ఈ పుట ఆమోదించబడ్డది

39

సంస్కృతన్యాయములు

ఏదైన కొంతధనము వ్యయము చేయవలసివచ్చినప్పుడు ఇంకొకకొంచెము వ్యయమునకు వెనుదీయరాదు.

దామవ్యాలకటన్యాయము
  • ఒకప్పుడు తనకు చేదోడుగా నుండుటకై శంబరాసురుడు దాముడు, వ్యాలుడు, కటుడు అను ముగ్గురురాక్షసులను తనమాయచే సృజించెను. వారు ఒకే గ్రుద్దుకు పదికొండలు పిండిచేయగల బలము గలిగియుండెడువారు. కాని, ఆబలమును ఉపయోగించుట తెలియక వారు రానురాను బలహీనులై చివరకు దోమలై పుట్టిరి.
  • (అజ్ఞునికి ఉచ్చదశ వచ్చినా అథోగతికే మూల మవును.)
దారుపురుషన్యాయము
  • కఱ్ఱదుంగను జూచి మనుష్యుడని భ్రమించినట్లు.
దాహకదాహన్యాయము
  • మంటలేని అగ్ని కట్టెలతో గలిసి తానుకూడా ఆకట్టెల ఆకారమునే పొందును.
దివాతనచంద్రన్యాయము
  • పగటిచంద్రునివలె.
  • శోభ తఱగి యుండుట అనిభావము.
దివాంధన్యాయము
  • అందఱకు నిష్టముగనుండు పగలు గ్రుడ్లగూబకు అనిష్టముగ నుండును.