళ్ళలో శంకనిపల్లి, విన్నకోట, కనుమేర్ల, పొట్టిపాడు, కలవపూడి యనువాని నన్నింటిని నేడు కృష్ణాజిల్లా గుడివాడలో నున్న సంకర్షణపురము, విన్నకోట, కనుమెర్ల, పొట్టిపాడు, కలువపూడి యను గ్రామములుగ క్రమమున గుఱుతించి పోల్చవచ్చును.

బొ. వేం. కు. శ.


కోడూరు - IV :

కోడూరు గ్రామము పూర్వము గుంటూరుజిల్లా బాపట్ల తాలూకాలో నుండెడిది. ఇప్పుడు తెనాలి తాలూకాలో నున్నది. దీనికి అనవేమపురమని నామాంతరము కలదు. ఈ అనవేముడు కొండవీటి రెడ్డిరాజగు అనవేమారెడ్డి (క్రీ. శ. 1364-1386). దీని నిప్పుడు బ్రాహ్మణ కోడూరు అందురు. ఈ గ్రామ విస్తీర్ణము 3.27 చదరపుమైళ్ళు. 706 ఇండ్లు గలవు. జనాభా 3231 మంది. ఇందు పురుషుల సంఖ్య 1593. స్త్రీల సంఖ్య 1638.

గోపరాజు రామమంత్రి తొలుత ఈ కోడూరు గ్రామమును కౌండిన్యసగోత్రులును, ప్రథమశాఖవారును అగు బ్రాహ్మణుల కిచ్చినాడు. అందుచే దీనికి బ్రాహ్మణ కోడూరు అను పేరు వచ్చినది. ఇందు ఒక్క సంప్రతి ఉండెను. ఆ రామయమంత్రి ఇచ్చిన కరణికములను, మిరాసులను మార్చి రెడ్డిరాజులు మరల తమ యిష్టాను సారముగ కొందరకు అగ్రహారముల నిచ్చిరి. ఆ గ్రామములయొక్కయు ఆ ప్రతిగృహీతల యొక్కయు పేళ్లు మున్నగు వాటిని తెలుపునట్టి పట్టికలనుబట్టి బ్రాహ్మణ కోడూరునకు తొలుత కరణములైన ప్రథమ శాఖీయ కౌండిన్య సగోత్రులకు మోటుపల్లి వర్తకాభివృద్ధియు, సముద్ర వ్యాపారాభివృద్ధి కీర్తియు గన్న అనవేమారెడ్డి (అనపోతారెడ్డి తమ్ముడు) "మందూరు"ను కరణిక గ్రామముగానిచ్చి, దానిని (బాహ్మణ కోడూరును) భారద్వాజసగోత్రులైన మాధవపెద్ది నాగేశ్వరశాస్త్రి గారికి ఏక భోగముగా దానముచేసినాడని, అరెడ్డి దత్త అగ్రహారములనుగూర్చి చెప్పు దండకవిలెయందు శ్లోకార్థ వివరణ మున్న పట్టికయొకటి సాక్ష్య మిచ్చుచున్నది.

బొ. వేం. కు. శ.


కోడూరు - V :

కోడూరు తెలంగాణమునందలి మహబూబునగరుజిల్లా మహబూబునగరము తాలూకాలోనున్న చిన్న గ్రామము. ప్రాచీనకాలమందు ఈ గ్రామము చారిత్రక ప్రసిద్ధిచెందిన రాజధాని పట్టణముగా విలసిల్లినట్లు శాసనాధారములు కలవు. రాష్ట్రకూటుల కాలమున చోళ మాండలికులకు ఇది రాజధానిగా నుండెను. రాష్ట్రకూటుల తరువాత రాజ్యమునకు వచ్చిన చాళుక్య ప్రథమతైలపుని సంతతివారు ఈ చోళులను జయించి తమ రాజప్రతినిధులను ఈ ప్రాంతముల నేలుటకు నియమించినప్పుడు వారలు కోడూరును రాజధానిగా జేసికొనియుండిరి. కోడూరు పట్టణమునేలిన మాండలికులు పశ్చిమ చాళుక్యచక్రవర్తులకు సామంతులుగా నుండిన తెలుగుచోడుల శాఖకు చెందినవారు. ఈ రాజులు తమ శాసనములందలి బిరుదావళులలో తాము “కోడూరుపురవరేశ్వరుల" మని చాటి యున్నారు.

1. క్రీ. శ. 1084 నాటిది గంగాపురశాసనము. ఇందు కోడూరు నవపురదస్థానపతి ధర్మము చేసినట్లు కలదు. ఇందు శ్రీ మత్ప్రతాపచక్రవర్తి జగదేకమల్లుడు ప్రశంసింపబడినాడు.

2. క్రీ. శ. 1108 నాటిది అలంపురశాసనము. ఇందు శ్రీ మన్మహామండలేశ్వర మల్లరసు అనువాడు అలంపురం శ్రీ బ్రహ్మేశ్వరదేవరకు అంగరంగభోగాలకు ధర్మము చేసినట్లు కలదు. ఈ మల్లరసు శ్రీమత్త్రిభువన మల్లదేవర పాదపద్మోపజీవి, సమధిగత - పంచమహాశబ్ద - మహామండలేశ్వర . . . కోడూరు పురవరేశ్వర...అని చెప్పుకొని యున్నాడు.

3. క్రీ. శ. 1110 నాటిది ఆలవానిపల్లి శాసనము. ఇందు “త్రిభువనమల్ల దేవర ప్రియపుత్రుడు మహామండలేశ్వర తైలపదేవుడు “కన్దూ స్యాన్ సిర కన్దూరువాడ. . .తత్పాద పద్మోపజీవి మహాప్రధాన మనె వేగ౯ డె..." రాజధాని కోళూరు నవపురపంచమఠస్థాన మహాజనులకు చేసిన ధర్మమును తెలుపును.

106