ఈ పుట ఆమోదించబడ్డది
68

సంస్కృతన్యాయములు

భైరవవిప్రన్యాయము

భైరవుఁడను విప్రుఁడొకఁడు రాజపురోహితుఁడుగా నుండు వాఁడు. అనుదినము రాజమందిరమునకుఁ బురోహితుఁడు పోవుచుండవలయునుఁగదా. రాజున కాతనిపై భక్తిశ్రద్ధలు మెండు. భైరవునిమాటకు రాజమందిరములో వలసినంత విలువ యుండెడిది. తక్కినవారు తమకది ప్రాణగొడ్డమై మాయోపాయమున భైరవుని రాజమందిరమునకు రాకుండఁ జేసిరి. భైరవుఁడు చాల దిగులొంది అడవికి లేచిపోయెను. రాజునకు వారు భైరవుఁడు చనిపోయెనని చెప్పిరి. రాజు కాఁబోలు నని నమ్మెను. ఒకనాఁడు, రాజు వేట కరిగెను. రాజురాఁక గమనించి భైరవుఁ డొకచెట్టుపై గూర్చుండి రాజు సమీపించినంతన "రాజా! నేను భైరవుఁడను. ఇదిగో, ఇక్కడ నున్నాను. నీపరిజనులు నన్ను మోసగించిరి" అని కేకలు వైచెను. అది విని పరివారము "రాజా! భైరవుఁడు భూతమైనాఁడు, సమీపమునకుఁ బోకుము. కీడు మూడును" అని రాజు నీవలకుఁ దెచ్చిరి. రాజుసయిత మాతఁడు నిజముగ భూతమేయని నమ్మి భూతోచ్చాటన సూక్తములను బఠింప మొదలిడెనఁట.

భైరవుఁడను బ్రాహ్మణుఁ డొకఁడు యజ్ఞార్థమై మేకను కొనిపోవుచుండెను. త్రోవలో ముగ్గురు దొంగలు దాని నపహరించుటకై అంచెలంచెలుగ బాటసారులవలె నుండిరి. దాపునకు వచ్చినంతన మొదటిదొంగ "అయ్యా! ఈ నల్ల